Shashi Tharoor Backs Rahul: రాహుల్ గాంధీకి శశి థరూర్ సపోర్ట్.. ఓట్ల వివాదంపై గళమెత్తిన కాంగ్రెస్
ABN , Publish Date - Aug 08 , 2025 | 11:06 AM
చాలా కాలం తర్వాత కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రముఖ నేత శశి థరూర్, రాహుల్ నిర్ణయాలకు బహిరంగంగా సపోర్ట్ చేస్తూ కీలక ప్రకటన చేశారు. అందుకు సంబంధించిన ప్రకటన ప్రస్తుతం వైరల్ అవుతోంది.
భారత రాజకీయాల్లో ఒక ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. కేరళ తిరువనంతపురం కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ చాలా రోజుల తర్వాత రాహుల్ గాంధీకి బహిరంగంగా మద్దతు (Shashi Tharoor Backs Rahul Gandhi) ప్రకటించారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ, ఎన్నికల కమిషన్ కుమ్మక్కై ఓట్ల చోరీ చేసిందన్న రాహుల్ గాంధీ ఆరోపణలకు థరూర్ సపోర్ట్ ఇచ్చారు. ఈ పరిణామం కాంగ్రెస్ పార్టీలో ఐక్యతను సూచిస్తుందా లేక కొత్త వివాదానికి దారి తీస్తుందా అనేది మాత్రం ఆసక్తికరంగా మారింది.
ఎన్నికల కమిషన్‌పై సంచలన వ్యాఖ్యలు
లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రాహుల్ గాంధీ, గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఎన్నికల కమిషన్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. బీజేపీ, ఎన్నికల కమిషన్ కలిసి 2024 ఎన్నికలను రిగ్గింగ్ చేశాయని, దీని వల్ల ప్రజాస్వామ్యం బలహీనపడుతోందన్నారు. మన రాజ్యాంగం ఒక వ్యక్తి-ఒక ఓటు సూత్రంపై నడుస్తుంది. కానీ, ఓటర్ల జాబితాలో నకిలీ పేర్లు, అసాధారణ ఓటింగ్ శాతం పెరుగుదల, ఎన్నికల కమిషన్ పక్షపాతం వంటి అంశాలు ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నార్థకం చేస్తున్నాయని రాహుల్ గాంధీ అన్నారు.
సాయంత్రం తర్వాత
మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కొత్త ఓటర్ల సంఖ్య అసాధారణంగా పెరిగిందని, కొన్ని ప్రాంతాల్లో ఓటర్ల సంఖ్య జనాభా కంటే ఎక్కువగా ఉందని ఆయన ఆరోపించారు. సాయంత్రం 5 గంటల తర్వాత ఓటింగ్ శాతం హఠాత్తుగా పెరగడం, కానీ పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలు లేకపోవడం వంటి అంశాలు సందేహాలను రేకెత్తిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. అభిప్రాయ సేకరణలు, ఎగ్జిట్ పోల్స్ తప్పుగా ఉండటం, మీడియా సృష్టించిన వాతావరణం కూడా ఈ సందేహాలను మరింత బలపరుస్తున్నాయని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
శశి థరూర్ మద్దతు: ఊహించని ట్విస్ట్
ఈ క్రమంలోనే శశి థరూర్ రాహుల్ గాంధీ ఆరోపణలకు మద్దతు ప్రకటించడం కాంగ్రెస్ పార్టీలోనే కాక, రాజకీయ వర్గాల్లో ఆశ్చర్యం కలిగించింది. గత కొన్ని నెలలుగా థరూర్ పార్టీ హైకమాండ్‌కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ప్రశంసించడం, అత్యవసర పరిస్థితిని విమర్శించడం వంటి అంశాలతో ఆయన కాంగ్రెస్‌లో విమర్శలు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా రాహుల్ గాంధీ ఆరోపణలకు థరూర్ మద్దతు ఇవ్వడం కీలక పరిణామంగా భావించవచ్చు.
ఎన్నికల కమిషన్
ఈ నేపథ్యంలో సోషల్ మీడియా ప్లాట్‌ఫాం Xలో థరూర్ ఇలా పేర్కొన్నారు. ప్రజాస్వామ్యం మన దేశ ఆత్మ. దాన్ని నిర్లక్ష్యం లేదా ఉద్దేశపూర్వక మోసం ద్వారా నాశనం చేయడానికి అనుమతించకూడదు. రాహుల్ గాంధీ లేవనెత్తిన ప్రశ్నలకు ఎన్నికల కమిషన్ సమాధానం చెప్పాలని పేర్కొన్నారు. ఈ ఆరోపణలపై పూర్తి దర్యాప్తు జరపాలని ఆయన డిమాండ్ చేశారు.
కాంగ్రెస్‌పై ప్రతి ఆరోపణలు
రాహుల్ గాంధీ ఆరోపణలను బీజేపీ తీవ్రంగా ఖండించింది. కాంగ్రెస్ ఓటమి నిరాశలో ఇలాంటి ఆధారాలు లేని ఆరోపణలు చేస్తోందని బీజేపీ నాయకులు అన్నారు. ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా పనిచేస్తోందని, కాంగ్రెస్ ఆరోపణలు రాజకీయ కుట్రలో భాగమని వారు ఆరోపించారు. ఈ వివాదం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.
ఇవి కూడా చదవండి
ఉద్యోగం పోయిన తర్వాత లోన్ EMIలు చెల్లించాలా? లేక మారటోరియం తీసుకోవాలా?
ఆగస్టులో 15 రోజులు బ్యాంకులకు సెలవులు.. ముందే ప్లాన్ చేసుకోండి
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి