Ranjath Unveils Stealth Frigates: నావికాదళంలోకి ఉదయగిరి, హిమగిరి.. ఇక శత్రువులకు చుక్కలే..
ABN , Publish Date - Aug 26 , 2025 | 08:04 PM
ఐఎన్ఎస్ ఉదయగిరి, ఐఎన్ఎస్ హిమగిరిని విధుల్లోకి ప్రవేశపెట్టడం ద్వారా ఆత్మనిర్భర్ భారత్ కలలు సాకారమయ్యాయని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. దేశ భద్రతలో ఈ రెండు యుద్ధ నౌకలు చరిత్ర సృష్టిస్తాయనే నమ్మకం తనకుందని ధీమా వ్యక్తం చేశారు.
విశాఖపట్నం: భారత నావికాదళం బాధ్యత కేవలం సముద్రాన్ని పరిరక్షించడానికే పరిమితం కాదని, దేశ ఆర్థిక భద్రతకు కీలక స్తంభం అని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) అన్నారు. భారత ఇంధన అవసరాలైన చమురు, సహజ వాయువులు తీరప్రాంత భద్రతపై ఆధారపడి ఉంటాయని చెప్పారు. భారత నౌకాదళానికి చెందిన స్టెల్త్ ఫ్రిగేట్లు (stealth frigates) ఐఎన్ఎస్ ఉదయగిరి (INS Udayagiri), ఐఎన్ఎస్ హిమగిరి (INS Himagiri)ని మంగళవారం నాడు విశాఖపట్నం (Visakhapatnam)లో జరిగిన కార్యక్రమంలో విధుల్లోకి ప్రవేశపెట్టారు. ఐఎన్ఎస్ ఉదయగిరి, ఐఎన్ఎస్ హిమగిరి యుద్ధ నౌకలతో స్వయం సమృద్ధి భారతం కలలు సాకారమయ్యాయని, ఇది మన విజన్, అంకితభావానికి నిదర్శనమని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.
ప్రాజెక్ట్ 17ఏ (ఆల్ఫా) కింద దేశీయంగా నిర్మించిన రెండు యుద్ధ నౌకలను ఏకకాలంలో ప్రవేశపెట్టడం ఇదే మొదటిసారి. ఐఎన్ఎస్ ఉదయగిరిని ముంబైలోని మాజగావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ నిర్మించగా, ఐఎన్ఎస్ హిమగిరిని కోల్‌కతాలోని గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ (జీఆర్ఎస్ఈ) తయారు చేసింది.
ఈ రెండు యుద్ధ నౌకలతో భారత నావికాదళ సామర్థ్యం గణనీయంగా పెరుగుతుందని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ఐఎన్ఎస్ ఉదయగిరి, ఐఎన్ఎస్ హిమగిరిని విధుల్లోకి ప్రవేశపెట్టడం ద్వారా ఆత్మనిర్భర్ భారత్ కలలు సాకారమయ్యాయని అన్నారు. దేశ భద్రతలో ఈ రెండు యుద్ధ నౌకలు చరిత్ర సృష్టిస్తాయనే నమ్మకం తనకుందని ధీమా వ్యక్తం చేశారు.
ఆపరేషన్ సిందూర్‌తో గట్టి బదులిచ్చాం
పహల్గాం ఉగ్రదాడికి 'ఆపరేషన్ సిందూర్'తో దీటుగా జవాబిచ్చామని రాజ్‌నాథ్ ఈ సందర్భంగా అన్నారు. భారతదేశం ఎప్పుడూ ముందుగా బలప్రదర్శనకు దిగదని, ఆక్రమణలకు పాల్పడదని అన్నారు. అయితే దేశ భద్రతకు ముప్పువాటిల్లే పరిస్థితి ఎదురైతే ఎలా బుద్ధిచెప్పాలో భారత్‌కు బాగా తెలుసునని అన్నారు.
ఇవి కూడా చదవండి..
వైష్ణోదేవి మార్గంలో కొండచరియలు విరిగిపడి ఐదుగురు మృతి
వరద ఉగ్రరూపం.. కొట్టుకుపోయిన హైవే
For More National News