Sanchar Saathi App Controversy: పార్లమెంట్లో 'సంచార్ సాథీ' రగడ.. దేశ ప్రజల గోప్యతపై దాడి అంటూ విపక్షాల నిరసన
ABN , Publish Date - Dec 02 , 2025 | 12:26 PM
'సంచార్ సాథీ' అంశం ఇవాళ పార్లమెంట్ ఉభయసభల్ని కుదిపేసింది. ఈ యాప్ తీసుకురావడం ప్రజల ప్రైవసీని కేంద్రం హరించడమేనని విపక్షాలు ఆందోళనకు దిగాయి. దీనిపై చర్చకు వ్యతిరేకం కాదని అధికార పక్షం వివరణ ఇచ్చినప్పటికీ ప్రతిపక్షాలు శాంతించడం లేదు.
ఢిల్లీ, డిసెంబర్ 2: 'సంచార్ సాథీ' అంశం ఇవాళ (మంగళవారం) హస్తినతోపాటు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. దేశంలో విక్రయించే అన్ని కొత్త స్మార్ట్‌ఫోన్లలో సంచార్ సాథీ యాప్‌ను ప్రీ-ఇన్‌స్టాల్ (డిఫాల్ట్‌గా) చేయాలంటూ కేంద్రం ఇచ్చిన ఆదేశాలపై విపక్షాలు మండిపడుతున్నాయి.
పార్లమెంట్‌లో ఇవాళ ఈ అంశంపై తీవ్రస్థాయిలో చర్చ జరిగింది. ప్రధానంగా కాంగ్రెస్, శివసేన, UBT, TMC దీన్ని తీవ్రంగా విమర్శిస్తూ ఇది.. ప్రజల ప్రైవసీ ఉల్లంఘనే అంటూ సభా కార్యక్రమాలకు అడ్డుతగిలాయి. దీంతో సభలో తీవ్ర గందరగోళం ఏర్పడింది. విపక్ష కాంగ్రెస్ దీని మీద వాయిదా తీర్మానం దాఖలు చేసి సంచార్ సాథీపై విస్తృత చర్చ కావాలని డిమాండ్ చేసింది.
సంచార్ సాథీ యాప్.. ఫోన్ యూజర్ల కదలికల్ని, మెసేజెస్, కాల్స్ మానిటర్ చేస్తుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ దీనిని ఇదొక డిస్టోపియన్ టూల్ అని.. ఇది ప్రతి భారతీయుడిని మానిటర్ చేయడమే కాకుండా.. వారి ఆర్థిక హక్కులపై దాడిగా అభివర్ణించారు. దీని అమలు రాజ్యాంగ విరుద్ధమని విమర్శించారు.
లోక్‌సభలో కాంగ్రెస్ MP రేణుక చౌదరి దీనిపై వాయిదా తీర్మానం దాఖలు చేశారు. శివసేన UBT MP ప్రియాంక చతుర్వేది మాట్లాడుతూ ఇది ఒక దారుణమైన పరిణామమని.. ఇది భవిష్యత్‌లో నియంతృత్వానికి దారితీస్తుందన్నారు. ప్రజల గోప్యతను హరిస్తుందన్నారు. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ (TMC MP) సాగరిక ఘోష్ కూడా దీనిని తీవ్రంగా తప్పుబట్టారు. ఇది ప్రభుత్వంపై నమ్మకాన్ని సన్నగిల్లేలా చేస్తుందని విమర్శించారు.
విపక్షాల ఆందోళన నేపథ్యంలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరన్ రిజిజు.. సంచార్ సాథీ యాప్ పై వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. సంచార్ సాథీ మీద చర్చకు ప్రభుత్వం వ్యతిరేకం కాదని, కానీ ఎజెండా ప్రకారం సెషన్‌లో 14 బిల్లులపై ఫోకస్ పెడదామని సూచించారు. అటు, డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలికామ్ (DoT) కూడా దీనిపై స్పందించింది. సంచార్ సాథీ కేవలం ప్రజల సైబర్ సెక్యూరిటీ కోసం ఉద్దేశించింది మాత్రమేనని, ఇందులో ప్రైవసీ ఉల్లంఘన లేదంది. ఈ యాప్ యూజర్ డేటా రక్షిస్తుందని తెలియజేసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
ఐఏఎస్ అధికారి కుమార్తె ఆత్మహత్య
Read Latest Telangana News and National News