Gujarat Cabinet Ministers Resign: గుజరాత్ కేబినెట్ సంచలన నిర్ణయం..
ABN , Publish Date - Oct 16 , 2025 | 04:50 PM
గుజరాత్ రాష్ట్ర కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది. గుజరాత్ కేబినెట్‌లోని మంత్రులంతా ఇవాళ(గురువారం) రాజీనామా చేశారు. మరికాసేపట్లో గవర్నర్‌ను సీఎం భూపేంద్ర పటేల్ కలవనున్నారు.
అహ్మదాబాద్: గుజరాత్ రాష్ట్ర క్యాబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది. గుజరాత్ కేబినెట్‌లోని మంత్రులంతా ఇవాళ(గురువారం) రాజీనామా చేశారు. సీఎం భూపేంద్ర పటేల్ మినహా మిగిలిన 16మంది మంత్రులంతా తమ పదవులకు గుడ్ బై చెప్పారు. కాగా, మరికాసేపట్లో గవర్నర్‌ను ముఖ్యమంత్రి భూపేంద్ర కలవనున్నారు. అయితే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేయాలని నిర్ణయించడంతో మంత్రులంతా రాజీనామా చేయాల్సి వచ్చింది. రేపు(శుక్రవారం) కొత్త మంత్రివర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు 'గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ మంత్రివర్గాన్ని శుక్రవారం మధ్యాహ్నం 12:39 గంటలకు విస్తరించనున్నారు' అని వెల్లడిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది.
అయితే, మంత్రివర్గ విస్తరణలో భాగంగా సగం మంది వరకూ పాత మంత్రులే ఉండొచ్చని తెలుస్తోంది. అలాగే 10 మంది వరకూ కొత్త వారిని మంత్రులుగా తీసుకునే అవకాశం ఉందని సమాచారం. ధర్మేంద్ర సిన్హ్, రిషికేశ్ పటేల్, ముఖేష్ పటేల్, భూపేంద్రసింగ్ చుడాసమా తిరిగి తమ మంత్రి పదవులను దక్కించుకునే అవకాశం ఉందని.. అలాగే కనుభాయ్ దేశాయ్, రాఘవ్జీ పటేల్, కున్వర్జీ బవలియా, మురుభాయి బెరా స్థానంలో కొత్త వారిని తీసుకునే అవకాశాలు ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాగా, ప్రస్తుతం గుజరాత్ మంత్రివర్గంలో సీఎం పటేల్ సహా 17మంది మంత్రులు ఉన్నారు. ఎనిమిది మంది క్యాబినెట్ స్థాయి మంత్రులు కాగా.. మిగతా వారు సహాయ మంత్రులుగా ఉన్నారు. గుజరాత్ అసెంబ్లీలో మెుత్తం 182 మంది సభ్యులు ఉన్నారు. ఈ 182 మంది సభ్యులున్న అసెంబ్లీలో 27 మంది లేదా మొత్తం సభలో 15శాతం మంది మంత్రులు ఉండొచ్చు.
మరోవైపు నూతన మంత్రివర్గ ప్రమాణస్వీకారానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా బీజేపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు భారీగా హాజరవుతారని భావిస్తున్నారు. ఈ మేరకు గురువారం నాటికి బీజేపీ ఎమ్మెల్యేలంతా గాంధీనగర్‌కు చేరుకోవాలని పార్టీ సైతం ఆదేశాలు జారీ చేసింది. అయితే, మంత్రి పదవులు ఎవరెవరికి దక్కుతాయనే అంశం ఇప్పుడు గుజరాత్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.
ఇవి కూడా చదవండి
క్యాన్సర్ గెలిచింది.. ఇదే నా చివరి ఏడాది.. యువకుడి ఎమోషనల్ పోస్ట్..
అవి పాకిస్థాన్ యుద్ధ ట్యాంకర్లేనా.. అఫ్గాన్ వీధుల్లో ర్యాలీ.. పాక్ మంత్రి ఏమన్నారంటే..