PM Modi Bihar Tour : కాంగ్రెస్, ఆర్జేడీ చొరబాటుదారుల్ని ప్రోత్సహిస్తున్నాయి, త్వరలో జనాభా మిషన్: ప్రధాని మోదీ
ABN , Publish Date - Aug 22 , 2025 | 02:36 PM
దేశంలోకి అక్రమ చొరబాటుదారుల జనాభా పెరగడం ఆందోళన కలిగించే విషయమని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ఈ ప్రమాదాన్ని ఎదుర్కోవడానికి తాను ఒక జనాభా మిషన్‌ను ప్రతిపాదించానని..
గయా జీ (బీహార్), ఆగస్టు 22 : దేశంలోకి అక్రమ వలసదారుల జనాభా పెరగడం ఆందోళన కలిగించే విషయమని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ఈ ప్రమాదాన్ని ఎదుర్కోవడానికి తాను ఒక జనాభా మిషన్‌ను ప్రతిపాదించానని, ఇది త్వరలో తన పనిని ప్రారంభిస్తుందని ఇవాళ (శుక్రవారం) బీహార్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు.
బీహార్ సరిహద్దు ప్రాంతాల్లో జనాభా వేగంగా మారుతోందని దేశంలోకి వస్తున్న చొరబాటుదారులు బీహార్ రాష్ట్ర ప్రజల హక్కులను లాక్కోవడానికి అనుమతించబోమని ప్రధాని చెప్పారు. కాంగ్రెస్, RJD పార్టీలు తమ ఓటు బ్యాంకును పెంచుకోవడానికి తమ బుజ్జగింపు విధానాలు అవలంభిస్తున్నాయని మోదీ చెప్పారు.
ఇందులో భాగంగానే బీహార్ ప్రజల హక్కులను హరించి, అక్రమ వలసదారులకు ఇవ్వాలని కాంగ్రెస్, ఆర్జేడీలు కోరుకుంటున్నాయని ప్రధాని ఆరోపించారు. బీహార్ లోని గయా జీలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించిన మోదీ..'డబుల్ ఇంజిన్' NDA ప్రభుత్వం ఈ ఆటలు సాగనివ్వదని పేర్కొన్నారు. భారతీయులకు ఉద్దేశించిన అవకాశాలను అక్రమ వలసదారులు లాక్కుంటుంటే చూస్తూ ఊరుకోబోమని, దేశ భవిష్యత్తును పరాయివాళ్ల చేతుల్లో పెట్టనివ్వమని తేల్చిచెప్పారు.
కొత్తగా ప్రారంభించిన 'హై-పవర్ డెమోగ్రఫీ మిషన్' గురించి ప్రస్తావిస్తూ మోదీ.. ఈ మిషన్ త్వరలో ప్రారంభమవుతుందని, ఈ ప్రభుత్వం భారతదేశం నుండి 'ప్రతి అక్రమ వలసదారుడిని తరిమివేస్తుందని' ప్రధాని మోదీ అన్నారు. 'ఈ ముప్పును ఎదుర్కోవడానికి, నేను ఒక జనాభా మిషన్‌ను ప్రారంభించాలని ప్రతిపాదించాను. ఈ మిషన్ త్వరలో తన పనిని ప్రారంభిస్తుంది. మేము ప్రతి వలసదారుడిని తరిమివేస్తాం. దేశంలోని ఈ వలసదారుల మద్దతుదారుల పట్ల బీహార్ ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. కాంగ్రెస్, ఆర్జేడీ బీహార్ ప్రజల హక్కులను లాక్కొని, చొరబాటుదారుల్ని సంతృప్తి పరచడానికి, వారి ఓటు బ్యాంకును పెంచుకోవడానికి ఆ పార్టీలు చూస్తున్నాయి' అని ప్రధాన మంత్రి అన్నారు.
ఇవి కూడా చదవండి:
కాలాపానీ ప్రాంతం మీదుగా చైనాతో వాణిజ్యంపై నేపాల్ అభ్యంతరాలు.. ఖండించిన భారత్
పుతిన్, జెలెన్‌స్కీ భేటీకి ఏర్పాట్లు జరుగుతున్నాయి: డొనాల్డ్ ట్రంప్
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి