CWC Meet: బిహార్ ఎన్నికలు మోదీ అవినీతి పాలన అంతానికి నాంది: ఖర్గే
ABN , Publish Date - Sep 24 , 2025 | 04:11 PM
జాతీయంగా, అంతర్జాతీయంగా దేశం సవాళ్లు ఎదుర్కొంటున్న తరుణంలో సీడబ్ల్యూసీ సమావేశం జరుగుతోందని ఖర్గే అన్నారు. మోదీ, ఆయన ప్రభుత్వ దౌత్య వైఫల్యాల కారణంగానే అంతర్జాతీయంగా మనం సమస్యలను ఎదుర్కొంటున్నారని విమర్శించారు.
పాట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అవినీతి పాలన ముగింపునకు నాంది పలుకుతాయని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) అన్నారు. బిహార్ ప్రజలు బీజేపీ రెలీజియస్ పోలరైజేషన్‌పై ఏమాత్రం ఆసక్తిగా లేరని, అభివృద్ధి, సంక్షేమంతో కూడిన రాజకీయాలను కోరుకుంటున్నారని చెప్పారు. బిహార్‌లోని ఎన్డీయేలో అంతర్గత కలహాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయని, ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌ను ఒక భారంగా బీజేపీ భావిస్తోందని అన్నారు.
బిహార్ అసెంబ్లీ ఎన్నికల వ్యూహాన్ని ఖరారు చేసేందుకు, ఓట్ చోరీ అంశంపై బీజేపీని మరింత ఇరకాటంలో పెట్టే విషయమై చర్చించేందుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశం బిహార్ రాజధాని పాట్నాలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయమైన సదాకత్ ఆశ్రమంలో బుధవారం నాడు నిర్వహించారు. ఖర్గే అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, కోశాధికారి అజయ్ మాకెన్, ప్రధాన కార్యదర్శులు కేసీ వేణుగోపాల్, సచిన్ పైలట్, బిహార్ కాంగ్రెస్ చీఫ్ రాజేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. శాశ్వత, ప్రత్యేక ఆహ్వానితులు, పార్టీ ముఖ్యమంత్రులు, పీసీసీ అధ్యక్షులు, సీఎల్‌పీ నేతలు హాజరయ్యారు.
దౌత్య వైఫల్యంతోనే..
జాతీయంగా, అంతర్జాతీయంగా దేశం సవాళ్లు ఎదుర్కొంటున్న తరుణంలో సీడబ్ల్యూసీ సమావేశం జరుగుతోందని ఖర్గే ఈ సందర్భంగా అన్నారు. మోదీ, ఆయన ప్రభుత్వ దౌత్య వైఫల్యాల కారణంగానే అంతర్జాతీయంగా మనం సమస్యలను ఎదుర్కొంటున్నారని విమర్శించారు. మోదీ నా ఫ్రెండ్ అని చెప్పుకునే అమెరికా అధ్యక్షుడు ట్రంపే ఇప్పుడు ఇండియాను ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు.
ఓటు చోరీ అంశాన్ని ప్రస్తావిస్తూ ఎన్నికల కమిషన్ నిష్పాక్షికత, పారదర్శకతపై ఆందోళనలు తలెత్తుతున్నాయని ఖర్గే అన్నారు. వివిధ రాష్ట్రాల్లో అవకతవకలను రాహుల్ లేవనెత్తుతుంటే వాటిని పరిష్కరించకుండా అఫిడవిట్లు సమర్పించాలని ఈసీ ఒత్తిడి తెస్తోందన్నారు.
బిహార్ తరహాలోనే దేశవ్యాప్త కుట్ర
బిహార్ తరహాలోనే దేశవ్యాప్తంగా లక్షలాది మంది ఓటర్లను తొలగించేందుకు ప్రస్తుతం కుట్ర జరుగుతోందని ఖర్గే ఆరోపించారు. ఓట్ చోరీ అంటే రేషన్, పెన్షన్, మెడిసన్, దళితులు, గిరిజనులు, వెనుకబడిన తరగతులు, మైనారిటీలు, పేదల హక్కులను దొంగిలించడమేనని అన్నారు. ప్రజలు బహిరంగంగానే 'ఓటర్ హక్కుల యాత్ర'లో రాహుల్‌కు మద్దతు తెలిపారని చెప్పారు. ఈరోజు దేశం అనేక సమస్యలు ఎదుర్కొంటోందని, ఆర్థిక మాంద్యం, నిరుద్యోగం, సోషల్ పోలరైజేషన్, స్వయంప్రతిపత్తి కలిగిన రాజ్యాంగ సంస్థలను బలహీనపరచడం వంటి సమస్యలు ఉన్నాయని ఖర్గే అన్నారు.
ఇవి కూడా చదవండి..
లద్దాఖ్‌లో భగ్గుమన్న నిరసనలు.. తెరపైకి రాష్ట్ర హోదా డిమాండ్..
జమ్మూకశ్మీర్ నుంచి 4 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు ప్రకటించిన ఈసీ
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి