HMPV Virus : ఈ లక్షణాలు మీలో కనిపిస్తే కొత్త వైరస్ సోకినట్లే..
ABN , Publish Date - Jan 06 , 2025 | 10:36 AM
కరోనా తరహాలోనే చైనాలో వేగంగా వ్యాప్తి చెందుతూ కలకలం సృష్టిస్తున్న కొత్త వైరస్ హ్యూమన్ మెటానిమోవైరస్ (HMPV) భారత్‌కూ పాకింది.. తొలి కేసు ఎక్కడ నమోదైందంటే..

కరోనా తరహాలోనే చైనాలో వేగంగా వ్యాప్తి చెందుతూ కలకలం సృష్టిస్తున్న కొత్త వైరస్ హ్యూమన్ మెటానిమోవైరస్ (HMPV) భారత్‌కూ పాకింది. బెంగళూరులో ఎనిమిది నెలల వయసున్న ఓ చిన్నారికి ఈ వైరస్ సోకినట్లు పరీక్షల్లో తేలింది. జాతీయ మీడియా కథనాల్లో ప్రచారం చేస్తున్నట్లుగా రాష్ట్రంలోని ఏ ల్యాబ్‌లో ఇలాంటి పరీక్షలు నిర్వహించలేదని కర్ణాటక ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అయితే, ప్రైవేటు ఆస్పత్రి వైద్యులు పరీక్షలు నిర్వహించి విడుదల రిపోర్ట్‌పై తమ ప్రభుత్వానికి ఎలాంటి అనుమానాలు లేవని తెలిపింది. మొత్తంగా, ఈ కేసు విషయమై కేంద్ర ఆరోగ్య శాఖ నుంచి ఇంకా స్పందన రాలేదు.
కరోనా మహమ్మారి తర్వాత చైనాలో పుట్టుకొచ్చిన మరో కొత్త వైరస్ HMPV ఇప్పుడు భారత్‌కూ పాకింది. ఈ వైరస్ వేగంగా ఇతర దేశాలకు వ్యాప్తి చెందడం చూసి ప్రపంచదేశాల్లో కలవరం మొదలైంది. చైనాలో ఈ మధ్యే బయటపడిన హ్యూమన్ మెటానిమోవైరస్ (HMPV) వేగంగా విస్తరిస్తున్నట్లు సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతోంది. ఈ వైరస్ బారిన పడి పెద్ద సంఖ్యలో ఆస్పత్రుల ముందు క్యూ కట్టిన రోగుల ఫొటోలు వైరల్ అయ్యాయి. హెచ్‌ఎంపీవీతో పాటు ఇన్‌ఫ్లూయెంజా ఏ, మైకోప్లాస్మా, న్యుమోనియా, కొవిడ్-19 వైరస్‌లు కూడా వ్యాప్తి చెందుతున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటివరకూ చైనాలోనే ఎక్కువగా కనిపించిన హెచ్‌ఎంపీవీ వైరస్ కేసులు ఇప్పుడు మలేషియాలోనూ విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీంతో మళ్లీ కరోనా తరహా పరిస్థితి వస్తుందేమో అని అన్ని దేశాల ప్రజల్లో ఆందోళన మొదలైంది.
HMPV అంటే ఏమిటి?
HMPV అనేది శ్వాసకోశ వ్యాధులు కలిగించే ఒక రకమైన వైరస్. ఇది పిల్లలు, వృద్ధులు, బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్న వ్యక్తులను వేగంగా ప్రభావితం చేస్తుంది. దీని లక్షణాలు సాధారణంగా ఫ్లూ లాగా ఉంటాయి. ఈ వైరస్ సోకినవారిలో జ్వరం, గొంతు నొప్పి, దగ్గు ఉంటుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడతారు. HMPV వైరస్ తీవ్రమైతే న్యుమోనియా, బ్రాంకైటిస్ వచ్చేందుకు అవకాశముంది.
HMPV లక్షణాలను వెంటనే గుర్తించకపోతే ప్రమాదకరంగా మారే అవకాశముందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి, ఈ కింది లక్షణాలుంటే నిర్లక్ష్యం చేయకండి.
1. నిరంతర జ్వరం
2. దగ్గు, గొంతు నొప్పి
3. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
4. అలసట, బలహీనత