Share News

Tibet Leader Lobsang sangay: చైనాతో జాగ్రత్త.. భారత్‌ను హెచ్చరించిన టిబెట్ మాజీ ప్రధాని లోబ్సాంగ్ సంగే

ABN , Publish Date - Sep 23 , 2025 | 06:38 PM

న్యూఢిల్లీలోని చైనా రాయబార కార్యాలయం భారతీయ రాజకీయనేతలను ప్రభావితం చేసేందుకు చురుకుగా ప్రయత్నిస్తుంటుందని, చివరకు ప్రభుత్వ మార్పుకు సైతం ప్రణాళిక వేస్తుందని లోబ్సాంగ్ సంగే అన్నారు.

Tibet Leader Lobsang sangay: చైనాతో జాగ్రత్త.. భారత్‌ను హెచ్చరించిన టిబెట్ మాజీ ప్రధాని లోబ్సాంగ్ సంగే
Tibet Dr Lobsang Sangay

న్యూఢిల్లీ: ప్రవాసంలో ఉన్న టిబెటన్ మాజీ ప్రధానమంత్రి డాక్టర్ లోబ్సాంగ్ సంగే (Dr Lobsang Sangay) సంచలన విషయం వెల్లడించారు. చైనాతో భారత్ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. న్యూఢిల్లీలోని చైనా రాయబార కార్యాలయం భారతీయ రాజకీయనేతలను ప్రభావితం చేసేందుకు చురుకుగా ప్రయత్నిస్తుంటుందని, చివరకు ప్రభుత్వ మార్పుకు సైతం ప్రణాళిక వేస్తుందని అన్నారు. 'ఎలైట్ -ఆప్షన్ అనేది చైనా అనాదిగా అనుసరిస్తున్న వ్యూహం' అని ఒక జాతీయ మీడియాకు ఇచ్చిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన తెలిపారు.


'దేశంలోని ప్రముఖ నేతలు, మేథావులు, వాణిజ్యవేత్తలు, పాత్రికేయులను, యూట్యూబర్లను కూడా వాళ్లు కొంటారు. ఆ విధంగానే వాళ్లు టిబెట్, జింజియాగ్, మంగోలియాలో చొరబడ్డారు. ఇండియాలోనూ అదే తరహాలో ప్రయత్నాలు సాగిస్తారు' అని లోబ్సాంగ్ సంగే అప్రమత్తం చేశారు. బీజింగ్ రాజకీయ వ్యూహాలకు చిక్కవద్దని భారత్‌ను హెచ్చరించారు. ఢిల్లీలో ఇటీవల జరిగిన చైనా ఎంబసీ నేషనల్ డే సెలబ్రేషన్లలో ఎవరెవరు పాల్గొన్నారో చెక్ చేసుకోవాలని సూచించారు. రాజకీయనేతలు, వాణిజ్యవేత్తలు, ఇతరలు ఫోటోలన్నీ పరిశీలించాలన్నారు. హాజరైన అందర్నీ వాళ్లు కొనుగోలు చేయలేకపోవచ్చని, అయితే ప్రయత్నాలు మాత్రం చేస్తూనే ఉంటారని హెచ్చరించారు.


ఇండియాకు పొరుగున ఉన్న దేశాల్లో చైనాకు తేలిగ్గా లొంగిపోయే పాలనా వ్యవస్థలు ఉండటాన్ని ఆయన ప్రస్తావించారు. నేపాల్‌లో ఒక పార్టీ చైనాకు బహిరంగంగానే అనుకూలంగా వ్యవహరించే పార్టీ, మరొకటి ఇండియాకు అనూకూలమైన పార్టీ ఉన్నాయని, శ్రీలంక, బంగ్లాదేశ్, మాల్దీవుల్లో పాలకవర్గ ప్రముఖులను చైనా ప్రభావితం చేస్తుంటుందని, పాకిస్థాన్‌లో అన్ని రాజకీయ పార్టీలు చైనాకు మద్దతునిస్తుంటాయని చెప్పారు. చైనా అనుసరించే ఎలైట్ క్యాప్చర్ వ్యూహం ఇదేనని చెప్పారు.


చైనా వ్యూహం దక్షియాసియా దాటి విస్తరించి ఉందని సంగే తెలిపారు. యూరప్‌లోని మంత్రులను తాను చూశానని, చైనాను పొగిడిన వారు ఆ తర్వాత చైనా కంపెనీల్లో లక్ష డాలర్లు, అంతకు మించిన వేతనాలతో డెరెక్టర్లు అయ్యారని, చైనా తన ప్రభావాన్ని పెంచుకునేందుకు ఇలా ప్రముఖులను కొనేస్తుంటుందని చెప్పారు.


పార్టీలకు అతీతంగా..

పార్టీలకు అతీతంగా భారతదేశంలోని రాజకీయ పార్టీలు, వాణిజ్య ప్రముఖులు, పాత్రికేయులు చైనా ఎత్తుగడల పట్ల అప్రమత్తంగా ఉండాలని సంగే హెచ్చరించారు. తమ ఎజెండాకు తోడ్పడే ఎవరినైనా కొనేయడానికి బీజింగ్ వెనుకాడదని చెప్పారు.


ఇవి కూడా చదవండి..

యువత నిరుద్యోగ సమస్యకు ఓటు చోరీనే కారణం.. రాహుల్ ఆరోపణ

మోదీ ‘స్వదేశీ’ పిలుపు.. జోహోకు మారిన కేంద్ర మంత్రి..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 23 , 2025 | 07:19 PM