Encounter In Guma Forest: ఎన్‌కౌంటర్.. ఐదుగురు మావోయిస్టులు మృతి
ABN , Publish Date - Dec 25 , 2025 | 10:54 AM
కంధమాల్ జిల్లా బెల్ఘర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుమ్మా అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నట్లు పోలీసులకు నిఘా వర్గాల నుంచి సమాచారం అందింది. దీంతో కూబింగ్ నిర్వహించారు.
భువనేశ్వర్, డిసెంబర్ 25: ఒడిశా కంధమాల్ జిల్లా బెల్ఘర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుమ్మా అటవీ ప్రాంతంలో గురువారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు. గుమ్మా అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారంటూ ఒడిశా స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (SOG) నిఘా వర్గాల నుంచి సమాచారం అందింది. దీంతో కూంబింగ్ నిర్వహించారు. ఈ విషయాన్ని మావోయిస్టులు పసిగట్టి.. ఎస్‌ఓజీ పోలీసుల మీదకు కాల్పులు జరిపారు. దాంతో వారు సైతం ఎదురు కాల్పులకు దిగారు. ఇరువైపులా హోరాహోరీగా కాల్పులు జరిగాయి.
ఈ ప్రాంతంలో ఐదు మృతదేహాలను భద్రతా సిబ్బంది కనుగొన్నారు. మృతులు ఏసీఎం బారి అలియాస్ రాకేష్ రాయ్‌గడ్ ప్లాటూన్ సభ్యుడు అమృత్‌గా గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రాంతంలో మరిన్ని మృతదేహాలు లభ్యమయ్యే అవకాశం ఉందని ఎస్ఓజీ సిబ్బంది పేర్కొంటున్నారు.
దేశంలో మావోయిస్టుల నిర్మూలన కోసం కేంద్రం ఆపరేషన్ కగార్ అమలు చేస్తోంది. దీంతో ఛత్తీస్‌గఢ్‌లో భద్రతా బలగాలతోపాటు స్థానిక పోలీసులు కూంబింగ్ ద్వారా దండకారణ్యంలో జల్లెడపడుతున్నారు. ఈ నేపథ్యంలో వరుసగా ఎన్‌కౌంటర్లు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఎన్‌కౌంటర్లలో వందలాది మంది మరణించారు. వేలాది మంది అరెస్టయ్యారు. పలువురు సీనియర్ మావోయిస్టులు సైతం లొంగిపోయారు. అయితే ఛత్తీస్‌గఢ్‌లో నిరంతరాయంగా కూంబింగ్ జరుగుతోంది.
దీంతో మావోయిస్టులు సరిహద్దులోని రాష్ట్రాలకు తరలి పోతున్నారు. అలా ఒడిశాలోకి భారీగా మావోయిస్టులు చొరబడ్డారు. మరోవైపు లొంగిపోయే మవోయిస్టులకు ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం అందిస్తున్న నజరానా కంటే.. 10 శాతం అధికంగా ఇస్తామని ఒడిశా ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రకటన వెలువడిన కేవలం కొన్ని గంటల్లోనే 22 మంది మావోయిస్టులు మల్కాన్‌గిరి జిల్లా పోలీసులు ఎదుట లొంగిపోయారు. ఈ సందర్భంగా వారందరికి కలిపి రూ. 2 కోట్ల మేర రివార్డును అందజేశారు.
2026, మార్చి 31 నాటికి దేశంలో మావోయిస్టులు నిర్మూలనే లక్ష్యంగా కేంద్రం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. కేంద్ర తీసుకుంటున్న పటిష్టమైన చర్యల వల్ల మావోయిస్టులు దాదాపుగా తగ్గిపోయారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మళ్లీ బాంబు బెదిరింపు.. విమానం అత్యవసర ల్యాండింగ్..
మసీదులో బాంబు పేలుడు.. ఏడుగురి మృతి
For More National News And Telugu News