Asaduddin Owaisi: నేను పీఎం అయితే.. ఒవైసీ ఆసక్తికర సమాధానం..
ABN , Publish Date - Oct 01 , 2025 | 03:32 PM
పాక్ ఉగ్రచర్యకు గట్టి ప్రతీకారం తీర్చుకోవాలనే సెంటిమెంట్ ప్రజల్లో బలంగా ఉందని, అయితే ఉగ్రదాడి అనంతరం చేపట్టిన మిలటరీ ఆపరేషన్‌ను ముగించడంతో మంచి అవకాశాన్ని కేంద్ర జారవిడుచుకుందని ఒవైసీ అన్నారు.
న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడి అనంతరం పాకిస్థాన్ కు గట్టి సమాధానం చెప్పేందుకు వచ్చిన అవకాశాన్ని భారత ప్రభుత్వం జారవిడుచుకుందని ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) అన్నారు. పాక్ ఉగ్రచర్యకు గట్టి ప్రతీకారం తీర్చుకోవాలనే సెంటిమెంట్ ప్రజల్లో బలంగా ఉందని, అయితే ఉగ్రదాడి అనంతరం చేపట్టిన మిలటరీ ఆపరేషన్‌ను కేంద్రం ముగించడంతో మంచి అవకాశాన్ని జారవిడుచుకుందని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఒవైసీకి ఊహాజనిత ప్రశ్న ఒకటి ఎదురైంది.
మీరే ప్రధాని అయితే..
మీరే ప్రధాని అయి ఉంటే పహల్గాం ఉగ్రదాడి అనంతరం ఎలాంటి చర్య తీసుకునేవారని మీడియా అడిగిన ప్రశ్నకు ఒవైసీ సూటిగా స్పందించారు. 'వాస్తవానికి అనుగుణంగానే నేను వ్యవహరిస్తా. మా లక్ష్యం కేవలం అధికారంలో కూర్చోవడం, మంత్రులు కావడం కాదు. పహల్గాం ఉగ్రదాడి అనంతరం గట్టి సమాధానం చెప్పే మంచి అవకాశాన్ని మనం జారవిడుచుకున్నామని ఒక భారతీయుడిగా నేను గట్టిగా చెప్పగలను' అని అన్నారు.
ఎందుకు ఆపేశారు?
ఆపరేషన్ ఎందుకు ఆపేశారని ప్రశ్నించినప్పుడు... 'ఎందుకు ఆపేశారో నిజంగా నాకు తెలియదు. యుద్ధం తరహా పరిస్థితి నెలకొంది. అకస్మాత్తుగా ఆపరేషన్ ఆపేశారు. నేను చాలా ఆశ్చర్యానికి గురయ్యా. యావద్దేశం నిర్ణయాత్మక స్పందన తెలియజేసేందుకు రెడీగా ఉంది. పాకిస్థాన్‌కు గుణపాఠం నేర్పాలని కోరుకుంది. మళ్లీ అలాంటి అవకాశం రాదు. ప్రభుత్వం మంచి అవకాశాన్ని వదులుకుంది. ఇప్పుడు కేవలం పార్లమెంటులో కూర్చుని, పీఓకేను ఎలా తిరిగి రాబట్టుకోవాలనే దానిపై మాట్లాడుకోవాలి' అని ఒవైసీ అన్నారు.
కాగా, పహల్గాం ఉగ్రదాడికి స్పందనగానే ఆపరేషన్ సిందూర్ చేపట్టామని, తాత్కాలిక విరామం ఇచ్చినప్పటికీ ఆపరేషన్ సిందూర్ ఆగిపోయినట్టు కాదని, ఇది కొనసాగుతూనే ఉంటుందని ప్రభుత్వం ఇటీవల పలుమార్లు ప్రకటించింది. 2025 ఏప్రిల్ 22న పహల్గాం దాడిలో 26 మంది టూరిస్టులను ఉగ్రవాదులు అమానుషంగా బలి తీసుకున్నారు. ఇందుకు ప్రతిగా 'ఆపరేషన్ సిందూర్'తో పాక్‌లోకి భారత బలగాలు దూసుకెళ్లి 9 ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేశాయి. 100 మందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. అదే సమయంలో డ్రోన్లు, క్షిపణులతో జమ్మూకశ్మీర్‌లోని జనావాసాలే లక్ష్యంగా పాక్ దాడులకు పాల్పడగా భారత్ దీటుగా స్పందించింది. దీంతో పాక్ చేతులెత్తేసింది. కాల్పుల విరమణ ప్రతిపాదనతో ముందుకు రావడంతో భారత్ అంగీకరించింది.
ఇవి కూడా చదవండి..
ఖర్గేకు అస్వస్థత.. గుండెకు పేస్‌మేకర్
ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్.. డీఏ పెంచుతూ..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి