RJD Leader Rajkumar Rai: మరికొన్ని రోజుల్లో ఎన్నికలు.. కాల్పుల్లో ఆర్జేడీ నేత రాజ్ కుమార్ రాయ్ మృతి..
ABN , Publish Date - Sep 11 , 2025 | 11:02 AM
బీహార్‌లో రాబోయే అసెంబ్లీ ఎన్నికల వేళ కాల్పుల ఘటన వెలుగులోకి వచ్చింది. ఆర్జేడీ నేత, భూ వ్యాపారి రాజ్ కుమార్ రాయ్ దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
బీహార్(Bihar)లో రానున్న అసెంబ్లీ ఎన్నికల వేళ కాల్పులు కలకలం రేపుతున్నాయి. రాష్ట్రీయ జనతా దళ్ (RJD) నేత, వ్యాపారి రాజ్‌కుమార్ రాయ్ (52) (RJD Leader Rajkumar Rai) మంగళవారం రాత్రి పాట్నాలోని రాజేంద్ర నగర్ సమీపంలో దారుణంగా హత్య చేయబడ్డారు. రాజేంద్ర నగర్ టెర్మినల్ సమీపంలోని గల్లీ నెంబర్ 17 వద్ద ఈ దాడి జరిగింది. ఇద్దరు గుర్తు తెలియని దుండగులు రాజ్‌కుమార్ రాయ్‌ను వెంబడించి, ఆరు బుల్లెట్లతో కాల్చి చంపారు. రాష్ట్రంలో రానున్న అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈ హత్య జరగడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ఆసుపత్రికి తరలించగా...
రాయ్ దాడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించినప్పటికీ, దగ్గరి నుంచి కాల్పులు జరపడంతో కుప్పకూలిపోయారని సాక్షులు చెబుతున్నారు. సమాచారం తెలుసుకున్న తన అనుచరులు వెంటనే అతన్ని సమీప ఆసుపత్రికి తరలించగా, అక్కడ వైద్యులు ఆయన మృతి చెందినట్లు ధ్రువీకరించారు. పోలీసులు ఘటనా స్థలం నుంచి ఆరు బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. సమీపంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. దీంతోపాటు స్థానికులను విచారిస్తున్నారు.
కొనసాగుతున్న దర్యాప్తు
ఫోరెన్సిక్ నిపుణులు కూడా ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సీసీటీవీ ఫుటేజ్‌లో నిందితులు కనిపించారని పాట్నా తూర్పు సిటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పరిచయ్ తెలిపారు. ఇతర నేరస్థులు కూడా ఉండవచ్చన్నారు. రాయ్ డ్రైవర్‌తో పాటు ఇతర సాక్షులను విచారిస్తున్నారు. రాజ్‌కుమార్ రాయ్ రాజకీయంగా చురుకుగా ఉండేవారు. భూముల క్రయవిక్రయాల్లో పాల్గొనేవారు. ఈ హత్యపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
రాజ్‌కుమార్ రాయ్ ఎవరు?
రాజ్‌కుమార్ రాయ్ (52) వైశాలీ జిల్లాలోని రాఘోపూర్‌కు చెందినవారు. ఆయన ఆర్జేడీతో సంబంధం కలిగి ఉన్నారు. వైశాలీ జిల్లాలో ఆర్జేడీ పంచాయతీ రాజ్ సెల్‌కు జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. రాష్ట్రంలో రానున్న 2025 అసెంబ్లీ ఎన్నికల్లో తేజస్వీ యాదవ్ నియోజకవర్గమైన రాఘోపూర్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు. గతంలో కూడా ఆయన ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఈ హత్య బీహార్‌లో ఎన్నికల సమయంలో రాజకీయ హింస పెరుగుతుందనే ఆందోళనలను మరింత పెంచింది.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి