Draupadi Murmu: ఆత్మనిర్భర భారత్‌కు ఆపరేషన్ సిందూర్ ప్రతీక
ABN , Publish Date - Aug 14 , 2025 | 10:05 PM
79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా పహల్గాం ఉగ్రదాడి చర్యను పిరికిపంద చర్యగా ఆమె అభివర్ణించారు. ఇది అమానుషమైదని వ్యాఖ్యానించారు.
న్యూఢిల్లీ, ఆగస్టు 14: రక్షణ రంగంలో ఆత్మనిర్భర భారత్‌కు ఆపరేషన్ సిందూర్ ఒక ప్రతీక అని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. శుక్రవారం 79వ భారత స్వాతంత్ర దినోత్సవం. ఈ సందర్భంగా గురువారం న్యూఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతినుద్దేశించి ప్రసంగించారు. ఉగ్రవాద దాడి అనంతరం భారత్ ఐక్యతతో స్పందించిందన్నారు. దేశాన్ని విభజించే శక్తులపై భారత్ ప్రతిస్పందనకు ఇది నిదర్శనమని పేర్కొన్నారు. దేశ పౌరుల రక్షణ కోసం.. ప్రతీకారం తీర్చుకోవడానికి మనం ఏ మాత్రం వెనుకాడబోమనేందుకు ఇది నిదర్శనమని స్పష్టం చేశారు. భారత్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రపంచం గుర్తించిందని చెప్పారు. అందుకు ఆపరేషన్ సిందూర్ ద్వారా మనం సరైన మార్గంలోనే వెళ్లామన్నారు.
ఇక పెహల్గాం ఉగ్రదాడిని పిరికిపంద చర్య, పూర్తిగా అమానుషమని ఆమె అభివర్ణించారు. గణతంత్ర, స్వాతంత్ర దినోత్సవాలను దేశంలోని ప్రతి ఒక్కరు ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారని చెప్పారు. గత ఆర్థిక సంవత్సరంలో 6.5 శాతం జీడీపీ వృద్ధి రేటుతో భారత్.. ప్రపంచంలోనే ప్రధాన ఆర్థిక వ్యవస్థగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోందని ముర్ము తెలిపారు.
దేశంలో ద్రవ్యోల్బణం సైతం అదుపులో ఉందని పేర్కొన్నారు. దేశ ఆర్థిక రంగంలో మన విజయాలు ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయన్నారు. ఎగుమతులు సైతం పెరుగుతున్నాయని పేర్కొన్నారు. అన్ని కీలక సూచికలు మన ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని స్పష్ట పరుస్తున్నాయని తెలిపారు. సుపరిపాలన ద్వారా పెద్ద సంఖ్యలో ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారని వివరించారు.
దేశంలో ఆదాయ అసమానతలు తగ్గుతున్నాయన్నారు. అలాగే ప్రాంతీయ అసమానతలు కూడా అదృశ్యమవుతోందని విశ్వాసం వ్యక్తం చేశారు. గతంలో దేశంలోని వివిధ రాష్ట్రాలు, పలు ప్రాంతాల పరిస్థితులు.. అవి నేడు ఎలా అభివృద్ధి పథంలో పయనిస్తున్నాయో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వివరించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
బెనారస్ విశ్వవిద్యాలయంలో తెలుగు ఆచార్యుడిపై హత్యాయత్నం
సీఎంపై ప్రశంసలు.. ఎమ్మెల్యేను బహిష్కరించిన పార్టీ
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి