Bihar Assembly polls: ఈసీ ప్రకటన తర్వాతే సీట్ల పంపకాలు.. ఎన్డీయే వ్యూహం ఇదే
ABN , Publish Date - Sep 23 , 2025 | 07:50 PM
అసెంబ్లీ ఎన్నికల తేదీలను అక్టోబర్ 15వ తేదీలోగా ఎన్నికల కమిషన్ ప్రకటించే అవకాశాలున్నాయి. ప్రస్తుత అసెంబ్లీ గడవు నవంబర్ 22వ తేదీలో ముగియనున్నందున ఆ రోజుకల్లా ఎన్నికల ప్రక్రియ పూర్తికావాల్సి ఉంటుంది.
పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో (Bihar Assembly polls) సీట్ల పంపకాలకు సంబంధించి అధికార ఎన్డీయే (NDA) నాయకత్వం వ్యూహాత్మకంగా వ్యవహరించనుంది. ఎలక్షన్ కమిషన్ ఎన్నికల తేదీలను ప్రకటించిన తర్వాతే సీట్ల పంపకాలపై ఒక నిర్ణయానికి రావాలని భావిస్తోంది. ఇందువల్ల టిక్కెట్లు ఆశించే వాళ్లు పార్టీలు మారకుండా అడ్డుకట్ట వేయవచ్చని ఎన్డీయే కూటమి ఆలోచనగా ఉందని బీజేపీ వర్గాల సమాచారం.
అక్టోబర్ 15లోగా..
అసెంబ్లీ ఎన్నికల తేదీలను అక్టోబర్ 15వ తేదీలోగా ఎన్నికల కమిషన్ ప్రకటించే అవకాశాలున్నాయి. ప్రస్తుత అసెంబ్లీ గడువు నవంబర్ 22వ తేదీలో ముగియనున్నందున ఆ రోజుకల్లా ఎన్నికల ప్రక్రియ పూర్తికావాల్సి ఉంటుంది.
బీజేపీ వర్గాల సమాచారం ప్రకారం, భాగస్వామ్య పక్షాలతో ఎన్డీయే ప్రస్తుతం ప్రాథమిక చర్చలు జరుపుతోంది. ఎన్నికల తేదీలను ఈసీ ప్రకటించిన అనంతరం సీట్ల పంపకాలపై తుది నిర్ణయం తీసుకోనుంది. ముందుగానే అభ్యర్థులను ప్రకటిస్తే టిక్కెట్లు దొరకని ఆశావహులు పార్టీ ఫిరాయించే అవకాశాలను ఉన్నందున అలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎన్డీయే ఆచితూచి వ్యవహరించనుందని చెబుతున్నారు.
పట్టుదలతో ఉన్న చిరాగ్ పాశ్వాన్
సీట్ల షేరింగ్ వ్యవహారంలో ఎన్డీయే భాగస్వామి అయిన కేంద్ర మంత్రి, లోక్ జనశక్తి పార్టీ (రామ్‌విలాస్) నేత చిరాగ్ పాశ్వాన్ సాధ్యమైనన్ని ఎక్కువ సీట్లు తమ వాటాగా రాబట్టాలనే పట్టుదలతో ఉన్నారు. గత ఏడాది లోక్‌సభ ఎన్నికల్లో ఐదు సీట్లలో పోటీ చేసి ఐదింట్లోనూ గెలవడంతో ఈసారి 40 అసెంబ్లీ సీట్లు కావాలని ఆయన పట్టుబడుతున్నట్టు సమాచారం. పాశ్వాన్ మద్దతుదారులు ఆయనను సీఎం అభ్యర్థిగా ఫోకస్ చేస్తుండటం కూడా కీలకంగా మారింది. నితీష్‌ను సీఎంగా అంగీకరిస్తామని ఆయన పైకి చెబుతున్నా ప్రస్తుత ప్రభుత్వంపై ఆయన చేసిన బహిరంగ విమర్శలు అనేక ప్రశ్నలకు తావిస్తున్నాయి. అదీగాక, గతంలో నీతీష్-చిరాగ్, నితీష్-రామ్ విలాస్ పాశ్వాన్ మధ్య విభేదాలు అందరికీ తెలిసిందే. సీట్ల షేరింగ్ విషయంలో రాజీ లేదని కూడా చిరాగ్ చెబుతున్నారు. తన వర్గం వారిని సంతృప్తి పరచాలన్నా ఎక్కువ సీట్లు డిమాండ్ చేయాల్సిన పరిస్థితి ఆయనకు ఉంది.
చిరాగ్ పాశ్వాన్ 40 ప్లస్ సీట్లు అడుగుతుంటే, నీతీష్ కుమార్ జేడీయూ మాత్రం 20 సీట్లకే చిరాగ్‌ను కట్టడి చేయాలని భావిస్తున్నట్టు చెబుతున్నారు. బీజేపీ నేతలు మాత్రం ఎన్డీయేకు చిరాగ్ కీలకమని చెబుతున్నారు. 2020 ఎన్నికల్లో చిరాగ్ పార్టీ సొంతంగా 135 సీట్లలో పోటీ చేసింది. కేవలం ఒకే సీటులో ఆ పార్టీ గెలిచినప్పటికీ ఓట్లు చీల్చడం ద్వారా నితీష్ జేడీయూకు గట్టి దెబ్బ కొట్టింది. మళ్లీ ఇదే పరిస్థితి ఈసారి పునరావృతం కారాదని బీజేపీ భావిస్తోంది.
ఎన్డీయే నెంబర్ గేమ్
మరోవైపు, కాస్త అటూఇటూగా సీట్ షేరింగ్ ఫార్ములా రెడీ అయినట్టు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. 243 అసెంబ్లీ స్థానాలకు గాను జేడీయూ-బీజేపీ చెరో 100కు పైగా సీట్లలో పోటీ చేయనున్నాయి. ఈ రెండిట్లోనూ కూటమిలో బిగ్ బ్రదర్ తామేననే సందేశం వెళ్లేందుకు వీలుగా జేడీయూ బీజేపీ కంటే ఎక్కువ సీట్లలో పోటీ చేసే అవకాశం ఉంది. నిజానికి 2020 ఎన్నికల్లో ఇలాంటి ఏర్పాట్లే జరిగినప్పటికీ బీజేపీ 110 స్థానాలకు 74 చోట్ల గెలిచి సత్తా చాటుకుంది. జేడీయూ 115 సీట్లలో పోటీ చేసి కేవలం 43 సీట్లు గెలిచింది. కాగా, ఈసారి బీజేపీ-జేడీయూ చెరో 100 సీట్లు పంచుకుంటే కూటమిలోని మూడు భాగస్వామ్య పార్టీలు తక్కిన 40 సీట్లు పంచుకోవాలి. మరి చిరాగ్ పాశ్వాన్‌కు దక్కేవి ఎన్ననేదే ప్రస్తుత ప్రశ్న.
ఇవి కూడా చదవండి..
చైనాతో జాగ్రత్త.. భారత్‌ను హెచ్చరించిన టిబెట్ మాజీ ప్రధాని లోబ్సాంగ్ సంగే
మోదీ ‘స్వదేశీ’ పిలుపు.. జోహోకు మారిన కేంద్ర మంత్రి..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి