India vs Pakistan: కశ్మీరే పాక్ ఆయుధం.. ఆర్మీ మాజీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు
ABN , Publish Date - May 17 , 2025 | 10:14 AM
Kashmir: కశ్మీరే పాకిస్థాన్ ఆయుధం అంటూ ఓ ఆర్మీ మాజీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఎందుకిలా కామెంట్ చేశారు.. దీని వెనుక ఆంతర్యం ఏంటి.. అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం..
న్యూఢిల్లీ, మే 17: ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్‌కు చుక్కలు చూపిస్తోంది భారత్. పహల్గాం దాడి దరిమిలా టెర్రరిస్టులతో పాటు వారికి అండగా ఉంటున్న శత్రుదేశంపై ఉరుములా విరుచుకుపడుతోంది. ఆపరేషన్ సిందూర్ పేరుతో ఉగ్రస్థావరాల మీద అటాక్ చేయడం, ఆ తర్వాత ప్రతిదాడులకు తెగించిన పాక్‌పై డ్రోన్లు, మిసైళ్లతో ఇండియా ఓ రేంజ్‌లో విరుచుకుపడటం ప్రపంచదేశాలు కూడా చూశాయి. తమ జోలికొస్తే తాటతీస్తామంటూ భారత్ చేసిన సింహగర్జన పాక్‌తో పాటు ఆ దేశానికి సాయం చేస్తున్న టర్కీ, అజర్‌బైజాన్, చైనాకూ వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. యుద్ధంతోనే కాదు దౌత్యంతోనూ పాక్‌ను ఇబ్బందులపాలు చేస్తోంది ఇండియా. వాళ్ల అసలు రూపాన్ని ప్రపంచ దేశాల ముందు బయటపెట్టేందుకు సిద్ధమవుతోంది. ఈ సమయంలో భారత ఆర్మీ మాజీ చీఫ్ నిర్మల్ చందర్ విజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కశ్మీరే పాక్ ఆయుధమని అన్నారు. ఆయన ఎందుకిలా వ్యాఖ్యానించారో ఇప్పుడు చూద్దాం..

అబద్ధాల పుట్ట..
ఆర్థిక పరంగానే కాదు.. పాకిస్థాన్ అన్ని విధాలుగా పతనమైన దేశమని నిర్మల్ చందర్ విజ్ అన్నారు. పాక్ అబద్ధాల పుట్ట అని.. వాళ్లను అస్సలు నమ్మొద్దని చెప్పారు. ఆ దేశాన్ని ప్రభుత్వం కాదు.. ఆర్మీనే నడుపుతోందన్నారు. అన్ని విధాలుగా పతనమైన పాక్‌ను కశ్మీర్ అంశమే ఐక్యతగా ఉంచుతోందన్నారు విజ్. అన్ని సమస్యల్ని కప్పిపుచ్చుకోవడానికి కశ్మీర్‌ను ఒక ఆయుధంగా అక్కడి నేతలు, ఆర్మీ మలచుకుందన్నారు ఆర్మీ మాజీ చీఫ్. భారత్ ఎంత శక్తిమంతమైన దేశం, మనం ఎంత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తామో మొత్తం ప్రపంచం ఇప్పుడు అర్థం చేసుకుంటోందన్నారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత సైనికాధికారులు ఇచ్చిన ఫస్ట్ బ్రీఫింగే దీనికి సరైన ఉదాహరణ అని ఆయన మెచ్చుకున్నారు. విదేశీ వ్యవహారాల శాఖ సెక్రెటరీతో కలసి ఇద్దరు మహిళా అధికారులు మాట్లాడిన తీరు, ఆపరేషన్ సిందూర్ గురించి వివరించిన విధానం అదిరిపోయిందన్నారు నిర్మల్ విజ్.
రెచ్చగొడితే అంతే సంగతులు..
అన్ని సమస్యలకు యుద్ధమే పరిష్కారం కాదని, చర్చల ద్వారానే సమాధానాలు దొరుకుతాయని నిర్మల్ చందర్ విజ్ సూచించారు. భారత్ జోలికొస్తే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో పాకిస్థాన్‌తో పాటు ఇతర దేశాలకూ తెలిసొచ్చిందన్నారు. అప్పుల్లో కూరుకుపోయిన పాకిస్థాన్.. లోన్లు తీసుకొని అప్పులు కడుతోందన్నారు. అలాంటి దేశం అణ్వస్త్రాల పేరుతో భయపెడుతోందని.. కానీ ఇక మీదట ఈ నాటకాలు నడవవంటూ భారత్ గట్టిగా బుద్ధి చెప్పిందని మెచ్చుకున్నారు ఆర్మీ మాజీ చీఫ్. పాక్ పంజాబ్ సహా శత్రుదేశంలోని ప్రతిమూలలోనూ భారత సైన్యం దాడులు చేసిందన్నారు. ఇండియాను రెచ్చగొడితే ఏం జరుగుతుందో పాక్‌కు అర్థమైందని వివరించారు నిర్మల్ విజ్.
ఇవీ చదవండి:
పాక్ నుంచి అఫ్గాన్ సరుకు ట్రక్కులకు అనుమతి
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి