Share News

Tejaswi Yadav on IRCTC case: రాజకీయ కక్షతోనే కేసు.. బీజేపీపై పోరాటం ఆగదు

ABN , Publish Date - Oct 13 , 2025 | 03:31 PM

రైల్వేలకు రూ.90,000 కోట్ల లాభం చేకూర్చిన వ్యక్తి లాలూ అని, ప్రతి బడ్జెట్‌లోని రైల్వే టిక్కెట్ ధరలను తగ్గించారని, రైల్వే మంత్రిగా ఆయన చిరకాలం గుర్తుండిపోతారని తేజస్వి యాదవ్ అన్నారు.

Tejaswi Yadav on IRCTC case: రాజకీయ కక్షతోనే కేసు.. బీజేపీపై పోరాటం ఆగదు
Tejaswi Yadav

న్యూఢిల్లీ: ఐఆర్‌సీటీసీ కేసులో లాలూ ప్రసాద్ యాదవ్ పైన, తన తల్లి రబ్రీదేవి, తనపైన ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు అభియోగాలు దాఖలు చేయడంపై రాష్ట్రీయ జనతాదళ్ (RJD)నేత తేజస్వి యాదవ్ (Tejaswi Yadav) స్పందించారు. ఈ కేసుపై తమ పోరాటం కొనసాగుతుందని చెప్పారు.


రాజకీయ ప్రతీకారంతో పెట్టిన కేసు ఇదని, లాలూ ప్రసాద్ యాదవ్ చరిత్ర సృష్టించిన రైల్వే మంత్రి అని, ఈ నిజం బీహార్ ప్రజలకే కాకుండా యావత్ దేశానికి తెలుసునని సోమవారంనాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ తేజస్వి చెప్పారు. 'ఈ కేసుపై పోరాడతాం. ఎన్నికలు దగ్గర పడినప్పుడు కేసును తెరపైకి తెస్తారనే విషయాన్ని మొదట్నించి నేను చెబుతూనే ఉన్నాను. కోర్టు తీర్పును గౌరవిస్తున్నాను. దీనిపై మేము పోరాడతాం. బీహార్ ప్రజలు చాలా తెలివైనవారు, ఏం జరిగిందో వారందరికీ తెలుసు. ఇది కచ్చితంగా రాజకీయ కక్షే' అని అన్నారు.


రైల్వేలకు రూ.90,000 కోట్ల లాభం చేకూర్చిన వ్యక్తి లాలూ అని, ప్రతి బడ్జెట్‌లోని రైల్వే టిక్కెట్ ధరలను తగ్గించారని, రైల్వే మంత్రిగా ఆయన చిరకాలం గుర్తుండిపోతారని అన్నారు. లాలూను స్టడీ చేసేందుకు హార్వార్డ్ నుంచి విద్యార్థులు కూడా వస్తుంటారని, మేనేజిమెంట్ గురుగా ఆయనకు ఎంతో పేరుందని చెప్పారు. ఈ నిజం బీహార్ ప్రజలకే కాకుండా యావత్ దేశానికి తెలుసునని అన్నారు. తాను బతికున్నంత కాలం బీజేపీపై పోరాడుతూనే ఉంటానని తేజస్వి స్పష్టం చేశారు.


ఐఆర్‌సీటీసీ హోటల్ అవినీతి కేసులో రైల్వే శాఖ మాజీ మంత్రి లాలూ యాదవ్, రబ్రీ దేవి, తేజస్వి తదితరులపై మోసం, నేరపూరిత కుట్ర తదితర అభియోగాలను ఢిల్లీ కోర్టు సోమవారంనాడు దాఖలు చేసింది. లాలూ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు రాంచీ, పూరీలో ఐఆర్‌సీటీసీ హోటల్స్‌కు టెండర్లలో అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలకు సంబంధించిన కేసు ఇది. ఈ కేసులో నిందితులు 14 మందిపై అభియోగాల నమోదుకు తగిన ఆధారాలున్నాయని కోర్టు తీర్పు సందర్భంగా పేర్కొంది. అయితే తాము ఎలాంటి తప్పిదాలు చేయలేదని, కేసును ఎదుర్కొంటామని లూలా తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు.


ఇవి కూడా చదవండి..

ఐఆర్‌సీటీసీ హోటల్స్ టెండర్స్ కేసు.. ఎన్నికల వేళ లాలూ కుటుంబానికి భారీ షాక్

పశ్చిమ బెంగాల్‌లో ఎమ్‌బీబీఎస్ స్టూడెంట్ అత్యాచారం కేసు.. సంచలన విషయాలు వెలుగులోకి..

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Oct 13 , 2025 | 03:37 PM