Justice BR Gavai: రాజ్యాంగమే అత్యున్నతమైంది: సీజేఐ
ABN , Publish Date - Jun 26 , 2025 | 12:50 PM
దేశంలో పార్లమెంట్ అత్యున్నతమైనదని.. ఆ తర్వాతే రాజ్యాంగమంటూ తీవ్ర చర్చ జరుగుతుంది. అలాంటి వేళ ఈ అంశంపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్ తన అభిప్రాయాన్ని తెలిపారు.
ముంబై, జూన్ 26: దేశంలో తనకు భారత రాజ్యాంగమే అత్యున్నతమైనదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ స్పష్టం చేశారు. రాజ్యాంగం కింద మిగిలిన మూడు విభాగాలు పని చేస్తాయని ఆయన పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బీఆర్ గవాయ్ బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారి ఆయన స్వస్థలం మహారాష్ట్రలోని అమరావతికి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయనను స్థానికులు ఘనంగా సత్కరించారు. అనంతరం జస్టిస్ బీఆర్ గవాయ్ మాట్లాడుతూ.. కొంత మంది పార్లమెంట్ అత్యున్నతమైనదని చెబుతారని.. ఆ తర్వాతే రాజ్యాంగమని పేర్కొంటారన్నారు. కానీ తనకు మాత్రం రాజ్యాంగమే అత్యున్నతమైనదని చెప్పారు.
ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం కింద శాసన, న్యాయ, కార్యనిర్వహాక వర్గాలు పని చేస్తాయని వివరించారు. వీటిపై నిత్యం చర్చ జరుగుతునే ఉంటుదన్నారు. అయితే పార్లమెంటుకు సవరించే అధికారం ఉందని.. కానీ అది రాజ్యాంగం యొక్క ప్రాథమిక నిర్మాణాన్ని మాత్రం మార్చలేమని పేర్కొన్నారు. రాజ్యాంగ విలువలతోపాటు సూత్రాలకు సంరక్షకుడిననే విషయాన్ని న్యాయమూర్తి నిత్యం గుర్తుంచుకోవాలని తెలిపారు. మనకు అధికారం మాత్రమే కాకుండా మనపై బాధ్యత సైతం ఉందన్నారు.
ఈ సందర్భంగా తన చిన్ననాటి సంఘటనలను జస్టిస్ బీఆర్ గవాయ్ గుర్తు చేసుకున్నారు. చిన్నతనంలో తాను ఆర్కిటెక్ట్ కావాలనుకున్నానన్నారు. కానీ తన తండ్రి మాత్రం న్యాయవాది కావాలని.. అందుకోసం న్యాయ శాస్త్రం అభ్యసించాలని సూచించారని చెప్పారు. తన తండ్రి న్యాయవాది కావాలని అనుకున్నారని.. కానీ స్వతంత్ర పోరాటంలో పాల్గొని ఆయన జైలుకు వెళ్లడంతో.. తన తండ్రి కల నెరవేరలేదని ఈ సందర్భంగా జస్టిస్ బీఆర్ గవాయ్ వివరించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రైలు పట్టాలపై యువతి హల్‌చల్.. నిలిచిన రైళ్లు
మెక్సికోలో కాల్పులు.. 12 మంది మృతి
For More National News and Telugu News