BMC Elections: బీఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తుల్లేవ్... సమాజ్‌వాదీ పార్టీ ప్రకటన
ABN , Publish Date - Oct 22 , 2025 | 09:35 PM
పుణెలోని చారిత్రక శనివార్ వాడలో కొందరు మహిళలు నమాజ్ చేయడం వివాదం కావడంపై ఆయన మాట్లాడుతూ, అది ప్రార్థనా స్థలం కాదని, నమాజ్ సమయంలో కొందరు ప్రార్థనలు చేశారని చెప్పారు.
ముంబై: బృహాన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) ఎన్నికలపై సమాజ్‌వాదీ పార్టీ (Samajwadi Party) కీలక ప్రకటన చేసింది. బీఎంసీ ఎన్నికల్లో ముంబై, మహారాష్ట్ర ఏరియాల్లో తాము ఒంటరిగానే పోటీ చేస్తామని, కాంగ్రెస్‌తో కానీ మరే ఇతర పార్టీతో కానీ పొత్తులు ఉండవని ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు అబూ అజ్మి (Abu Azmi) బుధవారంనాడు తెలిపారు.
కాంగ్రెస్‌ను ప్రజలు క్షమించరు
కాంగ్రెస్ సహా అన్ని పార్టీలపైనా అబూ అజ్మి విమర్శలు గుప్పించారు. 'బిహార్‌లో కాంగ్రెస్ చేసింది తప్పు. దేశ ప్రజలు, బిహార్ ప్రజలు కాంగ్రెస్‌ను క్షమించరు. ఉద్ధవ్ ఠాక్రేతోనూ పొత్తు పెట్టుకోం. బాబ్రీ మసీదును కూల్చినందుకు గర్వపడుతున్నానంటూ అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. బిహారీలను చంపిన రాజ్ ఠాక్రేతోనూ పొత్తు పెట్టుకోం' అని ఆయన అన్నారు.
శనివార్ వాడలో నమాజ్ వివాదం
పుణెలోని చారిత్రక శనివార్ వాడలో కొందరు మహిళలు నమాజ్ చేయడం వివాదం కావడంపై ఆయన మాట్లాడుతూ, అది ప్రార్థనా స్థలం కాదని, నమాజ్ సమయంలో కొందరు ప్రార్థనలు చేశారని చెప్పారు. దీనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం తప్పని, శంభాజీనగర్‌లోని తాజ్ మహల్‌ను పోలిన బీబీ కా ముఖ్బారలో నమాజ్‌పై ప్రభుత్వం నిషేధం విధించడం కూడా తప్పేనని అన్నారు. 'హిందూ-ముస్లిం, ఇండియా-పాకిస్థాన్ అంశాలు లేవనెత్తి బీజేపీ ఎన్నికల్లో గెలుస్తోంది. అంతకుమించి వారికేమీ అంశాలు లేవు' అని మండిపడ్డారు.
యోగి హలాల్ సర్టిఫికెట్ వ్యాఖ్యలపై..
హలాల్ సర్టిఫికెట్‌పై యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చేసిన వ్యాఖ్యలపై మాట్లాడుతూ, ఆయన 'విద్వేష పూజారి' అని విమర్శించారు. అణిచివేత, విద్వేషం నుంచే టెర్రరిజం పుడుతుందన్నారు. 'మీరు పాకిస్థాన్‌తో క్రికెట్ ఆడారు, ఇప్పుడు ఆ డబ్బులు టెర్రరిజం కోసం ఉపయోగించవచ్చు' అని అన్నారు. అఖిలేష్ యాదవ్‌పై యోగి వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, అఖిలేష్ ప్రజానేత అని, ఆయనను ప్రజలు ఎన్నుకున్నారని అన్నారు. ఇవి కుటుంబం పేరుతో ఓట్లు వేసే రోజులు కావని, అఖిలేష్ ఏది సాధించినా ఆయన సొంత బలంతోనే సాధించారని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
కర్ణాటకలో కామరాజ్ ప్లాన్.. కాంగ్రెస్ కసరత్తు..
కాబోయే సీఎం ఆయనే.. బాంబు పేల్చిన సిద్ధరామయ్య తనయుడు
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి