Sonam Wangchuk: వాంగ్‌చుక్‌కు పాక్‌తో సంబంధాలు.. లద్దాఖ్ హింసపై డీజీపీ ప్రకటన
ABN , Publish Date - Sep 27 , 2025 | 04:31 PM
లెహ్‌లో నిరసనలను రెచ్చగొట్టారంటూ వాంగ్‌చుక్‌ను జాతీయ భద్రతా చట్టం (NSA)కింద శుక్రవారం నాడు అరెస్టు చేశారు. అనంతరం రాజస్థాన్‌లోని జోథ్‌పూర్ సెంట్రల్ జైలుకు ఆయనను తరలించారు.
లెహ్: కేంద్ర పాలిత ప్రాంతమైన లద్దాఖ్‌కు రాష్ట్ర హోదా కల్పించాలనే డిమాండ్‌తో ఇటీవల నిరాహార దీక్ష జరిపిన పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ (Sonam Wangchuk)కు పాకిస్థాన్ (Pakistan)తో సంబంధాలున్నాయని లద్దాఖ్ డీజీపీ ఎస్‌డీ సింగ్ జామ్వాల్ శనివారం నాడు తెలిపారు. పొరుగుదేశాల్లో ఆయన జరిపిన పర్యటనలపైనా ఆందోళన వ్యక్తం చేశారు.
లెహ్‌లో నిరసనలను రెచ్చగొట్టారంటూ వాంగ్‌చుక్‌ను జాతీయ భద్రతా చట్టం (NSA)కింద శుక్రవారం నాడు అరెస్టు చేశారు. అనంతరం రాజస్థాన్‌లోని జోథ్‌పూర్ సెంట్రల్ జైలుకు ఆయనను తరలించారు.
పట్టుబడిన పాక్ ఇంటెలిజెన్స్ అధికారి
డిజీపీ జామ్వాల్ శనివారం నాడు లెహ్‌లో జరిపిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, పాక్ ఇంటెలిజెన్స్ అధికారిని ఇటీవల పోలీసులు అరెస్టు చేశారని, అతను వాంగ్‌చుక్‌తో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరిపుతూ వచ్చారని తెలిపారు. 'సరిహద్దుల వెంబడి సమాచారాన్ని పంపుతున్న పాక్ పీఐఓని ఇటీవల మేము అరెస్టు చేశాం. అందుకు సంబంధించిన రికార్డులు మా దగ్గర ఉన్నాయి. ఆయన (వాంగ్‌చుక్) పాకిస్థాన్‌లో జరిగిన డాన్ ఈవెంట్‌కు హాజరయ్యారు. బంగ్లాదేశ్‌లోనూ పర్యటించారు. ఇవన్నీ అనేక ప్రశ్నలకు తావిస్తున్నాయి. ప్రస్తుతం వీటన్నింటిపై విచారణ జరుపుతున్నాం' అని చెప్పారు.
ఈనెల 24న లెహ్‌లో నిరసనల సందర్భంగా హింసను వాంగ్‌చుక్ రెచ్చగొట్టారని కూడా డీజీపీ ఆరోపించారు. ఆందోళనకారులు పలు వాహనాలకు, స్థానిక బీజేపీ కార్యాలయానికి నిప్పుపెట్టారు. పెద్దఎత్తున చెలరేగిన ఈ హింసాకాండలో నలుగురు మృతిచెందగా, సుమారు 80 మంది గాయపడ్డారు.
ఇవి కూడా చదవండి..
'ఐ లవ్ మహమ్మద్' నిరసనలు హింసాత్మకం.. తౌకీర్ రజా ఖాన్ అరెస్టు
రూ.60,000 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించిన మోదీ
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి