Chennai Metro Rail: సబ్‌వేలో సడెన్‌గా ఆగిపోయిన చెన్నై మెట్రో రైలు.. ట్రాక్స్ వెంబడి ప్రయాణికుల నడక
ABN , Publish Date - Dec 02 , 2025 | 11:07 AM
సాంకేతిక లోపం కారణంగా చెన్నై మెట్రో రైలు అకస్మాత్తుగా సబ్‌వేలో నిలిచిపోయింది. దీంతో, ప్రయాణికులు సొరంగంలో ట్రాక్స్ వెంబడి నడుస్తూ మరో స్టేషన్‌కు చేరుకోవాల్సి వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
ఇంటర్నెట్ డెస్క్: చెన్నై మెట్రో ప్రయాణికులకు తాజాగా ఊహించని ఇబ్బంది ఎదురైంది. సబ్‌వేలో మెట్రోరైలు అకస్మాత్తుగా నిలిచిపోవడంతో వారంతా సొరంగంలోని రైల్వే ట్రాక్ వెంబడి నడుస్తూ బయటకు రావాల్సి వచ్చింది. విమ్కో నగర్ డిపాట్ స్టేషన్, చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు మధ్య మెట్రో బ్లూ లైన్‌లో సాంకేతికత లోపం కారణంగా రైలు అకస్మాత్తుగా ఆగిపోయింది. సెంట్రల్ మెట్రో, హైకోర్టు స్టేషన్ మధ్య రైలు అకస్మాత్తుగా నిలిచిపోవడంతో ప్రయాణికులు బెంబేలు పడ్డారు. విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయిందని ఫిర్యాదు చేశారు. అయితే, ఈ సమస్యకు గల కారణాలు మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది (Chennai Metro Rail Blue Line Technical Glitch).
దాదాపు 10 నిమిషాల పాటు రైల్లోనే ఉండిపోవాల్సి వచ్చిందని కొందరు ప్రయాణికులు చెప్పారు. చిక్కుకుపోయినట్టు అనిపించిందని అన్నారు. రైలు దిగి సమీపంలోని హైకోర్టు స్టేషన్‌కు వెళ్లాలన్న అనౌన్స్‌మెంట్ వినబడటంతో తాము 500 మీటర్ల దూరంలోని స్టేషన్‌కు ట్రాక్స్ వెంబడి నడుచుకుంటూ వెళ్లామని తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
ఘటన తరువాత సర్వీసులను పునరుద్ధరించామని చెన్నై మెట్రో రైల్ ఎక్స్ వేదికగా వెల్లడించింది. ‘బ్లూ లైన్‌లో ఎయిర్‌పోర్టు, విమ్కో నగర్ స్టేషన్‌ల సర్వీసులు మళ్లీ ప్రారంభమయ్యాయి. గ్రీన్‌లైన్‌లో కూడా రైళ్లు షెడ్యూల్ ప్రకారం నడుస్తున్నాయి’ అని సంస్థ ఎక్స్ వేదికగా తెలిపింది. ప్రయాణికులకు అసౌకర్యం కలిగినందుకు కూడా క్షమాపణలు చెప్పింది.
ఇవి కూడా చదవండి:
సెల్‌ఫోన్స్‌లో సంచార్ సాథీ యాప్ తప్పనిసరి.. ఫోన్ తయారీదార్లకు కేంద్రం ఆదేశాలు
ట్రంప్ ఎఫెక్ట్.. భారీగా ఆదాయాన్ని కోల్పోనున్న అమెరికా యూనివర్సిటీలు
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి