Share News

Nagulapally: రైలు పట్టాలపై యువతి హల్‌చల్.. నిలిచిన రైళ్లు

ABN , Publish Date - Jun 26 , 2025 | 10:36 AM

నాగులపల్లి సమీపంలో యువతి హల్‌చల్‌ చేసింది. రైలు పట్టాలపై కారు నడిపింది. ఈ విషయాన్ని గ్రామస్థులు గమనించారు. వెంటనే ఆ యువతి వద్దకు వెళ్లి.. కారును పక్కకు తీయాలని సూచించే ప్రయత్నం చేశారు. కానీ..

Nagulapally: రైలు పట్టాలపై యువతి హల్‌చల్.. నిలిచిన రైళ్లు

హైదరాబాద్, జూన్ 26: రంగారెడ్డి జిల్లా నాగులపల్లి నుంచి శంకర్ పల్లి వెళ్లే మార్గంలో రైలు పట్టాలపై కారు నిలిపిన యువతి హల్‌చల్ చేసింది. గమనించిన నాగులపల్లి గ్రామస్థులు.. యువతి నడుపుతున్న కారును అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ కారును రైలు పట్టాలపై వేగంగా నడుపుతూ ఆమె ముందుకు వెళ్లిపోయింది. దీంతో గ్రామస్థులు వెంటనే రైల్వే సిబ్బందికి సమాచారం అందించారు. సిబ్బంది సమాచారం మేరకు రంగంలోకి దిగిన రైల్వే అధికారులు.. ఆ మార్గంలో ప్రయాణించే రైల్వే పైలెట్లకు సమాచారం అందించారు.

Lady.jpg


దీంతో ఆ మార్గంలో ప్రయాణిస్తున్న రైళ్లను నిలిపివేయగా.. కొన్ని గంటలపాటు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో రైలులోని ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరోవైపు సదరు మహిళపై పోలీసులకు స్థానికులు ఫిర్యాదు చేశారు. వారు వెంటనే అక్కడికి చేరుకుని.. రైలు పట్టాలపై కారు నిలిపిన మహిళను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కారుతోపాటు ఆమెను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆమెను పోలీసులు విచారిస్తున్నారు.

train-01.jpg


పట్టాలపై కారు నడిపిన యువతిని రవికా సోనికాగా పోలీసులు గుర్తించారు. ఆమె స్వస్థలం ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో అని చెప్పారు. హైదరాబాద్‌లోని ఒక సంస్థలో ఆమె సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా విధులు నిర్వహిస్తుందన్నారు. కానీ ఇటీవల ఆమెను విధుల నుంచి తొలగించారని పేర్కొన్నారు. నాగులపల్లి- శంకర్‌పల్లి మధ్య సుమారు ఏడు కిలోమీటర్ల మేర రైలు పట్టాలపై ఆమె కారు నడిపిందన్నారు.

car-01.jpg


అయితే ఆమె మద్యం సేవించడం లేదా డ్రగ్స్ తీసుకోవడం వల్ల ఈ విధంగా వ్యవహరించిందా? లేకుంటే మరేమైనా అనారోగ్య సమస్యలు ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అందుకోసం ఆమెను సమీపంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే రీల్స్ కోసమే ఆమె ఈ నిర్వాకానికి పాల్పడినట్లు సమాచారం. ఆమె చేసిన ఈ పని కారణంగా.. రెండు గంటలపాటు రైళ్లు ఆ మార్గంలో ఆగిపోయాయని పోలీసులు చెప్పారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మెక్సికోలో కాల్పులు.. 12 మంది మృతి

నదిలో పడిన బస్సు.. ఒకరు మృతి.. ప్రయాణికులు గల్లంతు

For More Telangana News and Telugu News

Updated Date - Jun 26 , 2025 | 12:31 PM