Vaishno Devi Landslide: వైష్ణోదేవి మార్గంలో కొండచరియలు విరిగిపడి ఐదుగురు మృతి
ABN , Publish Date - Aug 26 , 2025 | 06:32 PM
భారత వాతావరణ శాఖ జమ్మూకశ్మీర్‌లోని పలు ఏరియాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఈ ప్రాంతంలోని పలు నదులు ప్రమాదస్థాయికి మించి ప్రవహిస్తుండటంతో మరిన్ని చోట్ల కొండచరియలు విరిగిపడొచ్చని, మెరుపువరదలు సంభవించవచ్చని అప్రమత్తం చేసింది.
జమ్మూ: శ్రీవైష్ణోదేవి మందిరానికి వెళ్లే మార్గంలో మంగళవారంనాడు విషాద ఘటన చోటుచేసుకుంది. అర్ద్‌కువారి వద్ద ఇందప్రస్థ భోజనాలయ సమీపంలో కొండచరియలు విరిగిపడి ఐదుగురు మరణించగా, మరో 14 మంది గాయపడ్డారు. రెండు మృతదేహాలను స్వాధీనం చేసుకుని కాత్రా ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన పలువురిని వైద్యచికిత్స అందిస్తు్న్నారు. శ్రీమాతా వైష్ణోదేవి ఆలయ బోర్డు సమన్వయంతో ఎమర్జెన్సీ రెస్క్యూ టీమ్‌లు తక్షణ సహాయక చర్యలు చేపట్టాయి.
యాత్ర తాత్కాలికంగా నిలిపివేత
సొమవారం రాత్రి భారీ వర్షాలు కురియడంతో ఆలయ బోర్డు ముందుజాగ్రత్త చర్యగా వైష్ణోదేవి యాత్రను మంగళవారంనాడు తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ నేపథ్యంలో భక్తులు ఎలాంటి వదంతులు నమ్మవద్దని, ఆలయ బోర్డు అధికారిక సమాచారానికి అనుగుణంగా వ్యవహరించాలని అధికార యంత్రాగం భక్తులను కోరింది. కాగా, భారత వాతావరణ శాఖ జమ్మూకశ్మీర్‌లోని పలు ఏరియాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఈ ప్రాంతంలోని పలు నదులు ప్రమాదస్థాయికి మించి ప్రవహిస్తుండటంతో మరిన్ని చోట్ల కొండచరియలు విరిగిపడొచ్చని, మెరుపువరదలు సంభవించవచ్చని అప్రమత్తం చేసింది.
జమ్మూలోని రెండు ప్రాంతాల్లో క్లౌడ్‌బరస్ట్‌ల కారణంగా నేషనల్ హైవే-244 కోట్టుకుపోయినట్టు దోడా డీసీ హర్వీందర్ సింగ్ తెలిపారు. మెరుపువరదలకు గాంధోహ్‌లో ఇద్దరు, థాథ్రి సబ్‌డివిజన్‌లో ఒకరు చనిపోయినట్టు తెలిపారు. 15కు పైగా ఇళ్లు, పలు గోశాలలు, ఒక ప్రైవైటు ఆరోగ్య కేంద్రం దెబ్బతిన్నాయి. మూడు పాదచారుల వంతెనలు వరదలకు కొట్టుకుపోయాయి.
ఇవి కూడా చదవండి..
వరద ఉగ్రరూపం.. కొట్టుకుపోయిన హైవే
దోడాలో మెరుపు వరదలు, నలుగురు మృతి.. పలు ఇళ్లు నేలమట్టం
For More National News