Rahul Gandhi: విద్య, ఉద్యోగాల్లో ఈబీసీలకు రిజర్వేషన్.. బిహార్ ఎన్నికల వేళ రాహుల్ వాగ్దానం
ABN , Publish Date - Sep 24 , 2025 | 07:49 PM
కాంగ్రెస్ 10 అంశాల కార్యక్రమంలో భాగంగా ఈబీసీల కోసం 'ఈబీసీ అట్రాసిటీస్ ప్రివెన్షన్ యాక్ట్' తీసుకువస్తామని వాగ్దానం చేసింది. ఎస్సీ/ఎస్టీలకు ప్రస్తుతం దేశంలో అమల్లో ఉన్న చట్టాల తరహాలోనే ఇది ఉంటుందని తెలిపింది.
పాట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ అత్యంత వెనుకబడిన తరగతుల (EBC) వారికి విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లపై దృష్టిపెట్టింది. 10 అంశాల కార్యక్రమాన్ని అమలు చేస్తామని ప్రకటించింది. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ కూటమితో తాము భాగస్వామిగా ఉన్న 'ఇండియా' కూటమి విజయం సాధించగానే రాష్ట్రంలో తక్షణం దీనిని అమలు చేస్తామని వాగ్దానం చేసింది. పాట్నాలో బుధవారం నాడు జరిగిన సీడబ్ల్యూసీ సమావేశం (CWC Meet)లో ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ తీర్మానం చేసింది. సీడబ్ల్యూసీ చేసిన తీర్మానాలను రాహుల్ గాంధీ (Rahul Gandhi) విడుదల చేశారు.
ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ.. 15 రోజులపాటు బిహార్‌లో తాము చేపట్టిన 'ఓటర్ అధికార్ యాత్ర'లో భాగంగా వివిధ జిల్లాల్లో పర్యటించామని, రాజ్యాంగంపై జరుగుతున్న దాడిని ప్రజలకు వివరించామని చెప్పారు. కేవలం బిహార్‌లోనే కాకుండా దేశవ్యాప్తంగా పౌరుల హక్కులను హరిస్తున్నారని ఆయన ఆరోపించారు. పార్లమెంటులో సైతం తాను ప్రధాని నరేంద్ర మోదీ ముందు రెండు విషయాలు చెప్పానని, దేశవ్యాప్తంగా కులగణన జరగాలని, 50 శాతం రిజర్వేషన్ గోడను తాము కూల్చివేస్తామని చాలా స్పష్టంగా చెప్పడం జరిగిందని తెలిపారు.
ఈబీసీలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలివే..
కాంగ్రెస్ 10 అంశాల కార్యక్రమంలో భాగంగా ఈబీసీల కోసం 'ఈబీసీ అట్రాసిటీస్ ప్రివెన్షన్ యాక్ట్' తీసుకువస్తామని వాగ్దానం చేసింది. ఎస్సీ/ఎస్టీలకు ప్రస్తుతం దేశంలో అమల్లో ఉన్న చట్టాల తరహాలోనే ఇది ఉంటుందని తెలిపింది. ఆర్టికల్ 15(5) కింద రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు విద్యా సంస్థల్లో రిజర్వేషన్లకు హామీ ఇచ్చింది. పంచాయతీలు, అర్బన్ లోకల్ బాడీస్‌లో ప్రస్తుతం ఉన్న 20 శాతం ఈబీసీ రిజర్వేషన్‌ను 30 శాతానికి పెంచుతామని తెలిపింది. 50 శాతం రిజర్వేషన్ పరిమితిని పెంచుతామని, జనాభా ప్రాతిపదికన కోటా అమలు చేస్తామని వాగ్దానం చేసింది. ఇందుకు సంబంధించిన చట్టాన్ని రాష్ట్ర అసెంబ్లీలో ఆమోదించి రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్‌లో చేర్చాల్సిందిగా కేంద్రాన్ని కోరుతామని తెలిపింది. నియామకాల ప్రక్రియలో 'నాట్ ఫౌండ్ సూటబుల్' (ఎన్‌ఎఫ్ఎస్) కాన్సెప్ట్ సరికాదని కాంగ్రెస్ పేర్కొంది. ఇది చట్టవిరుద్ధమని ప్రకటిస్తామని హామీ ఇచ్చింది. ఈ నిబంధన కింద వేకెన్సీలను భర్తీ చేయడం లేదని ఎస్సీలు, ఇతర వెనుకబడిన వర్గాలు ఆరోపిస్తున్నాయని తెలిపింది. ఈబీసీల జాబితాలో అండర్, ఓవర్ ఇన్‌క్లూజన్‌కు సంబంధించిన అన్ని అంశాలను పరిష్కరించేందుకు కమిటీని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది. ఈబీసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ క్యాటగిరీలో భూములు లేనివారికి రెసిడెన్షియల్ భూములు కేటాయిస్తామని, ప్రభుత్వ కాంట్రాక్టుల్లో రూ.25కోట్ల వరకూ ఉండే కాంట్రాక్టుల్లో ఈ కమ్యూనిటీలకు రిజర్వేషన్ కల్పిస్తామని తెలిపింది.
ఇవి కూడా చదవండి..
బిహార్ ఎన్నికలు మోదీ అవినీతి పాలన అంతానికి నాంది: ఖర్గే
లద్దాఖ్‌లో భగ్గుమన్న నిరసనలు.. తెరపైకి రాష్ట్ర హోదా డిమాండ్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి