Ajay Maken: ఆప్‌తో పొత్తు లేదు కానీ.. డోర్లు మూసుకుపోలేదు
ABN , Publish Date - Jan 18 , 2025 | 09:38 PM
2013లో ఆప్‌కు కాంగ్రెస్ మద్దతు ఇవ్వడం, 2024లో జతకట్టడం వల్ల కాంగ్రెస్‌కు నష్టం జరిగిందని అజయ్ మాకెన్ చెప్పారు. ఢిల్లీ ప్రజలు సమస్యలు ఎదుర్కోవడం వల్ల బీజేపీకి లబ్ధి చేకూరుతుందనేది తన నిశ్చితాభిప్రాయమని అన్నారు.

నూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)తో పొత్తు లేదు కానీ తలుపులు మూసుకుపోలేదని కాంగ్రెస్ సీనియర్ నేత, ఏఐసీసీ కోశాధికారి అజయ్ మాకెన్ (Ajay Maken) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జాతీయ స్థాయిలో "ఇండియా'' కూటమి భాగస్వాములుగా ఉన్న కాంగ్రెస్, ఆప్.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ప్రత్యర్థులు తలపడుతున్నాయి. అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలోని ఆప్‌కు కాంగ్రెస్ సపోర్ట్ చేసే అవకాశాలున్నాయా అని మాకెన్‌ను మీడియా అడిగినప్పుడు, అవసరమైతే అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఉండొచ్చని, అయితే ఇది తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనని ఆయన సమాధానమిచ్చారు.
Arvind Kejriwal: ఆ 3 హామీలు అమలు చేయలేకపోయా.. ఒప్పుకున్న కేజ్రీ
''ఆప్‌తో పొత్తు తగదనేది నా వ్యక్తిగత అభిప్రాయం. 2013లో, 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఆప్‌కు కాంగ్రెస్ సపోర్ట్ సరికాదని నేను అనుకుంటున్నాను. అయితే ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే'' అని మాకెన్ తెలిపారు. కేజ్రీవాల్ 'యాంటీ నేషనల్' అంటూ గతంలో చేసిన వ్యాఖ్యలపై అడిగినప్పుడు, తాను తన వ్యక్తిగత అభిప్రాయం చెప్పానని, దానికి కట్టుబడి ఉంటానని అన్నారు. 2013లో ఆప్‌కు కాంగ్రెస్ మద్దతు ఇవ్వడం, 2024లో జతకట్టడం వల్ల కాంగ్రెస్‌కు నష్టం జరిగిందని ఆయన చెప్పారు. ఢిల్లీ ప్రజలు సమస్యలు ఎదుర్కోవడం వల్ల బీజేపీకి లబ్ధి చేకూరుతుందనేది తన నిశ్చితాభిప్రాయమని అన్నారు. కేజ్రీవాల్‌కు ఢిల్లీలో ప్రాముఖ్యత పెరిగితే అది బీజేపీకే కలిసొస్తుందని, బీజేపీతో పోరాడాలంటే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ బలంగా ఉండటం అవసరమని అన్నారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ బలంగా లేకపోతే బీజేపీతో పోరాడటం కష్టమని అభిప్రాయం వ్యక్తం చేశారు.
రాజకీయంగా ఢిల్లీకి అంతగా ప్రాధాన్యం లేని విషయాన్ని ప్రశ్నించినప్పుడు, అది అందరికీ తెలిసినదేనని, ఢిల్లీలో లోక్‌సభ ఎన్నికలు గెలుచుకున్న పార్టీనే కేంద్రంలో అధికారం ఏర్పాటు చేస్తుంటుందని, ఢిల్లీలో బీజేపీతో పోరాటంలో ఆప్ విఫలమవుతోందని చెప్పారు. హర్యానా, ఢిల్లీలో ఆప్‌తో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవాలని అనుకుందని, అయితే జైలు నుంచి విడుదల కాగానే హర్యానాలోని 90 స్థానాల్లోనూ తమ పార్టీ పోటీ చేస్తుందని కేజ్రీవాల్ ప్రకటించారని గుర్తు చేశారు. అప్పటికే పొత్తు చర్చలు అడ్వా్న్స్‌డ్ స్థాయిలో ఉన్నాయని చెప్పారు. ఢిల్లీ విషయంలో కూడా లోక్‌సభ ఎన్నికలు కాగానే ఢిల్లీలో సొంతంగా పోటీ చేస్తామని కేజ్రీవాల్ ప్రకటించారని అన్నారు. ఢిల్లీలో షీలాదీక్షిత్ ప్రభుత్వం ఉన్నప్పుడు కాంగ్రెస్ మొత్తం 7 లోక్‌సభ స్థానాలను సొంతంగా గెలుచుకుందని, బీజేపీ నిలువరించిందని చెప్పారు. ఎప్పుడైతే ఆప్ ఢిల్లీలో అధికారంలోకి వచ్చిందో, ఢిల్లీలోని లోక్‌సభ స్థానాలన్నింటినీ బీజేపీ గెలుచుకుని కేంద్రంలో అధికారంలోకి వస్తోందన్నారు. అప్పుడు బీజేపీతో ఉన్నది ఎవరు? అని అజయ్ మాకెన్ ప్రశ్నించారు.
ఇవి కూడా చదవండి..
Hero Vijay: తేల్చి చెప్పేసిన హీరో విజయ్.. విషయం ఏంటంటే..
Karnataka: కర్ణాటకలో పట్టపగలే బ్యాంకు దోపిడీ
Read Latest National News and Telugu News