Eknath Shinde: జన్మాష్టమి ఉత్సవాల్లో కలకలం.. కూలిన ఉపముఖ్యమంత్రి వేదిక
ABN , Publish Date - Aug 17 , 2025 | 10:26 AM
జన్మాష్టమి 2025 వేడుకలు మహారాష్ట్రలో ఘనంగా జరిగాయి. ఆ క్రమంలోనే రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ఓ వేదికపైకి చేరిన క్రమంలో కార్యకర్తలు ఒక్కసారిగా ఎగబడ్డారు. హఠాత్తుగా పెరిగిన బరువును తట్టుకోలేక వేదిక కూలిపోయింది.
శ్రీకృష్ణుడి జన్మదినం సందర్భంగా మహారాష్ట్రలో దహి-హండి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సంవత్సరం జన్మాష్టమి సందర్భంగా మహారాష్ట్రలోని అనేక ప్రాంతాల్లో ఈ సంప్రదాయ వేడుకలు జోరుగా జరిగాయి. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే (Eknath Shinde) థానే సహా ఇతర ప్రాంతాల్లో జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు. కానీ, గన్సోలిలో జరిగిన ఒక ఈవెంట్‌లో ఊహించని సంఘటన ఒకటి జరిగింది. అది కాస్త ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.
నెట్టింట వైరల్..
షిండే వేదికపై నుంచి దిగుతుండగా, ఉత్సాహంతో ఉన్న కార్యకర్తలు ఒక్కసారిగా వేదికపైకి ఎక్కారు. దీంతో అధిక బరువు వల్ల వేదిక అకస్మాత్తుగా కూలిపోయింది. ఆ క్షణంలో అక్కడ ఉన్న జనం మధ్య గందరగోళం నెలకొంది. అయితే, షిండేని వెంటనే సురక్షిత ప్రదేశానికి తీసుకెళ్లారు. ఈ సంఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. ఈ ఘటనకు సంబంధించిన చిత్రాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఉత్సాహంగా పాల్గొన్న యువత
మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ముంబై, థానేలలో జరిగిన అనేక దహి-హండి ఈవెంట్‌లలో పాల్గొన్నారు. వీరిద్దరూ తమ X ఖాతాల్లో ఈ వేడుకలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను షేర్ చేశారు. ఈ ఉత్సవాల్లో యువత ఉత్సాహంతో పాల్గొన్నారు. షిండే, థానేలోని మాజీ శివసేన ఎమ్మెల్యే రవీంద్ర ఫటక్ నేతృత్వంలో సంకల్ప్ ప్రతిష్ఠాన్ ఆధ్వర్యంలో జరిగిన ఒక ప్రతిష్ఠాత్మక దహి-హండి వేడుకలో పాల్గొన్నారు.
దహి-హండి అంటే..
దహి-హండి అంటే ఏంటి, శ్రీకృష్ణుడి బాల్య లీలలను గుర్తు చేసే ఒక సంప్రదాయ ఆట. యువకులు, యువతులు బృందాలుగా ఏర్పడి, ఒకరిపై ఒకరు ఎక్కి మానవ పిరమిడ్‌లను నిర్మిస్తారు. వారి లక్ష్యం? గాల్లో ఒక తాడుతో కట్టబడిన దహి-హండి (పెరుగు కుండ)ని కొట్టి బద్దలు చేయడం. ఈ ఆటలో సమన్వయం, బలం, ధైర్యం, ఉత్సాహం అన్నీ కలిసి ఉంటాయి. ఈ వేడుకలు కేవలం ఆట కోసం మాత్రమే కాదు, సమాజంలో ఐక్యతను, సంతోషాన్ని పంచేందుకు కూడా నిర్వహిస్తారు.
ఇవి కూడా చదవండి
డెంగ్యూ దాడికి చెక్ పెట్టండి.. ఈ చిట్కాలతో ఆరోగ్యంగా ఉండండి
మీ లోన్ ఇంకా మంజూరు కాలేదా..ఇవి పాటించండి, వెంటనే అప్రూవల్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి