Sabarimala Gold Theft: శబరిమల బంగారం చోరీపై సిట్ దర్యాప్తుకు కేరళ హైకోర్టు ఆదేశం
ABN , Publish Date - Oct 06 , 2025 | 03:04 PM
కేరళ శబరిమల అయ్యప్ప ఆలయం నుంచి బంగారం చోరీ జరిగిందన్న ఆరోపణలపై కేరళ హైకోర్టు ఇవాళ ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేసింది. ఈ దర్యాప్తు గోప్యంగా ఉండాలని..
కొచ్చి (కేరళ), అక్టోబర్ 6: శబరిమల అయ్యప్ప ఆలయ ద్వార పాలకుల బంగారు తాపడం నుంచి బంగారం చోరీ జరిగిందన్న ఆరోపణలపై ఇవాళ ప్రాథమికంగా విచారించిన కేరళ హైకోర్టు, దీనిపై ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఏర్పాటు చేసింది. అయితే, ఈ దర్యాప్తు గోప్యంగా ఉండాలని, ఎటువంటి సమాచారం లీక్ కాకూడదని కూడా ఉత్తర్వులిచ్చింది.
ఈ కేసు దర్యాప్తుకు మాజీ పోలీసు సూపరింటెండెంట్ ఎస్ శశిధరన్ నేతృత్వం వహిస్తారు. క్రైమ్ బ్రాంచ్ చీఫ్ అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ADGP) హెచ్ వెంకటేష్ పర్యవేక్షిస్తారు. ఈ దర్యాప్తు బృందంలో సైబర్ నిపుణులు సహా ముగ్గురు ఇన్స్పెక్టర్లు ఉంటారు.
శబరిమల ఆలయానికి చెందిన బంగారు పూతతో కూడిన రాగి పలకలను ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు (TDB) తొలగించిన 2019 నుండి దీనిపై దర్యాప్తు జరుగనుంది. కాగా, 2019లో ఆలయానికి విరాళంగా ఇచ్చిన రెండు బంగారు పూత పూసిన ఫలకాలు టీడీబీ ప్రాయోజిత, 'గ్లోబల్ అయ్యప్ప సంగమం' కార్యక్రమానికి ముందు స్ట్రాంగ్‌రూమ్ నుండి కనిపించకుండా పోయాయని ఉన్నికృష్ణన్ పొట్టి పేర్కొనడంతో దీనిపై వివాదం రేగిన సంగత తెలిసిందే.
అయితే, ఇటీవల ఐడీబీ విజిలెన్స్ విభాగం దేవాలయం నుంచి మాయమైన వస్తువులను స్వాధీనం చేసుకుంది. కానీ ఈ బంగారు ప్లేట్ల నుండి దాదాపు 5 కిలోల బరువు దగ్గిందని ఆరోపణలు వచ్చాయి. దీనిపై, కేరళ దేవాదాయశాఖ మంత్రి వి ఎన్ వాసవన్ మాట్లాడుతూ.. టీడీబీ విజిలెన్స్ అక్టోబర్ 8న హైకోర్టుకు తన ప్రాథమిక నివేదికను సమర్పిస్తుందని చెప్పారు.
ఈ క్రమంలో నిన్న.. శబరిమల అయ్యప్ప ఆలయంలో బంగారు పూత పనుల మాజీ సహాయకుడు, వ్యాపారవేత్త, బంగారు పలకల స్పాన్సర్ అయిన ఉన్నికృష్ణన్ పొట్టి వాంగ్మూలాన్ని టీడీబీ విజిలెన్స్ నమోదు చేసింది. తిరువనంతపురంలోని టిడిబి విజిలెన్స్ ప్రధాన కార్యాలయంలో ఉన్నికృష్ణన్ పొట్టిని దాదాపు మూడు గంటల పాటు ప్రశ్నించారు. అనంతరం ఆయన మీడియా ప్రశ్నలకు స్పష్టంగా సమాధానం ఇవ్వకుండానే అక్కడి నుంచి వెళ్లిపోబోయారు.
అయితే, మీడియా అతన్ని నొక్కి అడిగినప్పుడు,'నాకు ఒక వ్యక్తిగా స్వేచ్ఛ లేదా? హైకోర్టు ముందు ప్రతిదీ నిరూపితమౌతుంది. నాకు స్వేచ్ఛగా తిరిగే హక్కు లేదా? సత్యమే గెలుస్తుంది.అంటూ పొట్టి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ఇలా ఉండగా, కేరళ కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ (బిజెపి) రెండూ ఈరోజు నుండి ఈ అంశంపై రాష్ట్రవ్యాప్త ఆందోళనలను ప్రకటించాయి. అక్రమాలపై హైకోర్టు పర్యవేక్షణలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) దర్యాప్తును ఆ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి.
ఇలా ఉండగా, 2019, 2025 సంవత్సరాల్లో శబరిమల ఆలయం నుంచి బంగారు ప్లేట్లను మరమ్మత్తులు నిర్వహించే నిమిత్తం తీసివేశారు. వీటిని హైదరాబాద్, చెన్నైలోని వర్క్‌షాప్‌లకు పంపించారు. ఆ సమయంలోనే బంగారు పూతతో కూడిన ప్యానెల్‌లను తప్పుగా హ్యాండిల్ చేశారని, వాటి బరువు, బంగారం విషయంలో వ్యత్యాసాలు ఉన్నాయని ఆరోపణలు వచ్చాయి.
దీంతో మరమ్మతుల కోసం తీసుకున్న బంగారు పూతతో కూడిన ప్యానెల్‌లను వెంటనే తిరిగి ఇవ్వాలని కేరళ హైకోర్టు ఆదేశించింది. ఈ క్రమంలో కోర్టు నియమించిన శబరిమల స్పెషల్ కమిషనర్‌కు సమాచారం ఇవ్వకుండా TDB విధానపరమైన నిబంధనలను ఉల్లంఘించిందని ఆరోపణలు రావడంతో ఈ వివాదం మళ్లీ తీవ్రతరమైంది.
ఈ వార్తలు కూడా చదవండి...
ఏపీలో భారీ అగ్ని ప్రమాదం.. ఏమైందంటే..
వాయుగుండం ఎఫెక్ట్.. ఏపీలో భారీ వర్షాలు
Read Latest AP News And Telugu News