Prithvi Shaw Fined: క్రికెటర్ పృథ్వీ షాకు రూ.100 జరిమానా..ఎందుకో తెలుసా..
ABN , Publish Date - Sep 10 , 2025 | 12:11 PM
క్రికెట్ అభిమానులకు పృథ్వీ షా పరిచయం అక్కర్లేని పేరు. కానీ ఈసారి అతను వార్తల్లోకి వచ్చిన తీరు మాత్రం వేరు. అది కూడా ఆట కోసం కాదు. ఒక లీగల్ కేసు కారణంగా రూ.100 జరిమానా పడింది. అసలేం జరిగిందో ఇక్కడ చూద్దాం.
క్రికెటర్ పృథ్వీ షా (Prithvi Shaw) గురించి ఒక ఆసక్తికరమైన వార్త వెలుగులోకి వచ్చింది. ముంబైలోని సెషన్స్ కోర్టు షాకు రూ.100 జరిమానా విధించింది. అది కూడా చిన్న విషయం కోసం కాదు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ సప్నా గిల్ అనే మహిళ వేసిన కేసులో సమాధానం దాఖలు చేయనందుకు. అసలు ఈ కేసు ఏంటనే విషయాలను ఇక్కడ చూద్దాం.
ఈ కేసు 2023 ఫిబ్రవరి 15న మొదలైంది. ముంబైలోని అంధేరీలో ఒక పబ్‌లో ఈ గొడవ మొదలైంది. సప్నా గిల్‌తో పాటు ఆమె ఫ్రెండ్ శోబిత్ ఠాకూర్, షాతో సెల్ఫీలు అడిగారట. మొదట్లో షా సరే అని ఒకటి రెండు సెల్ఫీలకు ఒప్పుకున్నాడు. కానీ శోబిత్ మళ్లీ మళ్లీ అడగడంతో షా కాస్త చిరాకు పడ్డాడు. ఇది చిన్న వాగ్వాదంగా మారింది. ఆ తర్వాత శోబిత్‌ని అక్కడి నుంచి వెళ్లిపోమని చెప్పారు.
రాత్రి షా తన ఫ్రెండ్ అశిష్ సురేంద్ర యాదవ్‌తో కలిసి పబ్ నుంచి బయటకు వెళ్తుండగా, గొడవ మళ్లీ తెరపైకి వచ్చింది. శోబిత్, సప్నాతో సహా ఆరుగురు వ్యక్తుల యాదవ్‌ని వెంటాడి, బెదిరించి, రూ.50,000 డబ్బులు డిమాండ్ చేశారని ఆరోపణలు. ఈ గొడవలో శోబిత్‌పై బేస్‌బాల్ బ్యాట్‌తో దాడి కూడా జరిగిందని పోలీసులు చెప్పారు. ఈ ఘటన తర్వాత సప్నా గిల్‌ని 2023 ఫిబ్రవరి 17న అరెస్ట్ చేశారు. కానీ మూడు రోజుల తర్వాత ఆమెకు బెయిల్ వచ్చింది.
సప్నా గిల్ ఆరోపణలు ఏంటి?
ఇక సప్నా గిల్ స్టోరీ మరోలా ఉంది. ఆమె చెప్పిన ప్రకారం షా, యాదవ్‌లు తమని తమ వీఐపీ టేబుల్‌కి ఆహ్వానించి డ్రింక్స్ తాగమన్నారట. శోబిత్ సెల్ఫీలు అడిగినప్పుడు షా, యాదవ్‌లు అతడిపై దాడి చేశారని, ఆమె ఆ గొడవను అడ్డుకోబోతే, షా తనపై శారీరకంగా దాడి చేశాడని ఆమె ఆరోపించింది. ఈ ఆరోపణలతో ఆమె షాపై కేసు పెట్టింది, అతడిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసింది.
కోర్టులో ఏం జరిగింది?
సప్నా గిల్ వేసిన ఫిర్యాదు ఆధారంగా కోర్టు షాపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడానికి నిరాకరించింది. బదులుగా, పోలీసులు విచారణ చేయాలని ఆదేశించింది. ఈ ఆదేశంతో సంతృప్తి చెందని సప్నా, 2024 ఏప్రిల్‌లో దిండోషి సెషన్స్ కోర్టులో క్రిమినల్ రివిజన్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసులో షా తన సమాధానం దాఖలు చేయాలని కోర్టు పదేపదే చెప్పినా, అతడు దాన్ని పట్టించుకోలేదు.
ఈ క్రమంలో కోర్టు షాకు ఒక్కసారి ఫైనల్ వార్నింగ్ ఇచ్చింది. అయినా కూడా షా నుంచి సమాధానం రాలేదు. దీంతో కోర్టు ఇంకోసారి అవకాశం ఇస్తున్నాం, కానీ రూ.100 జరిమానా చెల్లించాలని చెప్పింది. ఈ కేసు తదుపరి విచారణ డిసెంబర్ 16, 2025కి వాయిదా పడింది. చివరికి ఈ కేసు ఎటు మళ్లుతుందో, ఎవరి వాదనలో నిజం ఉందో తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి