PM Modi Invites Chinese President: చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు ప్రధాని మోదీ ఆహ్వానం
ABN , Publish Date - Aug 31 , 2025 | 04:25 PM
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను భారత్‌కు రావాలని ప్రధాని మోదీ ఆహ్వానించారు. 2026లో జరుగనున్న బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి రావాలని మోదీ కోరారు. టియాంజిన్‌లో జరిగిన SCO శిఖరాగ్ర సమావేశంలో ఇరువురు నేతలు పాల్గొన్నారు.
బీజింగ్/టియాంజిన్(చైనా), ఆగస్టు 31: చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను భారత్‌కు రావాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానించారు. 2026లో జరుగనున్న బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి రావాలని జిన్‌పింగ్‌ను మన ప్రధాని కోరారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను భారతదేశాన్ని సందర్శించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానించారని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) ఇవాళ (ఆదివారం) ఒక ప్రకటనలో తెలిపింది. ఇవాళ టియాంజిన్‌లో షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిన్‌పింగ్, మోదీ మధ్య సమావేశం తర్వాత మన ప్రధాని ఆహ్వానం పలికారని ఎంఈఏ పేర్కొంది.
భారత్ - చైనా అభివృద్ధి భాగస్వాములని, ప్రత్యర్థులు కాదని, వారి మధ్య ఉన్న విభేదాలు వివాదాలుగా మారకూడదని ప్రధాని మోదీ, జిన్‌పింగ్ పునరుద్ఘాటించారని కూడా ఎంఈఏ వెల్లడించింది. భారత, చైనా దేశాల మధ్య స్థిరమైన సంబంధం ఉండాలని ఇరువురు నేతలు నొక్కిచెప్పారని విదేశాంగ మంత్రిత్వశాఖ తెలిపింది. రెండు దేశాల అభివృద్ధి ప్రపంచానికి అవసరమని నొక్కి చెప్పింది. గతేడాది తూర్పు లడఖ్ నుంచి దళాలను విజయవంతంగా ఉపసంహరించుకోవడంతో ఇద్దరు నాయకులు సంతృప్తి చెందారని పేర్కొంది.
భారత్, చైనా మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడానికి ప్రత్యక్ష విమానాలు, కైలాష్ మానసరోవర్ యాత్రను తిరిగి ప్రారంభించడం చాలా కీలకమని ఇద్దరు నాయకులు అభిప్రాయపడ్డారు. భారత-చైనా సంబంధాన్ని మూడో దేశం దృష్టితో చూడకూడదని ఈ సందర్భంగా ప్రధాని మోదీ చైనాకు స్పష్టం చేశారు.
కై క్విని కలిసిన ప్రధాని మోదీ
ఈ సమావేశం తరువాత, చైనా కమ్యూనిస్ట్ పార్టీ పొలిట్‌బ్యూరో స్టాండింగ్ కమిటీ సభ్యుడు కైక్విని కూడా ప్రధాని మోదీ కలిశారు. 'ద్వైపాక్షిక సంబంధాల కోసం తన దృక్పథాన్ని ప్రధానమంత్రి మోదీ, కైతో పంచుకున్నారు. ఇద్దరు నాయకుల మధ్య కుదిరిన ఏకాభిప్రాయానికి అనుగుణంగా ద్వైపాక్షిక చర్చల్ని విస్తరించాలని, ఇరు దేశాల సంబంధాలను మరింత మెరుగుపరచాలని కై పునరుద్ఘాటించారని MEA తెలిపింది.
ఈ వార్తలు కూడా చదవండి..
కలెక్టరేట్ నిర్మాణంపై డిప్యూటీ స్పీకర్ కీలక వ్యాఖ్యలు
14, 15 తేదీల్లో తిరుపతిలో మహిళా పార్లమెంటేరియన్ల సమావేశం
For More AP News And Telugu News