Share News

India Plans Export: ట్రంప్ సుంకాలను.. ఎలా ఎదుర్కొందాం

ABN , Publish Date - Aug 29 , 2025 | 02:54 AM

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ విధించిన 50 శాతం సుంకాలతో.. ఇప్పటి వరకూ ఆ దేశానికి భారత్‌ నుంచి వెళ్తున్న దాదాపు 4,820 కోట్ల డాలర్ల..

India Plans Export: ట్రంప్ సుంకాలను.. ఎలా ఎదుర్కొందాం

ట్రంప్‌ సుంకాలపై కేంద్రం కసరత్తు

  • అమెరికాయేతర మార్కెట్లకు విస్తరణ

  • 40 కీలక దేశాల గుర్తింపు.. భారతీయ ఉత్పత్తుల ఎగుమతుల పెంపునకు కార్యాచరణ

  • ఎగమతిదార్లను ఆదుకోవడం కోసం రూ.25 వేల కోట్లతో మిషన్‌

  • స్టాక్‌మార్కెట్లపై సుంకాల ప్రభావం.. రెండు రోజుల్లో రూ.9.6 లక్షల కోట్ల నష్టం

న్యూఢిల్లీ, ఆగస్టు 28: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ విధించిన 50 శాతం సుంకాలతో.. ఇప్పటి వరకూ ఆ దేశానికి భారత్‌ నుంచి వెళ్తున్న దాదాపు 4,820 కోట్ల డాలర్ల (రూ.4,22,384 కోట్ల) విలువైన ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడనుంది. సుంకాల వల్ల అమెరికా మార్కెట్లలో భారతీయ సరుకుల ధరలు భారీగా పెరిగిపోవటంతో.. ఇతర దేశాల (సుంకం పోటు తక్కువగా ఉన్న దేశాల) సరుకులతో పోటీ పడలేని పరిస్థితి. మరి, ఇంత భారీ నష్టాన్ని భర్తీ చేసుకునేదెలా? ప్రస్తుతం కేంద్ర సర్కారు దీనిపైనే తీవ్రంగా కసరత్తు జరుపుతోంది. ఇందులో భాగంగా, ఇక మీదట అమెరికాయేతర దేశాల మార్కెట్లపై ఎక్కువగా దృష్టి సారించాలని నిర్ణయించింది. వీటిలో బ్రిటన్‌, జపాన్‌, దక్షిణ కొరియా, జర్మనీ, ఫ్రాన్స్‌, ఇటలీ, స్పెయిన్‌, నెదర్లాండ్స్‌, పోలండ్‌, కెనడా, మెక్సికో, రష్యా, బెల్జియం, టర్కీ, యూఏఈ, ఆస్ట్రేలియా తదితర 40 దేశాలున్నాయి. ఈ దేశాల్లో ఇతర సరుకులతోపాటు వస్త్ర పరిశ్రమ ఎగుమతులకు అత్యధిక ప్రాధాన్యమివ్వాలని ప్రభుత్వం భావిస్తోంది (అమెరికా సుంకాలతో తీవ్రంగా నష్టపోతున్నది వస్త్ర పరిశ్రమనే). దీనిపై ఓ అధికారి మాట్లాడుతూ, ‘ప్రతీ దేశంలోనూ లక్ష్యిత వ్యూహంతో ముందుకెళ్లాలని అనుకుంటున్నాం. నాణ్యమైన, వినూత్నమైన ఉత్పత్తులను ఎగుమతి చేయటమేకాదు.. ఆయాదేశాలు ఆధారపడతగిన, విశ్వసించదగిన సరఫరాదారుగా పేరు తెచ్చుకునేలా కృషి చేస్తాం. ఈ కార్యాచరణలో ఆయాదేశాల్లోని భారతీయ రాయబార కార్యాలయాలతోపాటు ‘ఎగుమతి ప్రోత్సాహక మండళ్లు’ కూడా కీలకపాత్ర పోషించనున్నాయి’ అని వెల్లడించారు.


220 దేశాలకు ఎగుమతులు

భారత్‌ ప్రపంచవ్యాప్తంగా 220కిపైగా దేశాలకు ఎగుమతులు చేస్తోంది. వీటిలో బ్రిటన్‌, జపాన్‌, దక్షిణ కొరియాలతో కూడిన 40 దేశాలు అత్యంత కీలకమైనవి. ఈ దేశాలు ఏటా 59,000 కోట్ల డాలర్ల (రూ.51,70,000 కోట్లు) విలువైన జౌళి ఉత్పత్తులు, వస్త్రాలను దిగుమతి చేసుకుంటున్నాయి. ఇంతటి భారీ మార్కెట్లో మనదేశం వాటా 5-6ు మాత్రమే. అంటే, ఈ దేశాల్లో మన మార్కెట్‌ వాటాను పెంచుకోవటానికి పుష్కలమైన అవకాశాలున్నాయి. దీనివల్లే ట్రంప్‌ సుంకాల నేపథ్యంలో.. వీటిపై కేంద్రం దృష్టి పెట్టింది. ఈ కార్యాచరణలో కీలకంగా భావిస్తు న్న ఎగుమతి ప్రోత్సాహక మండళ్లు.. ఆయా దేశాల్లో మార్కెట్‌ మ్యాపింగ్‌, అధిక డిమాండ్‌ ఉన్న ఉత్పత్తుల గుర్తింపు మీద నిశితమైన అధ్యయనం జరిపి మార్గదర్శకాలను వెలువరిస్తాయి. అంతర్జాతీయ ట్రేడ్‌ఫెయిర్లలో, ఎగ్జిబిషన్లలో, కొనుగోలు-అమ్మకందారు సమావేశాల్లో భారత్‌ బ్రాండ్‌ను బలంగా ముందుకు తీసుకెళ్తాయి. భారత ఎగుమతిదారులు అంతర్జాతీయ ప్రమాణాలను పాటించేలా చేయటం, ఆయాదేశాల మార్కెట్లలోకి వెళ్లటానికి అవసరమైన పత్రాలను సంపాదించుకోవటంలో దిశానిర్దేశం చేస్తాయి. మరోవైపు, భారతీయ ఎగుమతిదారులను రక్షించటానికి రూ.25 వేల కోట్లతో ‘ఎగుమతి ప్రోత్సాహక మిషన్‌’ను ఏర్పాటు చేయనున్నట్లు సంబంధిత అధికార వర్గాలు తెలిపాయి. కాగా, ట్రంప్‌ సుంకాలతో వస్త్రాలు, ముత్యాలు, ఆభరణాలు, రొయ్యలు, లెదర్‌ పరిశ్రమలపై ముఖ్యంగా.. ఎక్కువ మంది కార్మికులు పని చేసే రంగాలపై తీవ్రంగా ప్రభావం పడుతోంది. ఈ నేపథ్యంలో, ఆయా రంగాలకు చెందిన ఎగుమతిదారులతో ఈ వారంలో కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖ సమావేశం కానుంది. ప్రత్యామ్నాయాల అన్వేషణ, అమెరికాయేతర మార్కెట్లకు ప్రాధాన్యం, కొత్త మార్కెట్లలోకి వెళ్లటం తదితర అంశాలను సమగ్రంగా చర్చించనున్నట్లు సమాచారం. ప్రస్తుతానికైతే, అమెరికా సుంకాలకు పోటీగా ఆ దేశంపై ప్రతీకార సుంకాలు విధించే యోచన ఏమీ లేదని అధికారవర్గాలు తెలిపాయి.

స్టాక్‌మార్కెట్ల పతనం

అమెరికా 50% సుంకాల ప్రభావం తీవ్రంగానే ఉంటోంది. మంగళ, గురువారాల్లో స్టాక్‌మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. ఫలితంగా, మదుపరులు రూ.9.6 లక్షల కోట్ల మేర నష్టపోయినట్లు మార్కెట్‌ నిపుణులు అంచనా వేశారు.


ఇవి కూడా చదవండి

బస్సు బీభత్సం.. ప్రమాదంలో ఆరుగురి మృతి, ఏడుగురికి గాయాలు

యువకుల అత్యుత్సాహం.. ప్రాణం మీదకు తెచ్చిన పందెం..

Updated Date - Aug 29 , 2025 | 05:27 AM