PM Modi RSS Event: ఆర్ఎస్ఎస్ ఈవెంట్‌లో రూ.100 నాణెం విడుదల చేసిన పీఎం.. ప్రత్యేకత ఏమిటంటే
ABN , Publish Date - Oct 01 , 2025 | 09:21 PM
రూ.100 నాణెంపై ఒకవైపు జాతీయ చిహ్నం (National Emblem) ముద్రించగా, మరోవైపు భరతమాత వరదముద్రతో సింహంతో సహా ఉన్న చిత్రం ముద్రించారు. స్వయం సేవకులు భరత మాత ముందు భక్తి, అంకితభావంతో ప్రణామం చేస్తున్నట్టు చిత్రీకరించారు.
న్యూఢిల్లీ: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) శతాబ్ది ఉత్సవాల సందర్భంగా రూ.100 నాణెం (Rs 100 Coin), పోస్టల్ స్టాంపు (Postal Stamp)ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) విడుదల చేశారు. ఈ నాణెంపై ఒకవైపు భరతమాత (Bharat Mata) చిత్రం ఉండటం ప్రత్యేకత సంతరించుకుంది. స్వతంత్ర్య భారతదేశ చరిత్రలో ఇండియన్ కరెన్సీపై భరతమాత ఉండటం ఇదే తొలిసారి. ఢిల్లీలోని బీఆర్ అంబేడ్కర్ ఇంటర్నేషనల్ సెంటర్‌లో జరుగుతున్న ఆర్ఎస్ఎస్ శతాబ్ది వేడుకల్లో ప్రధాని బుధవారం నాడు పాల్గొన్నారు.
నాణెం ప్రత్యేకత
రూ.100 నాణెంపై ఒకవైపు జాతీయ చిహ్నం (National Emblem) ముద్రించగా.. మరోవైపు భరతమాత వరదముద్రతో సింహంతో సహా ఉన్న చిత్రం ముద్రించారు. స్వయం సేవకులు భరత మాత ముందు భక్తి, అంకితభావంతో ప్రణామం చేస్తున్నట్టు చిత్రీకరించారు. 1925 నుంచి 2025 వరకూ 100 సంవత్సరాల రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అని నాణెంపై రాసి ఉంది. 'ప్రతీదీ దేశానికి అంకితం, ప్రతీదీ దేశానిదే, నాదంటూ ఏమీలేదు ('రాష్ట్రీయ స్వాహా, ఇదం రాష్ట్రీయ, ఇదం నమమ') అనే సంస్థ సిద్ధాంతాన్ని నాణెంపై చిత్రించారు.
స్వతంత్ర్య భారతదేశ చరిత్రలోనే ఇండియన్ కరెన్సీలో భరతమాత చిత్రాన్ని ముద్రించడం ఇదే మొదటిసారని, ఇదెంతో గర్వకారణమని, దీనికి చారిత్రక ప్రాధాన్యత ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సందర్భంగా చెప్పారు. 1963 రిపబ్లిక్ డే పరేడ్‌లో పాల్గొన్న ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను హైలైట్ చేస్తూ రూపొందించిన పోస్టల్ స్టాంపును కూడా ప్రధాని విడుదల చేశారు. శతాబ్ద కాలంగా సేవ, అంకితభావంతో ఆర్ఎస్ఎస్ సాగిస్తున్న సుదీర్ఘ ప్రయాణం ఎంతో ప్రాధాన్యత సంతరించుకుందని ప్రశంసించారు. దేశంపై ఉన్న భక్తి, త్యాగం, నిబద్ధతకు ఆర్ఎస్ఎస్ నిదర్శనమన్నారు. ఆర్ఎస్ఎస్ ప్రతి పనిలో నేషనల్ ఫస్ట్ అనేది కనిపిస్తుందని తెలిపారు.
ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలను కేంద్ర సాంస్కృతిక శాఖ నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబలె, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 3 శాతం డీఏ పెంపు
చొరబాటుదారులతో దేశానికి ముప్పు: ప్రధాని మోదీ..
For More National News And Telugu News