Dearness Allowance: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 3 శాతం డీఏ పెంపు
ABN , Publish Date - Oct 01 , 2025 | 07:07 PM
కేంద్ర ప్రభుత్వం ఏటా రెండుసార్లు డీఏ సవరిస్తుంది. తాజా సవరణతో ఈ ఏడాది రెండుసార్లు డీఏ పెంచినట్టు అవుతుంది. ఈ ఏడాది మార్చిలో ఉద్యోగులకు 2 శాతం డీఏ పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. కాగా, తాజాగా..
న్యూఢిల్లీ: దసరా పండుగ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కరవు భత్యాన్ని (DA- Dearness Allowence) 3 శాతం పెంచింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) అధ్యక్షతన బుధవారం నాడు జరిగిన సమావేశంలో కేంద్ర మంత్రివర్గం డీఏ పెంపుపై ఆమోదముద్ర వేసింది. సవరించిన డీఏ జూలై 1 నుంచి అమల్లోకి రానుంది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ బుధవారం నాడు వెల్లడించారు.
కేంద్ర ప్రభుత్వం ఏటా రెండుసార్లు డీఏ సవరిస్తుంది. తాజా సవరణతో ఈ ఏడాది రెండుసార్లు డీఏ పెంచినట్టు అవుతుంది. ఈ ఏడాది మార్చిలో ఉద్యోగులకు 2 శాతం డీఏ పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ పెంపుతో డీఏ అలవెన్స్ రేటు 53 నుంచి 55 శాతానికి పెరిగింది. తాజాగా 3 శాతం పెంపు నిర్ణయంతో 55 శాతంగా ఉన్న డీఏ 58 శాతానికి చేరనుంది. తాజా నిర్ణయంతో 49 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, 69 లక్షల మంది ఫించనుదారులు లబ్ధి పొందనున్నారు.
క్యాబినెట్ మరికొన్ని నిర్ణయాలు
కాగా, మంత్రివర్గ సమావేశంలో మరికొన్ని నిర్ణయాలు కూడా తీసుకున్నారు. 'మిషన్ ఫర్ ఆత్మనిర్భరత ఇన్ పల్సెస్' పేరుతో రూ.11,440 కోట్లతో పప్పుధాన్యాల స్వయం సమృద్ధికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. 2025-26 నుంచి 2030-31 వరకూ ఆరేళ్ల పాటు ఈ మిషన్‌ను అమలు చేస్తారు. 2025-26 బడ్జెట్‌లో 'మిషన్ ఫర్ అత్మనిర్భరత ఇన్ పల్సెస్'ను కేంద్రం ప్రకటించడం జరిగింది. కాగా, దేశవ్యాప్తంగా రూ.5,863 కోట్లతో 57 నూతన కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటు కూడా క్యాబినెట్ ఆమోదం తెలిపింది. తెలంగాణ రాష్ట్రానికి, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నాలుగేసి చొప్పున కేంద్రీయ విద్యాలయాలు మంజూరు చేసింది. 2026-27 మార్కెటింగ్ సంవత్సరానికి గోధుమలకు క్వింటాల్ మద్దతు ధరను 6.59 శాతం పెంచాలని కేంద్రం నిర్ణయించింది. ఆ ప్రకారం క్వింటాల్ కనీస మద్దతు ధర రూ.2,585కు చేరుతుంది. గతేడాది ఇది రూ.2,425గా ఉంది.
ఇవి కూడా చదవండి..
ఖర్గేకు అస్వస్థత.. గుండెకు పేస్‌మేకర్
నేను పీఎం అయితే.. ఒవైసీ ఆసక్తికర సమాధానం..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి