PM Modi Reacts on Kerala Polls: కామ్రేడ్ల కంచుకోటలో కాషాయ జెండా.. మోదీ సంచలన ట్వీట్..
ABN , Publish Date - Dec 13 , 2025 | 05:55 PM
కేరళలోని తిరువనంతపురంలో జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎన్డీఏ ఘన విజయం సాధించింది. దీంతో సుమారు 40ఏళ్ల తర్వాత అక్కడ కాషాయ జెండా ఎగిరింది. ఈ విషయమై ప్రధాని మోదీ సంచలన ట్వీట్ చేశారు. ఏమన్నారంటే...
ఇంటర్నెట్ డెస్క్: కేరళలోని తిరువనంతపురం(Thiruvananthapuram)లో జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో(Municipal Elections) బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ జయకేతనం ఎగురవేసింది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) అక్కడి ప్రజలకు ఎక్స్ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ విజయం కేరళ రాజకీయాల్లో ఓ కీలక మలుపు అని ఆయన అభిప్రాయపడ్డారు.
'తిరువనంతపురం ప్రజలకు ధన్యవాదాలు! నగర కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ-ఎన్డీఏ(BJP-NDA)కు ఆధిక్యం లభించడం కేరళ రాజకీయాల్లో(Kerala Politics) ఓ కీలక మలుపు. రాష్ట్ర అభివృద్ధి ఆకాంక్షలను మా పార్టీ మాత్రమే తీర్చగలదని ప్రజలు భావిస్తున్నారు. ఈ శక్తిమంతమైన నగరాభివృద్ధికి, ప్రజలకు జీవన సౌలభ్యాన్ని పెంపొందించేందుకు మా పార్టీ కృషి చేస్తుంది. ఈ ఎన్నికల్లో అద్భుత ఫలితాలను సాధించడంలో శ్రమించిన బీజేపీ కార్యకర్తలందరికీ నా కృతజ్ఞతలు. అట్టడుగు స్థాయి నుంచి పనిచేయడంలో కార్యకర్తల దీర్ఘకాల కృషి, పోరాటాలను నేడు మనం గుర్తుచేసుకోవాలి. మన కార్యకర్తలే మనకు బలం' అని మోదీ పేర్కొన్నారు.
ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో..
తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో.. 101 వార్డుల్లో ఎన్డీఏ 50 స్థానాలను గెలుచుకుని చారిత్రక విజయం సాధించింది(NDA Historic Victory). అక్కడ అధికారంలో ఉన్న లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్(LDF) కేవలం 29 వార్డులకు పరిమితమైంది. ఇక.. కాంగ్రెస్(Congress) నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్(UDF) 19 స్థానాలను సొంతం చేసుకోగా.. స్వతంత్ర అభ్యర్థులు రెండు వార్డులను కైవసం చేసుకున్నారు.
సీన్ రివర్స్..
2020లో జరిగిన ఇదే ఎన్నికల్లో.. ఎల్‌డీఎఫ్ 52 వార్డుల్లో విజయం సాధించింది. బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే(NDA) 33 స్థానాల్లో, యూడీఎఫ్ 10 చోట్ల గెలుపొందాయి. అయితే.. 2026లో కేరళలో అసెంబ్లీ ఎన్నికల(Kerala Assembly Elections) నేపథ్యంలో.. తాజాగా జరిగిన ఎన్నికల్లో బీజేపీ(BJP) ఆధిక్యం సాధించడం ప్రాధాన్యం సంతరించుకుంది. సుమారు నాలుగు దశాబ్దాల అనంతరం.. కమ్యూనిస్టు కంచుకోటలో కాషాయ జెండా ఎగరడంతో రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి.
ఇవీ చదవండి: