Share News

Job scam Mantralaya: మంత్రివర్గ భవనమే జాబ్ స్కాం కేంద్రం..రూటు మార్చిన మాఫియా

ABN , Publish Date - Sep 10 , 2025 | 01:21 PM

నిరుద్యోగ యువకులను కొందరు జాబ్ పేరుతో టార్గెట్ చేసి మోసం చేస్తున్నారు. ఏకంగా ప్రభుత్వ భవనాల్ని, ఆసుపత్రుల్ని ఉపయోగించి చీట్ చేసిన సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇది ఎక్కడ జరిగింది, ఏంటనే విషయాలను ఇక్కడ చూద్దాం.

Job scam Mantralaya: మంత్రివర్గ భవనమే జాబ్ స్కాం కేంద్రం..రూటు మార్చిన మాఫియా
Job scam Mantralaya

మహారాష్ట్రలో (Maharashtra) ఇటీవల షాకింగ్ స్కాం వెలుగులోకి వచ్చింది. మోసగాళ్లు ఏకంగా మంత్రివర్గ భవనంలోనే ఫేక్ ఇంటర్వ్యూలు నిర్వహించి, ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించి, ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తామని అనేక మందిని మోసం చేశారు. ఈ క్రమంలో వందలాది నిరుద్యోగ యువకులు లక్షల రూపాయలు మోసపోయారు. ఓ యువకుడికి అనుమానం వచ్చి ఫిర్యాదు చేయడంతో అసలు మోసం వెలుగులోకి వచ్చింది.


నాగపూర్‌కు చెందిన రాహుల్ తాయ్డే అనే యువకుడు ఈ మోసానికి బలయ్యాడు. రాహుల్ చెప్పిన ప్రకారం, జూనియర్ క్లర్క్ ఉద్యోగం ఇస్తామని చెప్పి, ఈ గ్యాంగ్ అతని నుంచి డబ్బులు వసూలు చేసింది. నిజంగా జాబ్ ఇంటర్వ్యూ జరిగితే ఎలా ఉంటుందో అలాగే ప్లాన్ చేశారు. ఎక్కడికక్కడ ఫేక్ సెట్ అప్ చేసి మాయ (job scam) చేశారు. ఒక రోజు రాహుల్‌ను ముంబైలోని ప్రభుత్వ ఆసుపత్రి అయిన జె.జె. హాస్పిటల్‌కు తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేశారు.


ఆ తర్వాత శిల్పా ఉడాపురే అనే పేరుతో ఉన్న మంత్రివర్గం కేబిన్‌లో ఇంటర్వ్యూకు పిలిచారు. మంత్రివర్గ భవనంలోకి ప్రవేశించేలా ఒక ఫేక్ ఐడీ కార్డూ కూడా ఇచ్చారు. ఇదే మీ ఆఫీస్ అని చెప్పి చూపించారు కూడా. కానీ అసలైన అపాయింట్‌మెంట్ లెటర్ మాత్రం ఇవ్వలేదు (Mantralaya recruitment scam). దీంతో రాహుల్‌కు కొన్ని రోజులకు తాను మోసపోయానని అర్థమైంది. ఈ విషయాన్ని వెంటనే రాహుల్ నాగపూర్‌లోని హుడ్కేశ్వర్ పోలీస్ స్టేషన్‌లో తెలిపాడు.


దీంతో రంగంలోకి దిగిన పోలీసులు (police) 45 ఏళ్ల లారెన్స్ హెన్రీని అరెస్ట్ చేశారు. అతను మాల్‌గీనగర్ ప్రాంతానికి చెందినవాడు. ఇంకా మరో ఆరుగురు మోసగాళ్లు పరారీలో ఉన్నారు. పోలీసులు వారి కోసం గాలింపు చర్యలు మొదలుపెట్టారు. ఈ గ్యాంగ్ రాష్ట్రవ్యాప్తంగా 200 మందికిపైగా నిరుద్యోగులను మోసం చేసి ఉంటారని రాహుల్ తెలిపాడు. ఇప్పటికే చంద్రపూర్, వార్ధా, నాగపూర్ ప్రాంతాల్లో ఫిర్యాదులు నమోదయ్యాయి.

పోలీసులు మిగతా బాధితులను కూడా సంప్రదిస్తూ దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ ఘటన నేపథ్యంలో నిరుద్యోగులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. ఉద్యోగాల కోసం ఎలాంటి డబ్బు చెల్లింపులు చేయవద్దన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో ముందుగా అధికారిక వెబ్‌సైట్లను ప్రామాణికంగా తీసుకోవాలన్నారు.


ఇవి కూడా చదవండి

మరో స్కామ్‌ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి

సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 10 , 2025 | 01:21 PM