Rahul Gandhi on Vote Chori: యువత నిరుద్యోగ సమస్యకు ఓటు చోరీనే కారణం.. రాహుల్ ఆరోపణ
ABN , Publish Date - Sep 23 , 2025 | 04:34 PM
బీజేపీ చేస్తున్న ఓటు చోరీ ఫలితంగానే దేశంలోని యువత నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారని రాహుల్ అన్నారు. ప్రజల సమస్యలను కేంద్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ 'ఓటు చోరీ' (Vote Chori)కి పాల్పడుతోందంటూ పదేపదే విమర్శలు గుప్పిస్తున్న కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తాజాగా దేశంలోని యువత నిరుద్యోగానికీ, ఓటు చోరీకి ముడిపెట్టి విమర్శలు చేశారు. బీజేపీ చేస్తున్న ఓటు చోరీ ఫలితంగానే దేశంలోని యువత నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారని అన్నారు. ప్రజల సమస్యలను కేంద్రం పట్టించుకోవడం లేదని, కేవలం సంస్థలను తమ గుప్పిట్లో పెట్టుకుని అధికారంలో కొనసాగుతోందని ఆరోపించారు.
'ఈ దేశంలోని యువత ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య నిరుద్యోగం. దీనికి ఓటుచోరీతో నేరుగా ప్రమేయం ఉంది. ఏ ప్రభుత్వమైనా ప్రజావిశ్వాసం పొంది గెలిచినట్లయితే యువతకు ఉపాధి, అవకాశాలు కల్పించేందుకు తొలి ప్రాధాన్యత ఇస్తుంది. కానీ బీజేపీ నిజాయితీగా ఎన్నికల్లో గెలువదు. ఓట్లు చోరీ చేసి, సంస్థలను గుప్పిట్లో పెట్టుకుని అధికారం సాగిస్తోంది' అని సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో రాహుల్ పేర్కొన్నారు.
సంస్థలను బీజేపీ గుప్పిట్లో పెట్టుకోవడం వల్ల ఉద్యోగాలు తగ్గిపోయి, రిక్రూట్‌మెంట్ ప్రక్రియ కుప్పకూలిందని, యువకుల భవిష్యత్‌ను చీకట్లోకి గెంటుతున్నారని ఆరోపించారు. 'దేశ యువతకు కష్టించే స్వభావం ఉంది. కలలు కంటారు. భవిష్యత్ కోసం పోరాడతారు. కానీ మోదీ మాత్రం పీఆర్‌తో బిజీగా ఉంటారు. బిలియనీర్లకు లబ్ది చేకూరుస్తుంటారు. యువత కలలను భగ్నం చేస్తారు' అని రాహుల్ విమర్శించారు.
పరిస్థితి మారుతోంది
దేశ యువత ఉద్యోగాల లూటీలు, ఓటు చోరీలను సహించేందుకు సిద్ధంగా లేరని, పరిస్థితి మారుతోందని రాహుల్ అన్నారు. తమ నిజమైన పోరాటం కేవలం ఉద్యోగాలకే పరిమితం కాదని, ఓటు చోరీకి సంబంధించినదని గ్రహిస్తున్నారని చెప్పారు. ఎన్నికల చోరీ కొనసాగినంత కాలం నిరుద్యోగం, అవినీతి పెరిగిపోతూనే ఉంటుందన్నారు. నిరుద్యోగం, ఓటు చోరీ నుంచి దేశాన్ని విముక్తి చేయడమే నిజమైన దేశభక్తి అని రాహుల్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
మసీదు నిర్మాణం ప్లాన్‌ను తోసిపుచ్చిన అయోధ్య డవలప్‌మెంట్ అథారిటీ
మోదీ ‘స్వదేశీ’ పిలుపు.. జోహోకు మారిన కేంద్ర మంత్రి..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి