Share News

Supreme Court: వైదొలగండి!

ABN , Publish Date - May 08 , 2025 | 04:23 AM

వివాదాస్పద న్యాయమూర్తి జస్టిస్‌ యశ్వంత్‌ వర్మపై వచ్చిన నగదు అభియోగాలను సుప్రీంకోర్టు నియమించిన కమిటీ ధ్రువీకరించిందని, దీంతో న్యాయమూర్తిగా వైదొలగాలంటూ ఆయనను చీఫ్‌ జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా కోరారని పీటీఐ వార్తా సంస్థ తెలిపింది.

Supreme Court: వైదొలగండి!

  • నగదు బయటపడ్డ ఘటనలో జస్టిస్‌ వర్మను కోరిన సీజేఐ

  • న్యాయమూర్తిపై ఆరోపణలు వాస్తవమే

  • చీఫ్‌ జస్టిస్‌ ఖన్నాకు అందిన కమిటీ నివేదిక

  • నివేదికపై జస్టిస్‌ వర్మ వివరణకు ఆదేశం!

  • పీటీఐ వార్తా సంస్థ కథనం

న్యూఢిల్లీ, మే 7: వివాదాస్పద న్యాయమూర్తి జస్టిస్‌ యశ్వంత్‌ వర్మపై వచ్చిన నగదు అభియోగాలను సుప్రీంకోర్టు నియమించిన కమిటీ ధ్రువీకరించిందని, దీంతో న్యాయమూర్తిగా వైదొలగాలంటూ ఆయనను చీఫ్‌ జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా కోరారని పీటీఐ వార్తా సంస్థ తెలిపింది. కమిటీ ఇచ్చిన నివేదికను జస్టిస్‌ వర్మకు పంపించి, దానిపై వివరణ కోరినట్టు అభిజ్ఞ వర్గాలను ఉటంకిస్తూ పీటీఐ వెల్లడించింది. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా ఉండగా జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ నివాసంలో ఈ ఏడాది మార్చి 14వ తేదీన జరిగిన అగ్నిప్రమాదంలో భారీఎత్తున నగదు బయటపడటం అప్పట్లో తీవ్ర కలకలం రేపింది. నిప్పును ఆర్పడానికి వెళ్లినవారికి ఒక గదిలో కాలిన నగదు పెద్దఎత్తున కనిపించింది. న్యాయమూర్తుల ప్రతిష్ఠను ప్రశ్నార్థకం చేసిన ఈ ఘటనపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. పంజాబ్‌-హరియాణా హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ శీల్‌ నాగు, హిమాచల్‌ప్రదేశ్‌ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ జీఎస్‌ సందావాలీయా, కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ అనూ శివరామన్‌లతో ఒక కమిటీని ఏర్పాటుచేసింది. దాదాపు యాభైమంది సాక్షుల వాంగ్మూలాలను కమిటీ సేకరించింది.


న్యాయమూర్తి నివాసంలో అగ్నిప్రమాద ఘటనపై తొలుత స్పందించిన ఢిల్లీ పోలీస్‌ కమిషనర్‌ సంజయ్‌ అరోరా, ఢిల్లీ అగ్నిమాపక దళం చీఫ్‌ అతుల్‌ గార్గ్‌ నుంచీ వివరాలు తీసుకుంది. తన నివేదికను ఈ నెల 3వ తేదీన సుప్రీంకోర్టుకు కమిటీ సమర్పించింది. న్యాయమూర్తిపై వచ్చిన అభియోగాలను నిర్ధారించే పూర్తి ఆధారాలను కమిటీ సేకరించినట్టు సమాచారం. అయితే, తనపై వచ్చిన ఆరోపణలను తొలినుంచీ జస్టిస్‌ వర్మ ఖండిస్తున్నారు. కమిటీ పని కొనసాగుతుండగానే ఆయనను సుప్రీంకోర్టు కొలీజియం అలహాబాద్‌ హైకోర్టు న్యాయమూర్తిగా నియమించింది. దీనిపైనా అప్పట్లో విమర్శలు వచ్చాయి. సాధారణ ప్రక్రియలో భాగంగానే జస్టిస్‌ వర్మను బదిలీపై పంపినట్టు సుప్రీంకోర్టు తెలిపింది. బదిలీపై పంపినా కూడా, ఆయనపై వచ్చిన ఆరోపణల విషయం తేలేవరకు బాధ్యతలు ఇవ్వబోమని స్పష్టం చేసింది. మరోవైపు ఈ నెల 13వ తేదీన ప్రస్తుత సీకే పదవీవిరమణ చేయనున్నారు. ఈలోపే దీనికి ముగింపు పలకాలని జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా భావిస్తున్నారని సమాచారం.


ఈడీ కేసుల్లో నిందితులకు పత్రాలు ఇవ్వాల్సిందే

ఈడీ కేసుల్లో నిందితులు కోరిన పత్రాలు, ఇతర సమాచారాన్ని దర్యాప్తు పూర్తి కాలేదనే పేరిట నిరాకరించడానికి వీల్లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వాటిని ఇవ్వాల్సిందేనని తేల్చిచెప్పింది. నిష్పాక్షిక విచారణకు రాజ్యాంగం ఇస్తున్న హామీలో ఇది భాగమని నొక్కిచెప్పింది. ఈడీ పెట్టిన మనీలాండరింగ్‌ కేసులో తాను అడిగిన పత్రాలు, ఇతర సమాచారం ఇవ్వడానికి ఢిల్లీ హైకోర్టు నిరాకరించడాన్ని వ్యతిరేకిస్తూ సరళా గుప్తా అనే నిందితురాలు సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ప్రీ ట్రయల్‌ దశలో నిందితులు కోరిన సమాచారం, పత్రాలను ప్రాసిక్యూషన్‌ తప్పనిసరిగా ఇవ్వాల్సిన అవసరం లేదని ఢిల్లీ హైకోర్టు తన తీర్పులో పేర్కొంది. అయితే, దర్యాప్తు ఏ దశలో ఉన్నదనేదానితో సంబంధం లేకుండా నిందితులకు వారు కోరిన ఫిర్యాదు కాపీ, ఇతర పత్రాలను అందించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.


ఇవి కూడా చదవండి:

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ దాడికి ముందు..దాడి తర్వాత ఎలా ఉందంటే..


Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‎పై..సచిన్, సెహ్వాగ్ సహా పలువురి క్రీడా ప్రముఖుల స్పందన



Bank of Baroda Recruitment: టెన్త్ అర్హతతో బ్యాంకులో ఉద్యోగాలు..నెలకు రూ.37 వేల జీతం

Read More Business News and Latest Telugu News

Updated Date - May 08 , 2025 | 04:23 AM