PM Modi likely to visit Manipur: మణిపూర్‌లో పర్యటించనున్న ప్రధాని మోదీ..!
ABN , Publish Date - Sep 02 , 2025 | 08:51 PM
మణిపూర్‌లోని మెయితీ, కూకీ తెగల మధ్య ఘర్షణలు చెలరేగాయి. ఈ ఘర్షణల్లో దాదాపు 250 మందికిపైగా మరణించారు. ఈ ఘర్షణల్లో భారీగా ఆస్తి నష్టం సైతం సంభవించింది.
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 02: జాతుల మధ్య ఘర్షణల కారణంగా మణిపూర్ అతలాకుతలమైంది. దీంతో మణిపూర్‌లో పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి. ఆ రాష్ట్రంలో ప్రధాని మోదీ పర్యటించనున్నారని సమాచారం. సెప్టెంబర్ 13వ తేదీన ప్రధాని మోదీ మణిపూర్‌లో పర్యటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రధాని మోదీ పర్యటనపై మిజోరం అధికారులు అవునంటూ స్పష్టత ఇస్తుండగా.. మణిపూర్ రాజధాని ఇంపాల్‌లోని ఉన్నతాధికారులు మాత్రం ప్రధాని పర్యటనపై తమకు ఇంకా నిర్థిష్టమైన సమాచారం అందలేదని చెబుతున్నారు.
సెప్టెంబర్ 13వ తేదీన ప్రధాని మోదీ ఈశాన్య రాష్ట్రమైన మిజోరంలో పర్యటించనున్నారు. అందులో భాగంగా 51.38 కిలోమీటర్లు పొడవైన బైరాబి - సైరాంగ్ రైల్వే లైన్‌ను ఆయన ప్రారంభించనున్నారు. ఈ రైల్వే లైన్.. అసోంలోని సిల్చార్ ద్వారా దేశంలోని మిగిలిన ప్రాంతాలతో ఐజ్వాల్‌ను కలుపుతోంది. ఈశాన్య ప్రాంతంలో ఆర్థికాభివృద్ధిని పెంచడమే లక్ష్యంగా కేంద్రం ఈ రైల్వే ప్రాజెక్ట్‌ను నిర్మించింది. ప్రధాని మోదీ పర్యటించనున్న సందర్భంగా మిజోరంలో అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు. ఈ పర్యటన అనంతరం ప్రధాని మోదీ మణిపూర్‌కు చేరుకుంటారని తెలుస్తోంది.
2023, మే నెలలో మణిపూర్‌లోని మెయితీ, కూకీ తెగల మధ్య ఘర్షణలు చెలరేగాయి. ఈ ఘర్షణల్లో దాదాపు 250 మందికిపైగా మరణించారు. ఈ ఘర్షణల్లో భారీగా ఆస్తి నష్టం సైతం సంభవించింది. దీంతో వేలాది మంది స్థానికులు మణిపూర్‌ను విడిచి ఇతర ప్రాంతాలకు తరలి పోయారు. మరోవైపు మణిపూర్‌లో బీజేపీ అధికారంలో ఉన్న సమయంలోనే ఈ ఘర్షణలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘర్షణల అనంతరం బీజేపీకి వివిధ పార్టీలు తమ మద్దతును ఉప సంహరించుకున్నాయి.
కానీ ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీకి తగినంత బలం ఉంది. కానీ బీరెన్ సింగ్ మాత్రం.. న్యూఢిల్లీలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో సమావేశమైన కొన్ని గంటలకే .. తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ కొద్ది రోజులకే మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన విధించారు. అంతకు కొద్ది నెలల ముందు కేంద్ర హోం శాఖ మాజీ కార్యదర్శి అజిత్ కుమార్ బల్లాను మణిపూర్ గవర్నర్‌గా మోదీ ప్రభుత్వం నియమించింది. అయితే మణిపూర్‌లో అడపాదడపా హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నా.. పరిస్థితి మాత్రం అదుపులోనే ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి..
రోడ్డు ప్రమాదం.. విద్యార్థులు మృతి
ఏపీ మహేష్ బ్యాంక్‌కు షాక్ ఇచ్చిన ఈడీ
For More National News And Telugu News