Indian Woman Trapped Nepal: నేపాల్లో చిక్కుకున్న భారత మహిళ..కాపాడాలని కోరుతూ వీడియో రిలీజ్
ABN , Publish Date - Sep 10 , 2025 | 11:17 AM
నేపాల్లో ఉద్రిక్తతలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. జెన్ జెడ్ ఆందోళనలు స్థానికులతోపాటు విదేశీ పర్యాటకులకూ తలనొప్పిగా మారాయి. తాజాగా, ఓ భారత మహిళ ఈ పరిస్థితుల్లో ఇరుక్కుంది. ఆమె ఇన్‌స్టాగ్రామ్ వేదికగా సాయం చేయాలని కోరుతూ ఎమోషనల్ వీడియో పోస్ట్ చేసింది.
నేపాల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడి ప్రజలతోపాటు టూరిస్టులకు కూడా ఇబ్బంది కరంగా మారాయి. జెన్ జెడ్ పేరుతో యువత చేస్తున్న ఆందోళనల్లో ఓ భారత మహిళ కూడా చిక్కుకుంది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఎమోషనల్ వీడియో పోస్ట్ చేసి కాపాడాలని కోరింది (Indian Woman Trapped Nepal). ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వీడియోలో ఆమె నా పేరు ఉపాసన గిల్. నేను భారత్ నుంచి నేపాల్లో వాలీబాల్ లీగ్ నిర్వహించడానికి వచ్చాను. నేను ఉన్న హోటల్ పూర్తిగా తగలబడింది. నా బ్యాగులు, పాస్‌పోర్ట్, డబ్బులు అన్నీ లోపలే ఉన్నాయి. నేను స్పాలో ఉన్నపుడు కొంతమంది కర్రలతో కొట్టేందుకు నా వెంట వచ్చారు. నేను ఏదో ఒక విధంగా బతికి బయట పడ్డానని వీడియోలో తెలిపింది.
దయచేసి ఈ వీడియోని ఇండియన్ ఎంబసీకి పంపాలని, కాపాడాలని కోరింది. మా వెంట చాలామంది భారతీయులు ఉన్నారని, మేమంతా ఇక్కడ చిక్కుకుపోయామని చెప్పింది. ఆ క్రమంలో ప్రధాని మోదీ, భారత విదేశాంగ మంత్రి జైశంకర్ సహా పలువురికి ఈ వీడియోను ట్యాగ్ చేసింది.
భారత రాయబార కార్యాలయం స్పందన
కాట్మాండులోని భారత రాయబార కార్యాలయం వెంటనే స్పందించి, అక్కడ ఉన్న భారతీయులకు కొన్ని కీలక సూచనలు జారీ చేసింది. ప్రస్తుత పరిస్థితిలో నేపాల్‌కి ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని సూచించింది. అక్కడ ఇప్పటికే ఉన్న భారతీయులు బయటకు వెళ్లకుండా తాము ఉన్న స్థలంలోనే ఉండాలని కోరింది.
అత్యవసర పరిస్థితుల కోసం హెల్ప్‌లైన్ నెంబర్లు విడుదల చేశారు
📞 +977 - 980 860 2881 (WhatsApp కూడా)
📞 +977 - 981 032 6134 (WhatsApp కూడా)
ఎందుకు ఇలా ?
నేపాల్లోని యువత, ముఖ్యంగా Gen Z పేరుతో ఓ పెద్ద ఉద్యమాన్ని ప్రారంభించారు. మొదట సోషల్ మీడియా పైన విధించిన నిషేధానికి వ్యతిరేకంగా మొదలైన ఈ ఉద్యమం, క్రమంగా దేశ రాజకీయ వ్యవస్థపై విశ్వాసం కోల్పోయిన యువత ఆగ్రహాంగా మారింది. ప్రధానమంత్రి K.P. Sharma Oli నేతృత్వంలోని ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు, నిర్లక్ష్యం కూడా దీనికి కారణాలని పలువురు చెబుతున్నారు.
ఈ ఆందోళనలు తీవ్రమవుతూ దేశ వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలపై దాడులు జరిగాయి. కొన్ని ప్రభుత్వ భవనాలు, పార్లమెంట్ బిల్డింగ్, రాజకీయ నాయకుల ఇళ్లు తగలబెట్టారు. ఈ నిరసనల కారణంగా రెండు రోజుల్లోనే దాదాపు 20 మంది ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు తెలిపారు. ప్రస్తుతం నేడు మూడో రోజు కూడా నిరసనలు కొనసాగుతున్నాయి.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి