Protest Erupts in Leh: లద్దాఖ్‌లో భగ్గుమన్న నిరసనలు.. తెరపైకి రాష్ట్ర హోదా డిమాండ్..
ABN , Publish Date - Sep 24 , 2025 | 03:15 PM
జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదాను కల్పించే ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం 2019 ఆగస్టు 5న రద్దు చేసింది. జమ్మూకశ్మీర్ రాష్ట్రాన్ని జమ్మూకశ్మీర్, లద్దాక్ కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. అప్పట్నించి రాష్ట్ర హోదా పునరుద్ధరణకు డిమాండ్లు వినిపిస్తున్నాయి.
శ్రీనగర్: కేంద్రపాలిత ప్రాంతమైన లద్దాఖ్ (Ladakh)లో బుధవారం నాడు తీవ్ర నిరసనలు చెలరేగాయి. లద్దాఖ్‌కు రాష్ట్ర హోదా డిమాండ్‌పై పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ సారథ్యంలో యువకులు రోడ్లపైకి వచ్చారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. శాంతియుతంగా ప్రారంభమైన నిరసనలు కొద్దిసేపటికే ఉద్రిక్తంగా మారాయి. పోలీసులు, పారామిలటరీ బలగాలతో నిరసనకారులు ఘర్షణకు దిగారు. సీఆర్‌పీఎఫ్ వాహనానికి నిప్పుపెట్టారు. దీంతో ఆ ప్రాంతంలో బలగాలు భద్రతను కట్టుదిట్టం చేశారు. నిరసనకారులు లద్దాక్‌కు పూర్తి రాష్ట్ర హోదా కల్పించాలంటూ పెద్దఎత్తున నినాదాలు హోరెత్తించారు.
రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్ కింద లద్దాఖ్‌కు రాష్ట్ర హోదా కల్పించాలనే డిమాండ్‌పై వాంగ్‌చుక్ సుదీర్ఘకాలంగా నిరశన దీక్ష చేస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర హోదా విషయంలో నిర్దిష్ట చర్యలు తీసుకోవడంలో విఫలమైందని ఆగ్రహిస్తున్న యువతకు వాంగ్‌చుక్ ఆందోళన ఆకర్షించినట్టు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో లెహ్‌లో చోటుచేసుకున్న నిరసనలను కట్టడి చేసేందుకు పోలీసులు ప్రయత్నించడంతో విద్యార్థులు నినాదాలు చేస్తూ తమ ఆందోళనను ఉధృతం చేశారు. రాళ్లురువ్వడంతోపాటు బీజేపీ కార్యాలయానికి నిప్పుపెట్టారు. దీంతో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయువును ప్రయోగించారు. లద్దాఖ్‌కు రాష్ట్ర హోదా కోరుతూ నిరసనకారులు రోడ్లపైకి రావడం ఇదే మొదటిసారి.
జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదాను కల్పించే ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం 2019 ఆగస్టు 5న రద్దు చేసింది. జమ్మూకశ్మీర్ రాష్ట్రాన్ని జమ్మూకశ్మీర్, లద్దాఖ్ కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. అప్పట్నించి రాష్ట్ర హోదా పునరుద్ధరణకు డిమాండ్లు వినిపిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి..
జమ్మూకశ్మీర్ నుంచి 4 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు ప్రకటించిన ఈసీ
బెట్టింగ్ యాప్ కేసు..ఈడీ ఎదుట హాజరైన సోనూసూద్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి