MEA: భారత్ నుంచి బంగ్లాదేశ్ వ్యతిరేక కార్యకలాపాలను అనుమతించం.. ఎంఈఏ
ABN , Publish Date - Dec 14 , 2025 | 09:09 PM
ఢాకాలోని భారత హైకమిషనర్ ప్రణయ్ వర్మకు బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ సమన్లు పంపడం, భారత భూభాగం నుంచి మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో ఎంఈఏ తాజాగా స్పందించింది.
న్యూఢిల్లీ: భారత్‌పై బంగ్లా తాత్కాలిక ప్రభుత్వం చేసిన ఆరోపణలను కేంద్రం తోసిపుచ్చింది. బంగ్లాదేశ్ ప్రయోజనాలకు భంగం కలిగించేలా ఎలాంటి రాజకీయ కార్యకలాపాలను అనుమతించేది లేదని స్పష్టం చేసింది. బంగ్లాదేశ్‌లో స్వేచ్ఛాయుత ఎన్నికలకు తమ మద్దతు ఉంటుందని పునరుద్ఘాటించింది.
ఢాకాలోని భారత హైకమిషనర్ ప్రణయ్ వర్మకు బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ సమన్లు పంపడం, భారత భూభాగం నుంచి మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో ఎంఈఏ తాజాగా స్పందించారు. ఇండియాలో ఉంటున్న హసీనా నాయకత్వంలోని అవామీ లీగ్‌కు చెందిన కొందరు నేతలు బంగ్లా వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నట్టు ఢాకా చేసిన ఆరోపణలను ఎంఈఏ ఖండించింది. బంగ్లాదేశ్‌లో శాంతియుత వాతావరణంలో స్వేచ్ఛగా, సజావుగా ఎన్నికలు జరగాలని ఇండియా కోరుకుంటోందని మరోసారి తెలిపింది. స్నేహపూర్వకమైన బంగ్లా ప్రజల ప్రయోజనాలకు భంగం కలిగించే ఎలాంటి కార్యకలాపాలను తమ భూభాగంపై అనుమతించేది లేదని స్పష్టం చేసింది. బంగ్లా తాత్కాలిక ప్రభుత్వం శాంతియుతంగా ఎన్నికలు నిర్వహించడంతో పాటు అంతర్గత శాంతి భద్రతలను కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నట్టు తెలిపింది.
ఫిబ్రవరి 12న ఎన్నికలు
బంగ్లాదేశ్ పార్లమెంటరీ ఎన్నికలు వచ్చే ఏడాది ఫిబ్రవరి 12న జరుగనున్నాయి. గత ఏడాది ఆగస్టులో హింసాత్మక నిరసనలతో షేక్ హసీనా ప్రభుత్వం కుప్పకూలిన అనంతరం జరుగనున్న తొలి సార్వత్రిక ఎన్నికలు ఇవే కావడం విశేషం. అవామీ లీగ్‌ను తాజా ఎన్నికల్లో పోటీకి తాత్కాలిక మహమ్మద్ యూనస్ ప్రభుత్వం నిరాకరించింది. కాగా,షేక్ హసీనా విద్యార్థుల నిరనలను ఉక్కుపాదంతో అణిచివేసి, మానవత్వానికి వ్యతిరేకంగా క్రూర నేరాలకు పాల్పడ్డారని బంగ్లా ఇంటర్నేషన్ క్రైమ్ ట్రిబ్యునల్ ఇటీవల నిర్ధారించింది. హసీనాను దోషిగా పేర్కొంటూ మరణశిక్ష విధిస్తున్నట్టు ప్రకటించింది. షేక్ హసీనా అధికారం కోల్పోయినప్పటి నుంచి భారత్‌లో రహస్య ప్రదేశంలో ఆశ్రయం పొందుతున్నారు.
ఇవి కూడా చదవండి..
ఎన్నికల్లో బీజేపీ గెలవడానికి కారణమిదే.. ప్రియాంక గాంధీ సంచలన వ్యాఖ్యలు
ఢిల్లీ రామ్‌లీలా మైదానంలో కాంగ్రెస్ 'ఓట్ చోర్, గద్దీ ఛోడ్' మహా ధర్నా
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి