Share News

Sonia Gandhi Voter ID: సోనియా గాంధీ ఓటరు ఐడీపై కోర్టులో సవాల్‌..

ABN , Publish Date - Sep 04 , 2025 | 08:08 PM

కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీపై ఢిల్లీ కోర్టులో దాఖలైన ఓ పిటిషన్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. సోనియా 1983లో అధికారికంగా భారత పౌరసత్వం పొందినప్పటికీ, 1980లోనే ఆమె పేరు ఓటరు జాబితాలో ఉందనే ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంపై ఇప్పుడు జోరుగా చర్చ సాగుతోంది.

Sonia Gandhi Voter ID: సోనియా గాంధీ ఓటరు ఐడీపై కోర్టులో సవాల్‌..
Sonia Gandhi Voter ID

కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీపై ఓ వివాదం వెలుగులోకి వచ్చింది. ఆమె భారతీయ పౌరసత్వం పొందక ముందే, అంటే 1980లోనే ఓటర్ల జాబితాలో ఆమె పేరు ఉందని ఆరోపిస్తూ ఢిల్లీ కోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. 1983లో సోనియా అధికారికంగా భారత పౌరసత్వం (Sonia Gandhi Voter ID) పొందినట్లు డాక్యుమెంట్లు చెబుతున్నాయి. కానీ అంతకు ముందే ఆమె ఓటరు ఎలా అయ్యారనే సందేహంతో ఈ పిటిషన్ దాఖలైంది.


పిటిషన్‌లో ఏముందంటే?

వికాస్ త్రిపాఠి అనే వ్యక్తి సీనియర్ అడ్వకేట్ పవన్ నారంగ్ ద్వారా ఈ పిటిషన్‌ను కోర్టులో దాఖలు చేశారు. ఇందులో ఆయన పేర్కొన్న వివరాల ప్రకారం సోనియా గాంధీ 1983 ఏప్రిల్ 30న భారత పౌరసత్వం పొందారు. కానీ 1980లో న్యూఢిల్లీలో ఓటర్ల జాబితాలో ఆమె పేరు నమోదైంది.

1982లో ఆ పేరు జాబితా నుంచి తొలగించబడింది. 1983లో మళ్లీ ఆమె పేరు జాబితాలో చేరింది. దీనిపై పిటిషనర్ అనుమానం వ్యక్తం చేస్తూ, ఆమెకు అప్పట్లో ఏ డాక్యుమెంట్లు ఉన్నాయని, ఆ సమయానికి పౌరసత్వం లేని స్థితిలో ఓటర్ల జాబితాలో ఆమె పేరు ఎలా వచ్చిందని ప్రశ్నించారు.


న్యాయవాది వాదనలు

సీనియర్ అడ్వకేట్ పవన్ నారంగ్ కోర్టులో మాట్లాడుతూ ఇది సరైన ప్రక్రియ కాదని, ఇందులో ఏదో తేడా ఉందన్నారు. ఓటరుగా నమోదు కావడానికి భారత పౌరసత్వం తప్పనిసరి. ఆ సమయానికి ఆమె పౌరురాలు కాకపోయినా, ఆమె పేరు ఎలా జాబితాలోకి వచ్చిందని ప్రశ్నించారు. ఇందులో వేరే వ్యక్తులు ప్రమేయం ఉండొచ్చని, ఎలక్షన్ కమిషన్ అధికారులపై కూడా అనుమానం ఉందన్నారు. ఇది ఓ పబ్లిక్ అథారిటీని మోసం చేసే ప్రయత్నంగా పరిగణించి దర్యాప్తు జరిపించాలని కోరారు.

కోర్టు నిర్ణయం ఏంటి?

ఈ అంశాన్ని విచారించిన ఢిల్లీ కోర్టు, తదుపరి విచారణను సెప్టెంబర్ 10కి వాయిదా వేసింది. ఆ రోజున తదుపరి విచారణ జరగనుంది. ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. అయితే గతంలో ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు పార్టీ వాటిని కొట్టి పారేసింది.


ఇవి కూడా చదవండి

మరో స్కామ్‌ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి

సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 04 , 2025 | 08:25 PM