Siddaramaiah: మామధ్య వివాదాలు లేవు, కలిసి పనిచేస్తున్నాం.. సిద్ధరామయ్య క్లారిటీ
ABN , Publish Date - Dec 02 , 2025 | 03:43 PM
నాయకత్వ మార్పుపై అందరిలోనూ గందరగోళం నెలకొన్న నేపథ్యంలో సిద్ధరామయ్య ఇటీవల తన నివాసంలో డీకేకు బ్రేక్‌ఫాస్ట్ ఇచ్చారు. రెండో రౌడ్ బ్రేక్‌ఫాస్ట్ చర్చలు ఈసారి డీకే నివాసంలో జరిగాయి.
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి ఎస్.సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మంగళవారంనాడు కలిసి బ్రేక్‌ఫాస్ట్ చేశారు. డీకే శివకుమార్ ఆహ్వానం మేరకు ఆయన నివాసానికి సీఎం వెళ్లారు. నాయకత్వ మార్పుపై అందరిలోనూ గందరగోళం నెలకొన్న నేపథ్యంలో సిద్ధరామయ్య ఇటీవల తన నివాసంలో డీకేకు బ్రేక్‌ఫాస్ట్ ఇచ్చారు. రెండో రౌడ్ బ్రేక్‌ఫాస్ట్ చర్చలు ఈసారి డీకే నివాసంలో జరిగాయి. అనంతరం ఇరువురు నేతలూ ఐక్యతా సందేశాన్ని చాటుతూ మీడియా ముందుకు వచ్చారు. సమావేశం వివరాలను వెల్లడించారు.
ప్రభుత్వంలోని నేతలంతా ఐక్యంగా ఉన్నామని, 2028 అసెంబ్లీ ఎన్నికలను కలిసికట్టుగా ఎదుర్కొంటామని సిద్ధరామయ్య తెలిపారు. శివకుమార్‌తో విభేదాలు ఉన్నాయనే ఆరోపణలపై స్పందిస్తూ, తమ మధ్య ఎలాంటి వివాదాలు లేవని, తాము కలిసికట్టుగానే ప్రభుత్వాన్ని నడుపుతామని చెప్పారు. అసెంబ్లీలో బీజేపీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే దానిని బలంగా ఎదుర్కొంటామని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
కాగా, ముఖ్యమంత్రికి తన నివాసంలో బ్రేక్‌ఫాస్ట్ ఇచ్చానని, రాష్ట్రానికి సుపరిపాలన అందించడడానికి తాము కట్టుబడి ఉన్నామని, రాష్ట్రాభివృద్ధి విజన్‌ను కాంగ్రెస్ కొనసాగిస్తుందని డీకే శివకుమర్ సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో తెలిపారు. రొటోనషనల్ పద్ధతిలో డీకే శివకుమార్‌కు ముఖ్యమంత్రి పగ్గాలు అప్పగించాలని ఆయన వర్గీయులు డిమాండ్ చేస్తున్నారు. అధిష్ఠానంపై ఒత్తిడి తెచ్చేందుకు పలువురు ఎమ్మెల్యేలు ఇటీవల ఢిల్లీకి కూడా వెళ్లారు. అయితే తాను ఎమ్మెల్యేలను ఎవరినీ ఢిల్లీకి పంపలేదని, మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశాలున్నందున మంత్రి పదవుల కోసం వెళ్లి ఉండవచ్చని డీకే ఇటీవల తెలిపారు. నాయకత్వ మార్పుపై అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తాము కట్టుబడి ఉంటామని సిద్ధరామయ్య, డీకే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ముందుగా ఇరువురు నేతలు కలిసి చర్చించుకోవాలని, ఐక్యతా సందేశాన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని కాంగ్రెస్ అధిష్ఠానం వారికి సూచించింది.
ఇవి కూడా చదవండి..
సంచార్ సాథీ తప్పనిసరి కాదు, డిలీట్ చేయొచ్చు.. కేంద్ర మంత్రి వివరణ
పార్లమెంట్లో 'సంచార్ సాథీ' రగడ.. దేశ ప్రజల గోప్యతపై దాడి అంటూ విపక్షాల నిరసన
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి