Raghurama Krishnam Raju: కలెక్టరేట్ నిర్మాణంపై డిప్యూటీ స్పీకర్ కీలక వ్యాఖ్యలు
ABN , Publish Date - Aug 31 , 2025 | 12:33 PM
పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరేట్ నిర్మాణంపై టీడీపీ, వైసీపీ మధ్య వివాదం నెలకొంది. అలాంటి వేళ ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు తనదైన శైలిలో స్పందించారు.
భీమవరం, ఆగస్టు 31: పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరేట్ నిర్మాణంపై ఏపీ డిప్యూటీ స్పీకర్ కె. రఘురామకృష్ణరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం రహదారిపై నిలబడి భీమవరం బోర్డు, పెద అమిరంలోని స్థలాన్ని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు వేలు పెట్టి చూపించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మూడు రాజధానులుకట్టాలన్న వాళ్లు అఖిలపక్ష సమావేశమని రాద్ధాంతం చేశారంటూ మండిపడ్డారు. ఏడాదిన్నరగా దీని గురించి మాట్లాడిన వారు లేరన్నారు. రెండు లక్షల నలభై వేల ఎస్ఎఫ్‌టీతో అన్ని ఆఫీసులు ఉండేలా ప్లాన్ సైతం తాను ప్రభుత్వానికి సమర్పించానని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. అన్ని నియోజకవర్గాలకు ఈ స్థలం ఉత్తమంగా ఉందని ప్రపోజల్ ఇచ్చామని చెప్పారు. దీనిపై వైసీపీ వాళ్లు.. మీటింగ్ పెట్టి ఆందోళన చేస్తామని నిర్ణయించారని పేర్కొన్నారు.
మీరు మూడు రాజధానులు అన్నారు. కానీ తాము ఒకే రాజధాని అని ప్రకటించామని తెలిపారు. అబద్ధాలు చెప్పి రుషికొండ కొట్టేసి ప్యాలెస్ కట్టారని వ్యంగ్యంగా అన్నారు. రాజధాని రుషికొండలోనే ఉండాలి..ముఖ్యమంత్రి అందులోనే ఉండాలని ఆందోళన చేసుకొండంటూ వైసీపీ నేతలకు చురకలంటించారు. భీమవరంలో స్థలం లేదని జిల్లా పార్టీ ఆఫీసు ఉండిలో కట్టారా? అని ప్రశ్నించారు.
ఇంతకీ ఏం జరిగిందంటే..?
వైసీపీ ప్రభుత్వ హయాంలో జిల్లాల పునర్విభజన జరిగింది. అందులోభాగంగా పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రంగా భీమవరం ఏర్పాటు అయింది. దీంతో భీమవరంలో ఇంటిగ్రేటేడె కలెక్టరేట్ నిర్మించాలని అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం మార్కెట్ యార్డ్ స్థలాన్ని కూడా కేటాయించింది. ఆ సమయంలో పనులు ప్రారంభం కాలేదు. ఇంతలో ఎన్నికలు రావడం.. ప్రభుత్వం మారిపోవడం చకచక జరిగిపోయాయి. ప్రస్తుతం చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం పెదఅమిరంలో పరిధిలో కలెక్టరేట్ నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది.
అందుకు అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు సంపూర్ణ సహాయ సహకారాలు అందించేందుకు సిద్దమయ్యారు. అయితే భీమవరం నుంచి కలెక్టరేట్‌ను తరలిస్తే ఒప్పుకునేది లేదని ఏపీ శాసన మండలి చైర్మన్ కె. మోషేన్ రాజు హెచ్చరించారు. దీంతో జిల్లా కలెక్టరేట్ వివాదం రాజుకొంది. జిల్లాకు పరిపాలన భవనం లేదు. అన్నీ అద్దె భవనాల్లోనే నడుస్తున్నాయి. దీని వల్ల అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
సీఎం అభ్యర్థిగా ప్రకటించుకున్న తేజస్వీ
టేకాఫ్ అయిన వెంటనే వెనక్కి తిరిగొచ్చిన విమానం
For More AP News And Telugu News