Caste Remarks: మరో వివాదంలో ఐపీఎస్ సునీల్
ABN , Publish Date - Dec 02 , 2025 | 06:30 AM
సీఐడీ మాజీ చీఫ్ పీవీ సునీల్ కుమార్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆలిండియా సర్వీస్ అధికారిగా ఉన్న సునీల్ కుమార్ బహిరంగ సభలో కులాల ప్రస్తావన తీసుకొచ్చారు.
బహిరంగ సభలో కులాల ప్రస్తావన
కాపులు, దళితులు ఏకమైతే రాజ్యాధికారం దక్కుతుందని వ్యాఖ్యలు
సర్వీస్ రూల్స్ ఉల్లంఘించారు: రఘురామ
చర్యలు తీసుకోవాలని కేంద్రానికి ఫిర్యాదు
అమరావతి, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): సీఐడీ మాజీ చీఫ్ పీవీ సునీల్ కుమార్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆలిండియా సర్వీస్ అధికారిగా ఉన్న సునీల్ కుమార్ బహిరంగ సభలో కులాల ప్రస్తావన తీసుకొచ్చారు. కాపులు, దళితులు ఏకమైతే రాజ్యాధికారం దక్కుతుందంటూ అనకాపల్లి జిల్లాలోని ఓ సభలో ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం లేపాయి. కాపు సీఎం, దళిత డిప్యూటీ సీఎం కొనసాగవచ్చంటూ సునీల్ బహిరంగంగా చేసిన సూచన రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశమైంది. సునీల్ వ్యాఖ్యలపై డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ఆలిండియా సర్వీస్ నిబంధనలు అతిక్రమించిన సునీల్ కుమార్‌పై చర్య తీసుకోవాలని డీవోపీటీకి లేఖ రాశారు. అగ్నిమాపక శాఖలో అవినీతికి పాల్పడ్డారంటూ ఏసీబీ కేసు.. అగ్రిగోల్డ్ లబ్ధిదారుల పేరుతో నిధులు పక్కదారి మళ్లించారన్న ఫిర్యాదు.. ప్రభుత్వ అనుమతి లేకుండా పలుమార్లు విదేశాలకు వెళ్లడంతో ఆయన సస్పెండ్ అయిన విషయాలను లేఖలో పేర్కొన్నారు. అఖిల భారత సర్వీస్ రూల్స్‌కు విరుద్ధంగా చేసిన వ్యాఖ్యలు సస్పెన్షన్‌లో ఉన్నప్పటికీ వర్తిస్తాయని, సునీల్ కుమార్‌ను సర్వీస్ నుంచి తొలగించాలని కేంద్రానికి రఘురామ విజ్ఞప్తి చేశారు. తరచూ వివాదాలకు కేంద్ర బిందువుగా నిలుస్తున్న సునీల్ కుమార్ ఏపీ పోలీసు శాఖలో వివిద హోదాల్లో పని చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో సీఐడీ ఏడీజీగా ఉన్నప్పుడు వైసీపీ మూకలు హైకోర్టు న్యాయమూర్తులపై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్వయంగా రిజిస్ట్రార్ ఫిర్యాదు చేసినా, వారి ఆచూకీ లభించలేదని కోర్టుకు సీఐడీ సమాధానం ఇచ్చింది. ఆ తర్వాత సీబీఐకి ఫిర్యాదు చేయడంతో మొత్తం 18 మందిపై చర్యలు తీసుకుంది.
విదేశాల్లో ఉన్న వారిని సైతం అరెస్టు చేసింది. అప్పటి ప్రతిపక్ష టీడీపీకి చెందిన వారిని అర్ధరాత్రి అరెస్టులు చేయించి చితకబాదించినట్లు సునీల్ కుమార్ పలుమార్లు ఆరోపణలు ఎదుర్కొన్నారు. అప్పటి నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజును అరెస్టు చేయడం, కస్టోడియల్ హింసకు గురిచేయడంతో సునీల్ చర్య దేశవ్యాప్తంగా సంచలనమైంది. కూటమి ప్రభుత్వం వచ్చాక గుంటూరు పోలీసులకు రఘురామ ఫిర్యాదు చేయడంతో ఆయనపై కేసు నమోదైంది. ఈ నెల 4న పోలీసుల ముందు విచారణకు సునీల్ హాజరు కావాల్సి ఉంది. ఇదే సమయంలో కులాల ప్రస్తావన తీసుకొస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.