Rahul Gandhi: 12,000 ప్రత్యేక రైళ్లు ఎక్కడ.. కిక్కిరిసిపోతున్న బిహార్ రైళ్లపై కేంద్రాన్ని నిలదీసిన రాహుల్
ABN , Publish Date - Oct 25 , 2025 | 04:59 PM
ఛఠ్ పండుగ కోసం బిహార్‌కు వెళ్లే వలస కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను రాహుల్ గాంధీ ప్రస్తావించారు. కొన్ని రైళ్లు సామార్థ్యానికి మించి 200 శాతం కెపాసిటీతో నడుస్తున్నాయని, కేంద్రంలోనూ, బిహార్‌లోనూ అధికారంలో ఉన్న 'డబుల్ ఇంజన్' ప్రభుత్వం పనితీరు ఇదేనా అని నిలదీశారు.
న్యూఢిల్లీ: పండుగల సీజన్‌లో రైళ్ల ఏర్పాట్లపై కేంద్రాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఘాటుగా విమర్శించారు. ముఖ్యంగా ఛఠ్ పండుగ (Chat festival) కోసం బిహార్‌కు వెళ్లే వలస కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆయన ప్రస్తావించారు. కొన్ని రైళ్లు సామార్థ్యానికి మించి 200 శాతం కెపాసిటీతో నడుస్తున్నాయని, కేంద్రంలోనూ, బిహార్‌లోనూ అధికారంలో ఉన్న 'డబుల్ ఇంజన్' ప్రభుత్వం పనితీరు ఇదేనా అని నిలదీశారు. పండుగ సీజన్‌లో 12,000 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నామని ఇచ్చిన వాగ్దానం ఏమైందని సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ప్రశ్నించారు. ఇందుకు సంబంధించిన వీడియోను కూడా పోస్ట్ చేశారు.
'బిహార్‌కు వెళ్లే రైళ్లు కిక్కిరిసిపోతున్నాయి. టిక్కెట్లు దొరకడం అసాధ్యంగా మారింది. ప్రయాణం అత్యంత అమానవీయంగా మారింది. పండుగ సీజన్‌లో అమానవీయంగా ప్రయాణికులను తీసుకు వెళ్తున్నారు. చాలా రైళ్లు 200 శాతం సామర్థ్యంతో నడుపుతున్నారు. జనం డోర్లు పట్టుకుని వేలాడుతున్నారు, చివరకు రూఫ్‌టాప్‌పై కూడా ప్రయాణిస్తున్నారు. ఎన్డీయే వంచన రాజకీయాలు, ఉద్దేశాలకు ఇది సజీవ నిదర్శనం'' అని రాహుల్ ఆ ట్వీట్‌లో విమర్శించారు.
కేంద్రంలో, బిహార్‌లో అధికారంలో ఉన్న డబుల్ ఇంజన్ గవర్న్‌మెంట్ పనితీరుపై విమర్శలు గుప్పించారు. 'మీరు చెప్పిన 12,000 ప్రత్యేక రైళ్లు ఎక్కడ? ప్రతి ఏడాది పరిస్థితులు ఎందుకు విషమిస్తున్నాయి? రాష్ట్రంలో (బిహార్) ఉద్యోగాలు, గౌరవప్రదమైన జీవనం ఉండే వాళ్లు ఉపాధి కోసం వేల కిలోమీటర్లు ఎందుకు వెళ్తారు? ఇది ప్రయాణికుల నిస్సహాయతకు మాత్రమే కాదు.. ఎన్డీయే వంచన రాజకీయాలకు ప్రత్యక్ష నిదర్శనం' అని రాహుల్ తప్పుపట్టారు.
12,011 ప్రత్యేక రైళ్లు
పండుగల సీజన్ రద్దీని దృష్టిలో పెట్టుకుని అక్టోబర్ 1వ తేదీ నుంచి నవంబర్ 30 వరకూ 12,011 ప్రత్యేక రైళ్ల ట్రిప్‌లు నడుపనున్నట్టు రైల్వే మంత్రిత్వ శాఖ గత బుధవారంనాడు ప్రకటించింది. ప్రతి రోజూ సుమారు 196 ప్రత్యేక రైళ్లు దేశవ్యాప్తంగా నడుస్తాయని తెలిపింది. అధికారుల సమాచారం ప్రకారం, అక్టోబర్ 18న గరిష్టంగా 280 రైళ్లను నడపగా, అక్టోబర్ 8న కనిష్టంగా 166 రైళ్లు నడిపారు.
ఇవి కూడా చదవండి..
యత్రీంద్ర అలా అనలేదు.. కుమారుడి వ్యాఖ్యలపై సిద్ధరామయ్య
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి