Share News

Pakistan: బూచి... తూచ్‌!

ABN , Publish Date - May 08 , 2025 | 05:07 AM

పాకిస్థాన్‌ వద్ద అణ్వస్త్రాలు ఉన్నాయి. భారత్‌ మాపై దాడి చేసినా, మా ఉనికికి ముప్పు కలిగించినా భారత్‌పై అణ్వస్త్రాలు ప్రయోగించేస్తాం’’ అని పాక్‌ నేతలు భారత్‌ను తరచు బెదిరిస్తుంటారు.

Pakistan: బూచి... తూచ్‌!

  • అణు బెదిరింపుల్ని లెక్కచేయని భారత్‌

‘‘పాకిస్థాన్‌ వద్ద అణ్వస్త్రాలు ఉన్నాయి. భారత్‌ మాపై దాడి చేసినా, మా ఉనికికి ముప్పు కలిగించినా భారత్‌పై అణ్వస్త్రాలు ప్రయోగించేస్తాం’’ అని పాక్‌ నేతలు భారత్‌ను తరచు బెదిరిస్తుంటారు. కశ్మీర్‌ వంటి అపరిష్కృత సమస్యలు అణు ఘర్షణకు దారితీయవచ్చని 2019లో అప్పటి పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ వ్యాఖ్యానించారు. పాక్‌ను రెచ్చగొడితే అణ్వస్త్రాలు వాడడానికి సందేహించబోమని 2022లో పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీ నేత షాజియా మర్రీ హెచ్చరించారు. తాజాగా మొన్న ఏప్రిల్‌లో పాకిస్థాన్‌ మంత్రి హనీఫ్‌ అబ్బాసీ మరింత ముందుకు వెళ్లి ‘‘పాకిస్థాన్‌ వద్ద 130 అణు వార్‌హెడ్లు ఉన్నాయి. ఘోరీ, ఘజ్నవీ, షహీన్‌ క్షిపణులు ఉన్నాయి. అవన్నీ ప్రదర్శన కోసం కాదు. భారత్‌పై ప్రయోగించడం కోసమే’’ అంటూ దారుణంగా మాట్లాడారు. పాకిస్థాన్‌ ఓవైపు భారత్‌పై ఉగ్రవాద దాడులు చేయిస్తుంటుంది. దానికి సైనికపరంగా స్పందించాలని భారత్‌ ఆలోచిస్తే చాలు... అది అణు యుద్ధానికి దారితీస్తుందని, భారత్‌పై అణ్వాయుధాలు వేసేస్తామని బెదిరిస్తూ... భారత దాడిని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తుంటుంది. అంటే తన అణుబాంబులను బూచిగా చూపిస్తూ భారత్‌పై యథేచ్ఛగా ఉగ్రవాద దాడుల్ని కొనసాగించవచ్చని పాక్‌ భావిస్తుంటుంది. సంప్రదాయ ఆయుధాలతో యుద్ధం చేస్తే తాము ఓడిపోతామని తెలుసు కాబట్టి అలాంటి యుద్ధమే జరగకుండా అణ్వాయుధాల్ని అడ్డు పెట్టుకుంటుంటుంది. పాక్‌ నిర్మించుకున్న ఈ అణు కవచాన్ని భారత్‌ ఇటీవల మెల్లమెల్లగా బద్దలుకొడుతూ వస్తోంది.


1998లో భారత్‌ పోఖ్రాన్‌లో అణు పరీక్షలు నిర్వహించగా దానికి స్పందనగా పాక్‌ కూడా అణు పరీక్షలు జరిపింది. దీనితో రెండు దేశాలూ ప్రకటిత అణ్వస్త్ర రాజ్యాలుగా ఆవిర్భవించాయి. ఆ తర్వాత 1999లో పాక్‌ కార్గిల్‌ కొండల్ని ఆక్రమించగా భారత్‌ తన ఆర్మీయే కాదు వాయుసేనను కూడా ఉపయోగించి పాక్‌పై దాడి చేసింది. కానీ ఆనాటి యుద్ధమంతా భారత భూభాగంలోనే జరిగింది. ఆ సందర్భంలో కూడా పాక్‌ అణు బూచిని చూపించినా భారత్‌ లెక్కచేయలేదు. అలాగే 2001లో భారత పార్లమెంటుపై దాడి తర్వాత భారత్‌ అయిదు లక్షల సైన్యాన్ని పాక్‌ సరిహద్దులో మోహరించింది. అప్పుడు కూడా పాక్‌ అణు బెదిరింపులకు దిగింది. దీనిపై నాటి భారత ఆర్మీ చీఫ్‌ పద్మనాభన్‌ స్పందిస్తూ ‘‘ఒకవేళ పాక్‌ భారత్‌పై అణ్వస్త్ర ప్రయోగం చేస్తే భారత్‌ ప్రతిస్పందన ఎలా ఉంటుందంటే పాక్‌ ఏ రూపంలోనైనా ఈ భూమిపై కొనసాగడమే డౌట్‌ అనేలా ఉంటుంది’’ అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. అయినా అప్పుడు కూడా భారత్‌ సరిహద్దులు దాటి ముందుకు వెళ్లలేదు. కానీ పాక్‌ అణ్వస్త్ర బూచికి భయపడి వారి ఉగ్రవాద చర్యలను మనం భరించాల్సిందేనా అనే అంతర్మథనం భారత వ్యూహకర్తల్లో మొదలైంది.


దీనితో కోల్డ్‌స్టార్ట్‌ డాక్ట్రిన్‌ అనే ఒక వ్యూహాన్ని వారు రూపొందించారు. పాక్‌ అణ్వస్త్ర దాడి చేసేంత పెద్ద కారణాన్ని కల్పించకుండా పాక్‌లో పరిమిత దాడులు చేసి తాను అనుకున్న కొన్ని లక్ష్యాలను సత్వరం సాధించేలా తగిన వ్యూహాలను ఈ డాక్ట్రిన్‌లో పొందుపరిచారు. ఆ తర్వాత భారత్‌ ధోరణి చాలా మారింది. 2016 యూరి ఉగ్రవాద దాడుల తర్వాత భారత సైన్యం నియంత్రణ రేఖను దాటివెళ్లి మరీ పాక్‌ ఉగ్రవాద మూకలపై దాడి చేసింది. అలాగే 2019లో పుల్వామా దాడి తర్వాత అంతర్జాతీయ సరిహద్దు దాటి వెళ్లి పాక్‌లోని ఉగ్రవాద శిబిరాలపై వైమానిక దాడులు నిర్వహించింది. అంటే పాక్‌ అణు కవచాన్ని భారత్‌ మెల్లమెల్లగా ధ్వంసం చేయడం ప్రారంభించింది. ‘‘మీరు ఉగ్రవాదం చేస్తే మేం సైనిక దాడి చేసి తీరతాం. మీ అణు బెదిరింపులకు భయపడం’’ అని చాటి చెబుతూ వస్తోంది. తాజాగా జరిపిన ఆపరేషన్‌ సిందూర్‌తో ‘‘పాక్‌ అణు బూచి తూచ్‌’’ అని భారత్‌ మరింత గట్టిగా చెప్పినట్టు కనిపిస్తోంది. పాక్‌లోని అత్యున్నత అధికారుల నుంచి అణు బెదిరింపులు వచ్చినా లెక్క చేయకుండా ఒకేసారి తొమ్మిది లక్ష్యాలపై దాడులు చేయడం, అది కూడా వంద కిలోమీటర్ల లోపల ఉన్న ఉగ్ర శిబిరాలపై గురిపెట్టడం ద్వారా పాక్‌కు భారత్‌ గట్టి సందేశాన్నే పంపింది. తాను తరచు అణు బెదిరింపులు చేయడాన్ని అంతర్జాతీయ సమాజం కూడా హర్షించదని పాక్‌కు కూడా ఇప్పుడు తెలిసివస్తోంది.


ఇవి కూడా చదవండి:

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ దాడికి ముందు..దాడి తర్వాత ఎలా ఉందంటే..


Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‎పై..సచిన్, సెహ్వాగ్ సహా పలువురి క్రీడా ప్రముఖుల స్పందన



Bank of Baroda Recruitment: టెన్త్ అర్హతతో బ్యాంకులో ఉద్యోగాలు..నెలకు రూ.37 వేల జీతం

Read More Business News and Latest Telugu News

Updated Date - May 08 , 2025 | 05:07 AM