India On PoK Unrest: పీఓకేలో పాక్ మానవ హక్కుల ఉల్లంఘన.. భారత్ నిప్పులు
ABN , Publish Date - Oct 03 , 2025 | 08:16 PM
పాక్ ప్రభుత్వం తమ వనరులను దోచుకుంటోందని, తమకు కనీస హక్కులు, న్యాయం జరగాలని డిమాండ్ చేస్తూ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ పీఓకేలో చేపట్టిన ఆందోళనలపై పాక్ బలగాలు అత్యంత పాశవికంగా విరుచుకుపడుతున్నాయి.
న్యూఢిల్లీ: పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (PoK)లో జరుగుతున్న ప్రజాందోళనలపై పాక్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును భారత్ తీవ్ర స్థాయిలో తప్పుపట్టింది. ఇస్లామాబాద్ అణచివేత రాజకీయాలే ఇందుకు కారణమని దుయ్యబట్టింది. పీఓకేలో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనకు పాకిస్థాన్ బాధ్యత వహించాలని కేంద్ర విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ (Randhir Jaiswal) శుక్రవారం నాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ అన్నారు.
'ఆక్రమిత జమ్మూకశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో నిరసనలు జరుగుతుండటం, ప్రజలపై పాక్ బలగాల దారుణాలను గమనిస్తున్నాం. పాకిస్థాన్ అణచివేత విధానాలతోపాటు ఆ ప్రాంతాల నుంచి వనరుల దోపిడీ సాగిస్తోంది. పాకిస్థాన్ బలవంతపు, చట్టవిరుద్ధమైన ఆక్రమణలో ఉన్న ఆ ప్రాంతంలోని వనరులను వ్యవస్థాగతంగా దోచుకునేందుకు ఈ ధోరణలో వ్యవహరిస్తోంది. ఈ క్రూరమైన మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతున్న పాక్ కచ్చితంగా ఇందుకు బాధ్యత వహించాల్సి ఉంటుంది' అని రణ్‌ధీర్ జైశ్వాల్ అన్నారు.
12 మంది పౌరులు మృతి
పాక్ ప్రభుత్వం తమ వనరులను దోచుకుంటోందని, తమకు కనీస హక్కులు, న్యాయం జరగాలని డిమాండ్ చేస్తూ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (JAAC) పీఓకేలో చేపట్టిన ఆందోళనలపై పాక్ బలగాలు అత్యంత పాశవికంగా విరుచుకుపడుతున్నాయి. సైన్యం కాల్పుల్లో ఇంతవరకూ 12 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో పీఓకేలో మొబైల్, ఇంటర్నెట్ సేవలను నిలివేశారు. ముజఫరాబాద్‌లోని హోటళ్లు, దుకాణాలు, వాణిజ్య సముదాయాలు మూతపడ్డాయి. ఈ వ్యవహారంపై భారత్ ప్రభుత్వం తొలిసారిగా శుక్రవారం నాడు స్పందించింది.
ఇవి కూడా చదవండి..
జాగ్రత్త.. ఉగ్రవాదాన్ని ఆపకపోతే ప్రపంచ పటం నుంచి తుడిచేస్తాం..
పాక్‌ను మోకాళ్లపై కూర్చోబెట్టాం.. ఐఏఎఫ్ చీఫ్ గూస్‌బమ్స్ కామెంట్లు
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి