Share News

Bihar Final Rolls: బిహార్ ఓటర్ల తుది జాబితా వచ్చేసింది.. ఎంతమందిని తొలగించారంటే..

ABN , Publish Date - Oct 03 , 2025 | 05:41 PM

బిహార్ ఎన్నికల్లో గెలుపు ఓటములను మహిళా ఓటర్లు ప్రభావితం చేసే అవకాశాలు మెండు. ప్రధాన పార్టీలు, కూటములు ప్రధానంగా మహిళా ఓటర్లను కీలకంగా భావిస్తూ ప్రచారం సాగిస్తుంటాయి.

Bihar Final Rolls: బిహార్ ఓటర్ల తుది జాబితా వచ్చేసింది.. ఎంతమందిని తొలగించారంటే..
Bihar final rolls

పాట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల (Bihar Assembly Elections) నేపథ్యంలో చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)ను పూర్తి చేసిన ఎన్నికల కమిషన్ (Election Commission) తుది ఓటర్ల జాబితాను సెప్టెంబర్ 30న ప్రచురించింది. ఆ ప్రకారం తుది జాబితాలో మొత్తం అర్హులైన బిహార్ ఓటర్ల సంఖ్య 7.42 కోట్లకు చేరింది. ఆసక్తికరంగా ఈసారి తొలగింపునకు గురైన వారిలో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు.


ఓటర్ల తుది జాబితాలో పురుష ఓటర్ల తగ్గుదల 3.8 శాతానికి అంటే 15.5 లక్షలుగా ఉండగా, మహిళా ఓటర్ల తగ్గుదల 6.1 శాతానికి అంటే 22.7 లక్షలుగా ఉంది. బిహార్ ఎన్నికల్లో గెలుపు ఓటములను మహిళా ఓటర్లు ప్రభావితం చేసే అవకాశాలు మెండు. ప్రధాన పార్టీలు, కూటములు ముఖ్యంగా మహిళా ఓటర్లను కీలకంగా భావిస్తూ ప్రచారం సాగిస్తుంటాయి. ఇటీవలే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మహిళల కోసం ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్ యోజనను బిహార్‌లో ప్రకటించారు. మహిళల స్వయం ఉపాధి కోసం ఉద్దేశించిన ఈ పథకం కింద 75 లక్షల మంది మహిళలకు ఒక్కొక్కరికి రూ.10,000 చొప్పున వారి అకౌంట్లలో జమ చేశారు.


జిల్లాల వారీ ట్రెండ్స్

ఓటర్ల తుది జాబితా ప్రకారం అత్యధికంగా మహిళా ఓటర్లను గోపాల్‌గంజ్‌లో తొలగించారు. ఇక్కడ 15.1 శాతం అంటే 1.5 లక్షల ఓటర్లను తొలగించారు. జనవరిలో అది 10.3 లక్షలుగా ఉండగా, తుది జాబితాలో ఆ సంఖ్య 8.3 లక్షలకు ఖరారైంది. మహిళా ఓటర్ల తొలగింపులో రెండో స్థానంలో మధుబని ఉంది. ఇక్కడ 1.3 లక్షల మంది మహిళలను ఓటర్ల జాబితా నుంచి తొలగించారు. మూడో స్థానంలో పూర్వి చంపారన్ ఉండగా, ఇక్కడ 1.1 లక్షల మహిళా ఓటర్లను తొలగించారు. ఆ తర్వాత స్థానంలో సారణ్, భాగల్‌పుర్ ఉన్నాయి. ఇక్కడ చెరో లక్ష మంది మహిళా ఓటర్లను తొలగించారు. ఆసక్తికరంగా ఈ ఐదు ప్రాంతాలు పొరుగు రాష్ట్రం లేదా దేశానికి సరిహద్దు జిల్లాలుగా ఉన్నాయి. గోపాల్‌గంజ్, సరన్‌లు ఉత్తరప్రదేశ్ సరిహద్దు జిల్లాలుగా, మధుబని, పూర్వి చంపరన్ జిల్లాలు నేపాల్‌కు, భగల్‌పుర్‌ జిల్లా జార్ఖాండ్‌కు సరిహద్దులో ఉన్నాయి.


మహిళలతో పోలిస్తే తక్కువే అయినా పురుష ఓటర్లు గణనీయంగా తొలగింపునకు గురైన జిల్లాలో మధుబని, పాట్నా, శరణ్, పూర్వి చంపరన్, గోపాల్‌గంజ్ ఉన్నాయి. మధుబనిలో 95,000 పురుష ఓటర్లను తొలగించగా, పాట్నాలో 90,000, సారణ్‌లో 86,000, పూర్వ చంపరన్‌లో 85,000, గోపాల్‌గంజ్‌లో 80,000 పురుష ఓటర్లను తొలగించారు.


పురుష, స్త్రీ ఓటర్లు ఎక్కువగా తొలగించబడిన ఆరు జిల్లాల్లో గోపాల్‌గంజ్, మధుబని, పూర్వి చంపరన్, సారణ్, భగల్‌పుర్, పాట్నా ఉన్నాయి. ఈ ఆరింట్లో 59 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 2020 బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ 59 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 25 స్థానాలను మహా ఘట బంధన్ (MGB) గెలుచుకోగా, ఎన్డీయే (NDA) 34 సీట్లు గెలుచుకుంది. ఎన్నికల అనంతరం సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ (CSDS) చేపట్టిన సర్వే ప్రకారం 38 శాతం మహిళలు ఎన్డీయేకు ఓటు వేయగా, 37 మంది ఎంజీబీకి సపోర్ట్ చేశారు. పురుషుల్లో 36 శాతం ఎన్డీయేకు ఓటు వేయగా, 38 శాతం ఎంజీబీకి వేశారు. పోటీ రసవత్తరంగా ఉండటంతో ఎంజీబీపై ఎన్డీయే 11,500 ఓట్ల లీడింగ్‌లో ఉంది. గత ఎన్నికల్లో లీడింగ్ మార్జిన్ తక్కువగా ఉండటం, ఇప్పుడు గణనీయంగా మహిళా ఓటర్లను తొలగించడం త్వరలో జరుగనున్న ఎన్నికల్లో పార్టీలు లేదా కూటములపై ఆ మేరకు ప్రభావం చూపనుందనేది ఆసక్తికరంగా మారింది.


ఇవి కూడా చదవండి..

జాగ్రత్త.. ఉగ్రవాదాన్ని ఆపకపోతే ప్రపంచ పటం నుంచి తుడిచేస్తాం..

పాక్‌ను మోకాళ్లపై కూర్చోబెట్టాం.. ఐఏఎఫ్ చీఫ్ గూస్‌బమ్స్ కామెంట్లు

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Oct 03 , 2025 | 08:44 PM