Share News

Vijay Rupani: సాయంత్రం గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ అంత్యక్రియలు

ABN , Publish Date - Jun 16 , 2025 | 10:28 AM

Vijay Rupani: గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ మృత దేహాన్ని సోమవారం ఉదయం 11:30 గంటలకు అధికారులు రూపానీ కుటుంబసభ్యులకు అప్పగిస్తారు. అక్కడి నుంచి పార్థివ దేహాన్ని ప్రత్యేక విమానంలో రాజ్‌కోట్‌కు తరలిస్తారు. ఇవాళ సాయంత్రం ప్రభుత్వ లాంఛనాలతో విజయ్ రూపానీ అంత్యక్రియలు జరగనున్నాయి.

Vijay Rupani: సాయంత్రం గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ అంత్యక్రియలు
Vijay Rupani funeral

Gujarat: అహ్మదాబాద్ (Ahmedabad) ఘోర విమాన ప్రమాదం (Plane Crash)లో మృతి చెందిన గుజరాత్ (Gujarat) మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ (Ex CM Vijay Rupani) మృత దేహాన్ని మరికాసేపట్లో కుటుంబ సభ్యులకు అందించనున్నారు. ప్రభుత్వ లాంఛనాలతో రాజ్‌కోట్‌లో ఆయన అంత్యక్రియలు (State Honours Funeral) జరగనున్నాయి. కాగా ఈ విమాన ప్రమాదంలో దాదాపు 279 మంది వరకు మృతి చెందారు. ఈ క్రమంలో విజయ్ రూపానీ మృత దేహాన్ని ఆదివారం గుర్తించారు. ఆయన కుటుంబ సభ్యులు ఇచ్చిన డీఎన్ఏ మేరకు మృత దేహాన్ని వైద్యులు గుర్తించారు. సోమవారం ఉదయం 11:30 గంటలకు సివిల్ ఆస్పత్రి నుంచి రుపానీ మృత దేహాన్ని ఆయన కుటుంబ సభ్యులకు అప్పగిస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు రేపానీ పార్థివ దేహం రాజ్‌కోట్‌కు చేరుకుంటుంది. సాయంత్రం 5 గంటలకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ క్రమంలో గుజరాత్ రాష్ట్ర బీజేపీ నేతలు ఇప్పటికే విజయ్ రూపానీ నివాసానికి చేరుకుంటున్నారు.


విజయ్ రూపానీ మృత దేహం గుర్తింపు..

ఎయిరిండియా విమాన ప్రమాదంలో కన్నుమూసిన గుజరాత్‌ మాజీ సీఎం విజయ్‌ రూపానీ మృతదేహాన్ని వైద్యులు ఆదివారం గుర్తించారు. ఆయన కుటుంబసభ్యుల డీఎన్‌ఏతో సరిపోల్చి నిర్ధారించామని తెలిపారు. గుజరాత్‌ సీఎం భూపేంద్ర పటేల్‌ స్వయంగా రూపానీ కుటుంబసభ్యులను కలిసి ఈ విషయం చెప్పారని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రుషికేష్‌ పటేల్‌ వెల్లడించారు. రూపానీ మృతదేహాన్ని ప్రత్యేక విమానంలో రాజ్‌కోట్‌కు తరలించి సోమవారం సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఎయిరిండియా విమానం కూలిన ఘటనలో 241 మంది ప్రయాణికులు, సిబ్బందితోపాటు వైద్య విద్యార్థులు, వైద్యులు, వారి కుటుంబసభ్యులు, హాస్టల్‌ మెస్‌లోని పనివారు, ఆ ప్రాంతంలో ఉన్నవారు కలిపి మరో 38 మంది మృతిచెందిన విషయం తెలిసిందే. విమాన ప్రమాదంలో భారీ పేలుడుతోపాటు మంటలు వ్యాపించడంతో.. చాలా మంది మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి. చాలా మృతదేహాలు ఛిద్రమై భాగాలు చెల్లాచెదురుగా పడ్డాయి. వాటన్నిటినీ అహ్మదాబాద్‌ నగర సివిల్‌ ఆస్పత్రి మార్చురీకి తరలించారు.


ప్రమాద స్థలాన్ని పరిశీలించిన పీకే మిశ్రా..

మృతదేహాలు, భాగాల నుంచి శాంపిళ్లు సేకరించి.. ఆ డీఎన్‌ఏతో కుటుంబసభ్యుల డీఎన్‌ఏను సరిపోల్చే ప్రక్రియ చేపట్టారు. అన్ని భాగాలకు డీఎన్‌ఏ విశ్లేషణ చేయాల్సి వస్తుండటంతో ఆలస్యం జరుగుతోందని వైద్యులు తెలిపారు. ఆదివారం సాయంత్రం వరకు 47 మృతదేహాలకు డీఎన్‌ఏ విశ్లేషణ పూర్తయిందని, అందులో 24 దేహాలను కుటుంబసభ్యులకు అప్పగించామని చెప్పారు. అయితే ముక్కలు ముక్కలుగా ఉన్న కొన్ని శరీర భాగాలను అప్పగిస్తుండటంతో.. కుటుంబసభ్యులు తీవ్రంగా ఆవేదనకు లోనవుతున్నారు. పూర్తి మృతదేహాన్ని అప్పగించాలని వైద్యులను వేడుకుంటున్నారు. ఇక తమ వారి మృతదేహాల గుర్తింపు ఎప్పుడు పూర్తవుతుందా అని ఎదురుచూస్తున్న కుటుంబసభ్యులు, బంధువుల రోదనలతో ఆస్పత్రి ప్రాంగణంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మరోవైపు ఘటనా స్థలంలో శిథిలాల తొలగింపు, సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. ప్రధాని మోదీ కార్యాలయ ముఖ్య కార్యదర్శి పీకే మిశ్రా ఆదివారం విమాన ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారిని పరామర్శించారు. ఎయిరిండియా విమాన ప్రమాదంపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్‌ మోహన్‌ నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ సోమవారం మధ్యాహ్నం తొలి భేటీ నిర్వహించనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి.


ఇవి కూడా చదవండి:

ఇష్టారాజ్యంగా కొందరు ఐఏఎస్‌ల తీరు..

హైదరాబాద్ వస్తున్న విమానానికి బాంబు బెదిరింపు

For More AP News and Telugu News

Read Latest and Crime News

Updated Date - Jun 16 , 2025 | 01:13 PM