Share News

PM-Xi Boost India-China Ties: నేరుగా విమానాలు నుంచి వాణిజ్యం వరకూ.. బలపడుతున్న భారత్-చైనా బంధం

ABN , Publish Date - Aug 31 , 2025 | 06:02 PM

భారత్-చైనా స్నేహంగా ఉండటం సరైన నిర్ణయమని, ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన రెండు దేశాలు గ్లోబల్ సౌత్‌‌లో ముఖ్యమని, ఇరుదేశాల ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని సంబంధాల పునరుద్ధరణ బాధ్యత తాము తీసుకున్నామని జిన్‌పింగ్ చెప్పారు.

PM-Xi Boost India-China Ties: నేరుగా విమానాలు నుంచి వాణిజ్యం వరకూ.. బలపడుతున్న భారత్-చైనా బంధం
Modi with Jinping

న్యూఢిల్లీ: శాశ్వత శత్రువులు-శాశ్వత మిత్రులు అంటూ ఎవరూ ఉండరు, దీర్ఘకాలిక ప్రయోజనాలే ఉంటాయి, భారతదేశానికి ఎవరూ శత్రువు కాదు.. అంటూ ప్రధాని మోదీ చైనా పర్యటన ఉద్దేశాన్ని భారత్ ముందుగానే స్పష్టం చేసింది. షాంఘై సహకార సంస్థ వార్షిక సదస్సు కోసం చైనాలో పర్యటిస్తున్న మోదీ.. ఆ దేశ అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య సంబంధాలపై ఉభయులూ చర్చించారు. భారత్-చైనా స్నేహంగా ఉండటం సరైన నిర్ణయమని, ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన రెండు దేశాలు గ్లోబల్ సౌత్‌‌లో ముఖ్యమని, ఇరుదేశాల ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని సంబంధాల పునరుద్ధరణ బాధ్యత తాము తీసుకున్నామని జిన్‌పింగ్ చెప్పారు. పొరుగుదేశాలు మధ్య స్నేహపూర్వక సంబంధాలను ఆకాంక్షించారు. డ్రాగ్రెన్, ఏనుగు కలిసి రావడం సరైన ఎంపిక అన్నారు. మోదీ సైతం చైనాతో సానుకూల సంబంధాలకు భారత్ కట్టుబడి ఉందని ప్రకటించారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలలో నిలకడైన పురోగతి సాధిస్తుండటాన్ని అగ్రనేతలు ఇరువురూ స్వాగతించారు. భారత్‌పై భారీ సుంకాలతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విరుచుకుపడుతున్న నేపథ్యంలో చైనా-భారత్ మధ్య సంబంధాలు సానుకూల దిశలో సాగుతుండటంపై ప్రపంచ దేశాలు ఎంతో ఆసక్తి చూపుతున్నాయి.


మోదీ-జిన్‌పింగ్ సమావేశంలో ముఖ్యాంశాలు

-బ్రిక్స్ సదస్సు కోసం పది నెలల క్రితం తాము సమావేశమైన అనంతరం ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాల్లో నిలకడైన పురోగతి సాధించడాన్ని ప్రధాని మోదీ, అధ్యక్షుడు జిన్‌పింగ్ స్వాగతించారు. తాము భాగస్వాములమని, శత్రువులం కాదని, తమ మధ్య విభేదాలు గొడవులుగా మారకూడదని అభిలషించారు.

-ఇరు దేశాల మధ్య సయోధ్యను మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు రెండు దేశాల మధ్య నేరుగా విమాన సర్వీసులు పునఃప్రారంభం కానున్నట్టు మోదీ ప్రకటించారు. అయితే నిర్దిష్టమైన తేదీని వెల్లడించలేదు. కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో ఈ విమాన సర్వీసులను రద్దు చేశారు. దీంతో ప్రయాణికులు హాంకాంగ్, సింగపూర్‌ మీదుగా రాకపోకలు సాగించారు.

-కైలాశ్ మానససరోవర్ యాత్ర తిరిగి ప్రారంభం కావడాన్ని, టూరిస్ట్ వీసాల అంశాన్ని ప్రధాని మోదీ ప్రస్తావించారు. మౌంట్ కైలాశ్, మానసరోవర్ యాత్రను ఈ ఏడాది ప్రారంభంలో ఇండియా-చైనా తిరిగి ప్రారంభించాయి. గత నెలలో చైనా పౌరులకు టూరిస్టు వీసాల జారీని భారత్ ప్రారంభించింది. 2020లోనే కరోనా మహమ్మారి సమయంలోనే టూరిస్టు వీసాల జారీని ఇరుదేశాలు నిలిపివేశాయి.

-వ్యూహాత్మక స్వయంప్రతిపత్తిని, సంబంధాలను మూడో దేశం కోణం నుంచి ఇరుదేశాలు చూడరాదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఫెయిర్ ట్రేడ్, ద్వైపాక్షిక, ప్రాంతీయ, గ్లోబల్ అంశాలు, టెర్రరిజం వంటి సవాళ్లపై కామన్ గ్రౌండ్‌ను విస్తరించుకోవాల్సిన అవసరం ఉందని సంయుక్త ప్రకటనలో ఉభయనేతలు నిశ్చితాభిప్రాయం వ్యక్తం చేశారు.


-2020 గల్వాన్ ఘర్షణల అనంతరం ఇరు దేశాల సంబంధాలు క్షీణించాయి. కానీ ఉభయులూ విభేదాలు వీడి గత ఏడాది రష్యాలోని కజాన్‌లో సమావేశం కావడంతో సయోధ్యకు మార్గం సుగమమైంది. సైనిక బలగాల ఉపసంహరణతో సరిహద్దు ప్రాంతాల్లో శాంతి, సుస్థిరతలు నెలకొన్నాయని మోదీ, జిన్‌పింగ్ పేర్కొన్నారు.

-ఇండియా, చైనా మిత్రులుగా, మంచి ఇరుగుపొరుగుగా ఉండాల్సిన అవసరాన్ని జిన్‌పింగ్ నొక్కిచెప్పారు. గ్లోబల్ సౌత్‌లో రెండూ కీలక సభ్యులని, ఇరుదేశాల ప్రజల ప్రయోజనాల కోసం పరస్పరం కలిసి పనిచేయాల్సిన బాధ్యత తమ భుజస్కంధాలపై ఉందని అన్నారు.

-సరిహద్దు అంశాలను ఇరుదేశాల సంబంధాలకు ముడిపెట్టకుండా శాంతి, సుస్థిరత కోసం పాటుపడాలని జిన్‌పింగ్ అభిలషించారు. ఇరుదేశాల మధ్య సంబంధాలు వ్యూహాత్మక, దీర్ఘకాలిక దృక్కోణం నుంచి చూడాలని, ద్వైపాక్షిక సంబంధాలు ఆరోగ్యకరంగా, సుస్థిర అభివృద్ధి దిశగా సాగాలని సూచించారు.

-చైనాతో సంబంధాలు మెరుగుపడటం అధిక జనాభా ఉన్న దేశాలుగా ఇరుదేశాలకు దోహదకారి అవుతుంది. చైనా కంపెనీల ఎదుగుదలకు అవకాశం ఇవ్వడం ద్వారా ఇండియన్ ఈవీ సెక్టార్‌కు ప్రయోజనం చేకూరుతుంది. భారతీయ మార్కెట్ల ద్వారా చైనా ఎకానమీ కూడా బలపడుతుంది.


-సరిహద్దు వాణిజ్యాన్ని పునరుద్ధరించాలని ఈ నెల ప్రారంభంలో జరిగిన ఇరుదేశాల విదేశాంగ మంత్రుల స్థాయి సమావేశంలో అంగీకారం కుదిరింది. ప్రస్తుతం ఉన్న టారిఫ్ అనిశ్చితుల సమయంలో ఈ చర్య ఉభయులకు ప్రయోజనకారిగా ఉంటుందని భావిస్తున్నారు. అరుదైన ఖనిజాలు, ఎరువులు, టన్నెల్ బోరింగ్ మెషీన్ల వంటి అంశాల్లో భారత్ అవసరాలకు అనుగుణంగా సహకరించేందుకు చైనా హామీ ఇచ్చింది.

-ట్రంప్ సుంకాల బాదుడుతో భారత్-అమెరికా మధ్య సంబంధాలు ఇబ్బందుల్లో పడిన తరుణంలో మోదీ-జిన్‌పింగ్ మధ్య సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. బీజింగ్‌కు న్యూఢిల్లీ చేరువవుతుందడంతో అమెరిక విదేశాంగ విధానాన్ని ఇరుకున పెట్టే అవకాశాలున్నట్టు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


ఇవి కూడా చదవండి..

చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు ప్రధాని మోదీ ఆహ్వానం

అమిత్‌షాపై అభ్యంతకర వ్యాఖ్యలు.. మహువా మొయిత్రాపై ఎఫ్ఐఆర్

For More National News And Telugu News

Updated Date - Aug 31 , 2025 | 06:47 PM