Rahul Allegations.. BJP Reaction: రాహుల్ ఆరోపణలు స్పందించిన బీజేపీ
ABN , Publish Date - Sep 18 , 2025 | 02:17 PM
కేంద్ర ఎన్నికల సంఘాన్ని లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ స్పందించింది. ఆ క్రమంలో రాహుల్‌పై బీజేపీ మండిపడింది.
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 18: ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. రాహుల్ ఆరోపణలకు మాజీ కేంద్రమంత్రి, బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ప్రెస్‌మీట్ పెట్టి మరీ రాహుల్ ఆరోపణలు తోసిపుచ్చారు. ఎన్నికల్లో ఓడిపోయి.. ప్రజల చేత పదే పదే తిరస్కరించబడిన నేత రాహుల్ గాంధీ అని ఎంపీ అనురాగ్ ఠాకూర్ సెటైర్లు వేశారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ దాదాపు 90 ఎన్నికల్లో ఓడిపోయిందని పేర్కొన్నారు.
కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ)పై లోక్‌సభలో ప్రతిపక్ష నేత, ఎంపీ రాహుల్ గాంధీ వరుసగా ఆరోపణలు చేస్తున్నారు. ఆ క్రమంలో సీఈసీపై గురువారం సైతం రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ న్యూఢిల్లీలో స్పందించారు. రాహుల్ గాంధీలో నిరాశ నిరంతరం పెరుగుతోందన్నారు. రాజకీయ ఆరోపణలను తన ఆభరణంగా రాహుల్ మార్చుకున్నారని వ్యాఖ్యానించారు. సీఈసీపై చేసిన ఆరోపణలను నిరూపించమని ప్రశ్నించమన్నప్పుడల్లా.. ఆయన వెనుదిరిగి పారిపోతున్నారంటూ ఎద్దేవా చేశారు.
ఆరోపణల నేపథ్యంలో అఫిడవిట్ ఇవ్వమని అడిగితే.. రాహుల్ వెనక్కి తగ్గుతారన్నారు. రాఫెల్, చౌకీదార్ చోర్ పై నిరాధారమైన ఆరోపణలు చేయడం అలవాటుగా మారిందంటూ రాహుల్ గాంధీపై బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ నిప్పులు చెరిగారు. పదే పదే తప్పుడు వాదనలు చేసి.. చివరకు క్షమాపణలు చెబుతారంటూ రాహుల్ వ్యవహార శైలిని ఈ సందర్భంగా బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ ఎండగట్టారు.
ఇంతకీ ఏం జరిగిందంటే..
కేంద్ర ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి ఆరోపణలు గుప్పించారు. గురువారం న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. 2023 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి పట్టున్న ప్రాంతాల్లో ఓట్లను తొలగించారని విమర్శించారు. నకిలీ లాగిన్లు, ఫోన్ నెంబర్లు వినియోగించి ఓటర్ ఐడీలను తొలగించారని ఆరోపించారు.
ఈ ప్రక్రియ రాష్ట్రం వెలుపల నుంచి సాగిందని తెలిపారు. ఈ ఓట్ల తొలగింపు ప్రక్రియను ప్రత్యేక సాఫ్ట్‌వేర్ వినియోగించి చేస్తున్నారన్నారు. ఇదంతా ప్రతిపక్ష పార్టీలకు ఓట్లు వేసే వారిని లక్ష్యంగా చేసుకుని జరుగుతుందంటూ రాహుల్ గాంధీ మండిపడ్డారు. ఈ నేపథ్యంలో రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ పై విధంగా స్పందించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
దసరాతో దశ తిరగనున్న రాశులు ఇవే..
జగన్ చెంప పగలగొట్టాలి.. అచ్చెన్న ఫైర్
For More National News And Telugu News