Manoj Jarange: దిగొచ్చిన ప్రభుత్వం.. ముగిసిన మనోజ్ జరాంగే ఆందోళన
ABN , Publish Date - Sep 02 , 2025 | 09:30 PM
మరాఠాల రిజర్వేషన్ల కోసం గత ఐదు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న మనోజ్ జరాంగే మంగళవారం తన దీక్ష విరమించారు. తన డిమాండ్లలో అత్యధిక శాతాన్ని నేరవేర్చేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ అంగీకరించిందని ఆయన తెలిపారు.
ముంబై, సెప్టెంబర్ 02: మరాఠా వర్గాన్ని రిజర్వేషన్లు కల్పించాలంటూ డిమాండ్లతో చేస్తున్న పోరాటంలో విజయం సాధించినట్లు ఉద్యమకారుడు మనోజ్ జరాంగే మంగళవారం ముంబైలో ప్రకటించారు. మరాఠా వర్గానికి రిజర్వేషన్ల కోటాపై మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ తన డిమాండ్లలో అత్యధిక శాతాన్ని ఆమోదించిందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. మరాఠాలోని అర్హులైన కున్బీలకు కుల ధృవీకరణ పత్రాలను అందజేసేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని ఆయన తెలిపారు. దీంతో ముంబైలోని ఆజాద్ మైదానంలో గత ఐదు రోజులుగా చేస్తున్న ఆయన దీక్షకు మంగళవారంతో ఫుల్ స్టాప్ పడినట్లు అయింది. మంత్రి రాధాకృష్ణ వికే పాటిల్ నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ.. మనోజ్ జరాంగే విధించిన కీలక డిమాండ్లు నెరవేర్చడానికి అంగీకరించిన సంగతి తెలిసిందే.
మరి ముఖ్యంగా హైదరాబాద్ గెజిట్ వంటి చారిత్రక పత్రాల ద్వారా తమ అర్హతను నిరూపించుకోగల మరాఠాలకు కున్బీ కుల ధృవీకరణ పత్రాలు జారీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. మరాఠా సమాజానికి అర్హతను నిర్వచించడానికి అవసరమైన హైదరాబాద్ గెజిట్‌ను వెంటనే అమలు చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో ఉద్యోగాలు, విద్యలో ఓబీసీ కేటగిరీ కింద మరాఠాలు రిజర్వేషన్ల ప్రయోజనాలు పొందగలుగుతారు. అలాగే రిజర్వేషన్లకు మరాఠా అర్హతను నిర్వచించడంలో కీలక పాత్ర పోషిస్తున్న సతారా గెజిట్‌ను ఒక నెల లోపల అమలు చేస్తామని కమిటీ హామీ ఇచ్చింది.
ఇక మరాఠా కోటా కోసం ఆందోళన చేపట్టిన నిరసనకారులపై దాఖలు చేసిన కేసులను సెప్టెంబర్ చివరి నాటికి ఉపసంహరించుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. అదే విధంగా ఈ ఆందోళనల్లో మరణించిన నిరసనకారులు కుటుంబాలకు ప్రభుత్వం ఇప్పటికే రూ. 15 కోట్ల ఆర్థిక సాయం అందించింది. మిగిలిన సాయాన్ని వారం రోజుల్లో అందిస్తామని స్పష్టం చేసింది. అలాగే మరణించిన వారి కుటుంబ సభ్యులు, బంధువుల్లో అర్హులైన వారికి విద్యార్హతల ఆధారంగా ప్రభుత్వ ఉద్యోగాలు కేటాయించనుంది.
మరాఠాలు, కున్బీలు ఒకే సమాజంగా అధికారికంగా గుర్తించే ప్రభుత్వ తీర్మానం జారీ చేయడానికి మహారాష్ట్ర ప్రభుత్వం చట్టపరమైన మార్గాలను అన్వేషిస్తోంది. చట్టపరంగా సమీక్షించేందుకు ఈ ప్రక్రియకు రెండు నెలలు పట్ట వచ్చని తెలుస్తోంది.
మరోవైపు.. జరాంగేతోపాటు అతని మద్దతుదారులను మంగళవారం మధ్యాహ్నం 3 గంటల లోపు ఆజాద్ మైదాన్‌ను ఖాళీ చేయాలని ఆదేశించింది. అయితే చర్చల అనంతరం ప్రభుత్వంతో తీర్మానాన్ని ఖరారు చేయడానికి సెప్టెంబర్ 3 వ తేదీ ఉదయం వరకు జరంగేతోపాటు అతడి మద్దతు దారులకు అనుమతి ఇచ్చింది. మరాఠాలకు ఓబీసీ కేటగిరి కింద 10 శాతం రిజర్వేషన్లు కల్పించే లక్ష్యంతో ఆగస్టు 29వ తేదీన జరంగే నిరాహార దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ ప్రకటనతో మంగళవారం ఆయన నిరాహార దీక్షను విరమించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మణిపూర్‌లో పర్యటించనున్న ప్రధాని మోదీ..!
ఏపీ మహేష్ బ్యాంక్‌కు షాక్ ఇచ్చిన ఈడీ
For More National News And Telugu News